విశాఖ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరింత దృష్టి పెట్టింది. ఈ మేరకు విశాఖ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ బిల్డింగ్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(Airport Authority of India)కు రూ.240 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు పంపించింది. ఇటీవల ఎయిర్‌పోర్ట్ అడ్వైజరీ కమిటీ (Airport Advisory Committee) నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఎయిర్‌పోర్టుకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.
ప్రస్తుతం ఉన్న టెర్మినల్ బిల్డింగ్ మాదిరిగానే మూడో టెర్మినల్ బిల్డింగ్ విస్తరణకు వచ్చే ఐదేళ్ల కాలానికి రూ.240 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. ఇందులో భాగంగా మరో నాలుగు అదనపు పార్కింగ్ బేల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతానికి ఎయిర్‌పోర్టులో మొత్తంగా 18 ‘పార్కింగ్ బే’లు ఉన్నాయి. తాజా ప్రతిపాదనలతో ఈ సంఖ్య 22కు చేరుకోనుంది.
అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అధ్యక్షతన రివ్యూ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విమానాశ్రయ టెర్మినల్ బిల్డింగ్ విస్తరణతో పాటు వివిధ సమస్యలపై కూడా సభ్యులు ప్రస్తావించారు. ముఖ్యంగా స్లాట్ సమస్యను నొక్కి చెప్పారు. స్లాట్ కేటాయింపుల్లో భాగంగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య కేవలం ఒక ఫ్లైట్‌కు మాత్రమే రాకపోకలుకు అవకాశం కల్పించారు.
ఇది కూడా చదవండి : పర్సనల్ లోన్ వర్సెస్ గోల్డ్ లోన్.. రెండింటిలో ఏది మంచిదో తెలుసుకోండి!
మధ్యాహ్నం 3 నుంచి 4గంటల మధ్య విమానం ల్యాండ్ కాగా, 7 నుంచి 8 గంటల మధ్యలో టేక్ ఆఫ్ తీసుకునేలా అనుమతి ఇచ్చారని సమావేశంలో దృష్టికి తీసుకొచ్చారు. ఎయిర్ కార్గో విషయంపై కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీని సభ్యులు కోరారు. గత మూడు నెలలుగా ఎయిర్ కార్గో సేవలు నిలిచిపోవడం గురించి ఎంపీ దృష్టికి సభ్యులు తీసుకొచ్చారు.
* ఎయిర్‌పోర్టు ఆధునికీకరణ
దేశంలోని ధనిక విమానాశ్రయాల్లో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ తొమ్మిదో స్థానంలో ఉంది. కానీ, ర్యాంకుల పరంగా 19వ స్థానంలో ఉంది. దీంతో ఈ విషయంపై అడ్వైజరీ కమిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్ట్ ఆధునికీకరణకు తగు చర్యలు తీసుకోవాలని విమానాశ్రయ డైరెక్టర్‌కు సూచించారు. టాప్ 10 స్థానాల్లో చోటు దక్కించుకునేలా అభివృద్ధి చేయాలన్నారు.
మరోవైపు, ఎయిర్‌పోర్టు ఫ్లోర్, రూఫ్ నాణ్యత లోపాలపై ఛైర్మన్ సత్యనారాయణ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. నూతన బిల్డింగ్ సుందరీకరణకు కన్సల్టెంట్‌లను నియమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాగా, మూడో టెర్మినల్ బిల్డింగ్ ప్రతిపాదనలపై విశాఖ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ప్రస్తుతం రెండు టెర్మినల్ బిల్డింగ్ భవనాలు ఉన్నాయి. కొత్త టెర్మినల్ బిల్డింగ్ భవనాన్ని 2009లో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో పాత టెర్మినల్ బిల్డింగ్‌ను సరకు రవాణా అవసరాలకు ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి, నూతన టెర్మినల్ బిల్డింగ్ భవనాన్ని తొలుత రూ.160 కోట్లతో చేపట్టారు. అనంతరం ప్రయాణికుల సంఖ్య పెరిగింది. దీంతో మరో రూ.60 కోట్లతో రెండో దశ విస్తరణ పనులను అధికారులు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Airport, Andhra Pradesh, AP News, Visakhapatnam, Vizag