NiyoX app: బ్యాంకుల ఎఫ్‌డీల కంటే ఈ సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లు ఎక్కువ... తెలుసుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

ఆర్థిక సేవలను అందించే నియో సంస్థ ఏకంగా సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపైనే ఏడు శాతం వడ్డీని అందిస్తామని ప్రకటించింది. NiyoX యాప్ ద్వారా కస్టమర్లు ఈ సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు.

  • Share this:
కరోనా తరువాత బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. ప్రముఖ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అందించే వడ్డీ ఆరు శాతానికి తక్కువే ఉంది. కానీ ఆర్థిక సేవలను అందించే నియో సంస్థ ఏకంగా సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్లపైనే ఏడు శాతం వడ్డీని అందిస్తామని ప్రకటించింది. NiyoX యాప్ ద్వారా కస్టమర్లు ఈ సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. బ్యాంకింగ్ సేవలను విస్తరించేందుకు నియో.. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, వీసా కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఈ సేవింగ్స్ అకౌంట్‌పై వచ్చే వడ్డీ రేటు ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేటు కంటే తక్కువ కావడం విశేషం. NiyoX సేవింగ్స్ అకౌంట్లో రూ.1లక్ష వరకు ఉండే డిపాజిట్లపై 3.5 శాతం వడ్డీని పొందవచ్చు. రూ.1 లక్షకు పైగా చేసే డిపాజిట్లపై నియో సంస్థ 7 శాతం వడ్డీని అందిస్తోంది. ప్రస్తుతం 5-10 సంవత్సరాలకు చేసే ఎఫ్‌డీలపై స్టేట్‌బ్యాంక్ 5.4 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 6.2 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్‌లో రూ.1లక్ష వరకు చేసే డిపాజిట్లపై కేవలం 2.7 శాతం మాత్రమే వడ్డీ వస్తుంది. కానీ నియోస్ అత్యధికంగా ఏడు శాతం సేవింగ్స్ వడ్డీ రేటును ప్రకటించింది.

యువత కోసం ప్రత్యేక సేవలు
NiyoX యాప్‌ సేవింగ్స్, వెల్త్ మేనేజ్మెంట్ అకౌంట్‌గా పనిచేస్తుంది. యువత అభిరుచులు, ఆలోచనలకు అనుగుణంగా తమ ప్లాట్‌ఫాంను అభివృద్ధి చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, వీసా పార్టనర్ షిప్‌తో సేవలను విస్తరిస్తామని వెల్లడించింది. ఈ సంవత్సరం చివరి నాటికి 20 లక్షల మంది కస్టమర్లను చేర్చుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

సర్వే ఆధారంగా సేవలు
కొత్త సేవలను ప్రారంభించడానికి ముందు మిలీనియల్స్‌పై సర్వే చేశామని నియో ప్రకటించింది. కోవిడ్-19 తరువాత ప్రముఖ నగరాల్లోని 8000 మంది మిలీనియల్స్‌పై అధ్యయనం చేసినట్లు పేర్కొంది. మన దేశంలోని 70 శాతం మంది యువత డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై ఆసక్తి చూపిస్తున్నారని సర్వేలో తేలింది. రివార్డులు, ఆఫర్ల కోసం బ్యాంకులను తరచుగా మారుస్తున్నామని 55 శాతం మంది చెప్పారు. మెరుగైన వడ్డీ రేట్ల కోసం బ్యాంకులను మారుస్తామని 45 శాతం మంది చెప్పారు. ఈ సర్వే ఆధారంగానే కొత్త NiyoX అకౌంట్‌ ఆలోచనను ముందుకు తీసుకెళ్లినట్లు నియో ప్రకటించింది.

NiyoX అకౌంట్‌ ఉపయోగాలు
NiyoX అనేది సేవింగ్స్, వెల్త్ అకౌంట్‌గా పనిచేస్తుంది. ఆన్‌లైన్‌ ద్వారా కేవలం ఐదు నిమిషాల్లోనే ఈ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఈ అకౌంట్‌కు ఎలాంటి మెయింటెనెన్స్ ఛార్జీలు వర్తించవు. వర్చువల్ డెబిట్ కార్డు ద్వారా ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. KYC, బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తి చేసిన తరువాత ఫిజికల్ డెబిట్ కార్డును ఆర్డర్ చేయవచ్చు. జూన్ వరకు ఈ కార్డులను ఉచితంగానే అందించనున్నారు. ఈ అకౌంట్ ద్వారా మ్యూచువల్ ఫండ్లలో చేసే పెట్టుబడులపై ఎలాంటి కమిషన్ ఉండదు.

నియో యాప్‌లో కస్టమర్లు తమ పోర్ట్‌ఫోలియోను చూసుకోవచ్చు. దీంతోపాటు తమ క్రెడిట్ రిపోర్టును ఉచితంగా పొందవచ్చు. ఇవే కాకుండా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్, పీఓఎస్ పర్చేజ్‌లు చేసేవారికి ఈక్విటాక్స్ లాయల్టీ పాయింట్లు లభిస్తాయి. వీటిని డిస్కౌంట్ కూపన్లుగా వాడుకోవచ్చు. త్వరలోనే నియో యాప్‌లో దేశీయ అంతర్జాతీయ స్టాక్స్ వ్యాపారం కూడా ప్రారంభించనున్నారు.
Published by:Nikhil Kumar S
First published: