ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటెయిల్ స్టోర్ల నిర్వహణ బాధ్యతను ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries) తీసుకుంది. ఇప్పుడా స్టోర్లు అన్ని రిలయన్స్ రిటెయిల్ పేరుతో రీబ్రాండ్ అవుతాయి.
ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటెయిల్ స్టోర్ల(Retail Stores) నిర్వహణ బాధ్యతను ముఖేశ్ అంబానీ(Mukesh Ambani) నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్(RelianceIndustries) తీసుకుంది. ఇప్పుడా స్టోర్లు అన్ని రిలయన్స్ రిటెయిల్ పేరుతో రీబ్రాండ్ అవుతాయి. దీనిని సానుకూల చర్యగా భావిస్తున్న సరఫరదారులు, స్టోర్ స్థలయజమానులు, ఉద్యోగులు(Employees) స్వాగతిస్తున్నారు. గత కొంతకాలంగా దెబ్బతిన్న వ్యాపారం తిరిగి కోలుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యూచర్ రిటెయిల్ స్టోర్స్ లీజులన్నీ రిలయన్స్(Reliance) పేరుతో ఉండటం, ఆ స్థల యజమానులకు లీజు చెల్లింపులు జరపడం సహ వర్కింగ్ కేపిటల్ కోసం ఫ్యూచర్ గ్రూప్ సమస్యలు ఎదుర్కుంటడంతో వాటిని రిలయన్స్ స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. ఈ స్టోర్‌లోని ఉద్యోగులకు రిలయన్స్ ఉద్యోగాలు ఆఫర్ చేస్తుంది కాబట్టి ఫ్యూచర్ గ్రూప్ రిటెయిల్ నెట్వర్క్ పరిధిలోని దాదాపు 30 వేల మంది ఉద్యోగులకు ఇప్పుడు ఉద్యోగాల్లో కొనసాగే అవకాశం లభిస్తోంది.
ఈ మార్పును ఈ రంగానికి చెందిన వ్యక్తులు స్వాగతిస్తున్నారు. నెలలుగా సాగుతున్న అనిశ్చితి నుంచి ఉద్యోగులకు ఉపశమనం లభించి సకాలంలో జీతాలు అందుకోగలరని భావిస్తున్నారు. కొంత కాలంగా జీతాలు పాక్షికంగా అందుతుండటంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు బలమైన రిలయన్స్ గ్రూప్ స్వాధీనం చేసుకోవడం వలన సకాలంలో జీతాలు అందుకుంటామని ఉద్యోగులు అంటున్నారు. అలాగే వెండార్లు, సరఫరాదారులు కూడా తమ బకాయిలు విడుదలవుతాయనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెద్ద కార్పొరేట్ సంస్థ పరం కావడం వలన కొత్త వ్యాపార అవకాశాలు లభించడంతోపాటు ప్రస్తుత వ్యాపారం కూడా సుస్థిరంగా ఉంటుందని నమ్ముతున్నారు.
ఉద్యోగులతో పాటు రిటెయిల్ రంగంలోని ప్రతీ ఒక్కరికి ఇది మంచి పరిణామమని అంబెస్టెన్ మార్కెటింగ్ సొల్యూషన్స్‌కు చెందిన షమ్మీ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. ఇది కొత్త అవకాశాలకు ద్వారాలు తెరవడంతో పాటు చెల్లింపు సమస్య సమసిపోతుందని అన్నారు. ఇది చాలా పెద్ద సమస్య. దాదాపు ఏడు సంవత్సరాలుగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ రంగంలో దిగ్గజ సంస్థలైన రిలయన్స్ రాక వలన డబ్బు అంతా తిరిగి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
సరఫరాదారులకుపెద్ద ఊరట..
అటు ఫ్యూచర్ రిటెయిల్ స్టోర్స్ ఉన్న భవనాల యజమానులు కూడా తమ ప్రాంగణాలను రిలయన్స్‌కు లీజుకు ఇవ్వడం ప్రారంభించారు. రిలయన్స్‌తో చర్చల సందర్భంగా పాత బకాయిల చిక్కులు తొలగడంతో పాటు ఇకపై తమ అద్దెలు సకాలంలో అందుతాయని భావిస్తున్నారు. గడిచిన రెండు సంవత్సరాలుగా ఫ్యూచర్ గ్రూప్ అద్దె చెల్లించడం లేదని, ఇప్పుడు రిలయన్స్ స్వాధీనం చేసుకోవడంతో తమకు పెద్ద ఊరటనిచ్చిందని సరఫరాదారులు చెబుతున్నారు. కొవిడ్ సమయంలో తాను అద్దెకిచ్చిన ఈజీ డే ఔట్లెట్ చిల్లగవ్వ కూడా అద్దె చెల్లించలేదని గుర్తు చేసుకుంటున్నారు.
అటు హైదరాబాద్‌లో హెరిటేజ్ స్టోర్‌కు అద్దెకిచ్చిన సాయి శక్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధ్యక్షుడు డాక్టర్ ఎన్పీవీఎస్ రాజు మాట్లాడుతూ.. ఫ్యూచర్ గ్రూప్ తీసుకున్నప్పటి నుంచి అద్దె చెల్లింపులు సక్రమంగా జరగలేదని అన్నారు. అంతే కాదు స్టోర్స్ నిర్వహణ కూడా సరిగ్గా లేదని వాపోయారు. అమ్మకాలు తగ్గిపోయాయి, ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గిపోయిందని గుర్తు చేశారు. కరెంట్ బిల్లులు కూడా సకాలంలో కట్టకపోవడంతో పవర్ కట్స్ కూడా ఉన్నాయని అన్నారు. ఇప్పుడు రిలయన్స్ స్వాధీనం చేసుకోవడం వలన హెరిటేజ్ స్టోర్స్‌కు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక స్టోర్స్ భవిష్యత్ బాగుంటుందని రాజు భావిస్తున్నారు.
బకాయిలన్నీ తీరిపోతాయని రుణాదాతలు ఆశాభావం..
రిటైల్‌రంగంలో అగ్రగామిగా ఉన్న ఫ్యూచర్ గ్రూప్ రెండేళ్లుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. సకాలంలో రుణాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ఫ్యూచర్ గ్రూప్ వ్యాపారాన్ని నియంత్రించే అధికారం తమకే ఉంటుందని మధ్యలో అమెజాన్ చక్రం తిప్పింది. అయితే, అది దేశ చట్టాల ఉల్లంఘన కావడం, ఎప్డీఐ నిబంధనలు అనుమతించకపోవడం వలన అమెజాన్ అడుగులు పడటం లేదు. కాని ఫ్యూచర్‌ను నియంత్రించాలన్న అమెజాన్ ఆకాంక్ష కారణంగా చట్టపరమైన చిక్కులు ఏర్పడ్డాయి.
ఈ కారణంగా ఉద్యోగుల్లో అనిశ్చితి ఏర్పడటంతో వ్యాపారం తగ్గింది. మరోవైపు బకాయిదారులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో దివాలా దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది. మరోవైపు నష్టాల బారిన పడ్డ స్టోర్స్‌ను రిలయన్స్ స్వాధీనం చేసుకోవడంతో దివాలా ప్రక్రియలో జాప్యం చోటుచేసుకోవచ్చు. మరో వైపు రిలయన్స్ రాక వలన తమ పాత బకాయిలన్నీ తీరిపోతాయని రుణదాతలు ఆశిస్తున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.