మార్కెట్ క్యాపిటలైజేషన్ (Market Capitalisation) విషయంలో టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి భారత ఐటీ కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొంటుంది. ముఖ్యంగా శివ్ నాడార్ (Shiv Nadar)కి చెందిన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL Technologies) అజీమ్ ప్రేమ్‌జీకి చెందిన విప్రో (Wipro) ఐటీ కంపెనీల మధ్య ఎప్పుడూ నెక్-టు-నెక్ పోటీ ఉంటుంది. అయితే ఇలాంటి పోటీలో తాజాగా మరోసారి మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా హెచ్‌సీఎల్ విప్రోను ఓడించింది. గత రెండేళ్లుగా హెచ్‌సీఎల్ టెక్ విప్రో కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించడం కొత్తేమీ కాదు కానీ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ఇప్పటిదాకా వెనుకబడి ఉంది. కానీ ఇప్పుడు ఆదాయం, లాభాలు, మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా హెచ్‌సీఎల్ టెక్ విప్రోను అధిగమించిందని ఓ లేటెస్ట్ నివేదిక వెల్లడించింది.ప్రస్తుతం హెచ్‌సీఎల్ టెక్ రూ.2.54 లక్షల కోట్లకు (Rs 2.54 Trillion) పైగా మార్జిన్డ్ మార్కెట్ క్యాప్‌తో విప్రో కంటే ముందు స్థానానికి ఎగబాకింది. అలాగే భారతదేశపు 3వ అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించింది. కాగా ఇప్పుడు విప్రో మార్కెట్ విలువ రూ.2.26 లక్షల కోట్లు (Rs 2.26 Trillion)గా ఉంది.
ఇక రెండు ఐటీ కంపెనీల షేర్ల ధరలను పరిశీలిస్తే, గతేడాది సమయంలో రెండు షేర్ల ధరల్లోనూ భారీ పతనం నమోదయింది. హెచ్‌సీఎల్ టెక్ షేరు ధర 20.76 శాతం పడిపోగా, విప్రో షేరు ధర ఏకంగా 35.58 శాతం పతనమైంది. విప్రో మార్కెట్ క్యాప్ తగ్గడానికి షేరు ధరలలో ఈ భారీ పతనం ఒక కారణం కావచ్చు.
అయితే విప్రో ఐటీ రంగంలో సాధించిన ఘనత తక్కువేం కాదు. నిజానికి ఈ కంపెనీ ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థగా లాంచ్ కాలేదు. వినడానికి ఒకింత ఆశ్చర్యంగా అనిపించినా ఈ కంపెనీ మొదటగా నెయ్యి, వనస్పతి, రిఫైన్డ్ నూనెలు విక్రయించింది. 1945లో విప్రో స్థాపించడం జరిగింది.
మొదట్లో వెస్ట్రన్ ఇండియా వెజిటబుల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (Western India Vegetable Products Limited)గా ఈ కంపెనీ ఉనికిలోకి వచ్చింది. తర్వాత దీనిని విప్రోగా పిలవడం స్టార్ట్ చేశారు. కంపెనీ ప్రారంభమైన కొన్ని దశాబ్దాలుగా వెజిటేబుల్, రిఫైన్డ్ ఆయిల్స్ తయారు చేసింది.
ఇది కూడా చదవండి : ఐదేళ్ల లోపు పిల్లలకు రైలు టికెట్లు బుక్ చేయండిలా
ఆ తర్వాత 1977లో అజీమ్ ప్రేమ్‌జీ తన తండ్రి నుంచి కంపెనీ పగ్గాలు చేపట్టారు. దాదాపు ఒక దశాబ్దం తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో భారీ మార్పు కనిపించింది. జూన్ 7, 1977న కంపెనీ పేరు వెస్ట్రన్ ఇండియా వెజిటబుల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ నుంచి విప్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్‌గా మారింది.
1982లో పేరు మళ్లీ విప్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ నుండి విప్రో లిమిటెడ్‌గా మార్చబడింది. మరోవైపు HCL ఎంటర్‌ప్రైజ్ 1976లో స్థాపించడం జరిగింది. హెచ్‌సీఎల్ ఎంటర్‌ప్రైజ్ పరిశోధన, అభివృద్ధి విభాగమైన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 1991లో అనుబంధ సంస్థగా ఉద్భవించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BUSINESS NEWS, Hcl, TCS, Wipro