ఐపీఎల్ (IPL) 16వ ఎడిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది. దాదాపు రెండు నెలల పాటు జరిగే ఈ టోర్నీ, క్రికెట్ అభిమానులకు పంచే ఆనందం అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న ఈ మెగా టోర్నీ అంటే మీకూ ఇష్టమా? ప్రతి రోజూ తప్పకుండా ఫాలో అవుతుంటారా? అయితే మీకు ఎంతో ఇష్టమైన ఐపీఎల్ నుంచే ఇప్పుడు ఆర్థిక పాఠాలు నేర్చుకోవచ్చు. వినోదంతో పాటు ఆర్థిక క్రమశిక్షణ కూడా నేర్చుకోవచ్చు. అదెలాగంటారా? అయితే ఈ టిప్స్ మీకోసమే చదివేయండి.
* పరిస్థితులను బట్టి మారాలి
ఐపీఎల్ ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్, గత సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేదు. నాలుగు సార్లు ఛాంపియన్‌గా అవతరించిన సీఎస్‌కే కూడా బొక్కబోర్లాపడింది. దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే ఐపీఎల్‌లో గత ప్రదర్శనలు ఏవీ లెక్కలోకి రావు. పర్సనల్ ఫైనాన్స్ విషయంలో కూడా అంతే. అనేక పెట్టుబడి ఆప్షన్స్ గతంలో బాగా పనిచేసి ఉండవచ్చు. అయితే భవిష్యత్తులో కూడా అవి అలాగే పని చేయకపోవచ్చు. కాబట్టి పరిస్థితులను బట్టి మార్పులు చేర్పులు చేసుకోవాలి.
* ఆటపై మాత్రమై ఫోకస్
ఐపీఎల్‌లో ఆటతో పాటు ఫేమ్ కూడా ఉంటుంది. కొందరు ఆటగాళ్లు డబ్బు, పేరు ప్రతిష్టలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చు. అయితే అత్యుత్తమ ఆటగాళ్లు ఇవేవి పట్టించుకోకుండా ప్రదర్శనపైనే దృష్టి పెడతారు. తెలివైన పెట్టుబడిదారులు కూడా తమ డబ్బును తెలివిగా మేనేజ్ చేయాలి. ఇతరులు ఇచ్చే సలహాలు, సూచనలతో వెంటనే పెట్టుబడి పెట్టకూడదు. అన్ని రకాలుగా ఆలోచించి మన లక్ష్యాలకు అనుగుణంగా వేటిలో పెట్టుబడి పెడితే ఎక్కువ ఫలితం ఉంటుందో దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి.
ఇది కూడా చదవండి : రాసిపెట్టుకోండి భయ్యా.. ఫ్యూచర్ అంతా ఈ ఇద్దరిదే.. కళాత్మక విధ్వంసం వీరి సొంతం..
* మంచి ఆరంభం
ఐపీఎల్ మ్యాచ్‌ల్లో మంచి ఆరంభం అనేది విజయాన్ని దాదాపు ఖాయం చేస్తుంది. బ్యాటింగ్‌కు దిగిన జట్టు 200 పరుగులు చేసినా, లేక బౌలింగ్ చేసిన జట్టు తొలి 10 ఓవర్లలోనే సగం మందిని పెవిలియన్‌కు పంపినా జట్టు గెలిచే అవకాశం ఉంటుంది. అదేవిధంగా, వ్యక్తిగత ఫైనాన్స్‌లో ముందస్తు ఆర్థిక ప్రణాళిక మీ లక్ష్యాలను త్వరగా సాధించేలా చేయడమే కాకుండా ఎక్కువ రాబడిని అందిస్తుంది. ముందుగానే పొదుపు చేయడం ప్రారంభిస్తే, ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో మీరు విజేతగా నిలుస్తారు.
* చివరి వరకు కొనసాగడం
ఐపీఎల్ అంటేనే ఉత్కంఠకు మారుపేరు. చివరి బాల్‌కు ఫలితం తేలిన మ్యాచ్‌లు ఇప్పటివరకు ఎన్నో చూశాం. ఇదే విషయం మీ వ్యక్తిగత ఫైనాన్స్‌కు వర్తిస్తుంది. వర్క్ లైఫ్‌లో ప్రారంభంలోనే పెట్టుబడి పెట్టకపోయింటే అన్నీ కోల్పోయినట్లు కాదు. ఎందుకంటే తరువాత జీవితం చాలా ఉంది. మీ గమ్యాన్ని చేరుకునే వరకు మీ ప్రణాళికకు కట్టుబడి, స్థిరంగా చివరి వరకు కొనసాగండి. అనుకున్న ప్రయోజనం పొందవచ్చు.
* కష్టపడితేనే ఫలితం
రుతురాజ్ గైక్వాడ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, రాహుల్ త్రిపాఠి వంటి ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి వెలుగులోకి వచ్చారు. జాతీయ జట్టులో చోటు సంపాదించారు. అందుకు కారణం పట్టుదలతో ఎంతో కష్టపడ్డారు. వ్యక్తిగత ఫైనాన్స్‌లో కూడా ఏదో ఒక సమయంలో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. తక్కువ జీతం ఉన్న వారు క్రమశిక్షణతో చిన్న మొత్తాలతో పెట్టుబడి పెట్టడం వల్ల కొన్నేళ్ల తరువాత గణనీయమైన కార్పస్‌ను క్రియేట్ చేయవచ్చు.
* సమీక్ష తప్పనిసరి
టాస్ గెలిచినప్పటి నుంచి ఫీల్డ్ సెట్ చేసి బౌలింగ్ లైనప్‌ను ఎంచుకునే వరకు ఐపీఎల్ మ్యాచ్ అనేది వ్యూహాత్మక గేమ్. కెప్టెన్ మ్యాచ్ ప్రారంభంలో, చివరిలో వ్యూహాలను సమీక్షిస్తుంటాడు. వ్యక్తిగత ఫైనాన్స్‌లో వయసు, రిస్క్, ఆదాయ వనరు, ఆధారపడిన వ్యక్తులు వంటి అంశాలను సమీక్షించుకుని వివిధ సాధనాల్లో పొదుపు, పెట్టుబడి పెట్టాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IPL 2023, Personal Finance, Savings