వివిధ మార్గాల ద్వారా ఇప్పుడు సులువుగా పీఎఫ్ ఖాతా వివరాలను తెలుసుకొనే సదుపాయం ఉంది. యూఏఎన్ నంబరు లేకున్నా సరే వివరాలను పొందే అవకాశం ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరం(Financial Year) ప్రారంభంలో, ఉద్యోగి చేయాల్సిన మొదటి పని ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడం. ప్రతి నెలా ఒక ఉద్యోగి ప్రాథమిక జీతంలో 12 శాతాన్ని పీఎఫ్(PF) ఖాతాకు నిర్ణీత కంట్రిబ్యూషన్‌గా చెల్లిస్తారు. సంబంధిత యజమాని సమాన మొత్తాన్ని జమ చేస్తారు.
PF కార్యాలయాన్ని సందర్శించకుండా లేదా యజమానిని అడగకుండానే PF బ్యాలెన్స్‌ను తెలుసుకోవడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి. ప్రావిడెంట్ ఫండ్ (EPF) బ్యాలెన్స్‌ని ఈ ఐదు మార్గాల ద్వారా తెలుసుకోవచ్చు..
EPFO వెబ్సైట్
EPFO వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన తర్వాత.. ఎంప్లాయ్ సెక్షన్ కింద 'ఎంప్లాయ్ పాస్‌బుక్'పై క్లిక్ చేయాలి. UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయడం ద్వారా, PF పాస్‌బుక్‌ని చూడవచ్చు. ఉద్యోగి, యజమాని జమ చేసిన మొత్తం, ప్రారంభ, ముగింపు బ్యాలెన్స్ వివరాలను చూపుతుంది. పొందిన PF వడ్డీ, ఏదైనా PF బదిలీ ట్రాన్సాక్షన్లు ఉంటే ఆ వివరాలు కూడా కనిపిస్తాయి. ఒకవేళ సంబంధిత ఉద్యోగి UANకి ఒకటి కంటే ఎక్కువ ప్రావిడెంట్ ఫండ్ నంబర్లు యాడ్ అయి ఉంటే, అవన్నీ కూడా తెలుస్తాయి. ఆ PF ఖాతా బ్యాలెన్స్ తెలుసుకోవడానికి నిర్దిష్ట సభ్యుల IDపై క్లిక్ చేయాలి.
యూనిఫైడ్ పోర్టల్
మొదట ఉద్యోగి UAN, పాస్‌వర్డ్‌తో యూనిఫైడ్ పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి. ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్‌ను తెలుసుకోవడానికి PF పాస్‌బుక్‌ని చూసే అవకాశం ఉంది. వివిధ ఆర్థిక సంవత్సరాల్లో జమ అయిన PF వివరాలను తెలుసుకోవచ్చు.
PF బ్యాలెన్స్ చెక్ SMS
మొబైల్లో EPF బ్యాలెన్స్ తెలుసుకోవడానికి SMS సేవలను వినియోగించుకోవచ్చు. ఈ సేవను ఉపయోగించుకోవడానికి 7738299899 నంబర్‌కు EPFOHO UAN ENG అని టైప్ చేసి SMS పంపాలి. UAN లేకుండా PF బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఈ సదుపాయం ఉపయోగపడుతుంది. కేవలం 7738299899కి SMS పంపితే సరిపోతుంది. అయితే అది సంబంధిత ఉద్యోగి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి కచ్చితంగా పంపాల్సి ఉంటుంది. SMS పంపిన తర్వాత చివరి PF జమైన వివరాలు.. KYCకి సంబంధించిన వివరాలకు, బ్యాలెన్స్ వివరాలు మెసేజ్ వస్తాయి.
PF బ్యాలెన్స్ చెక్ మిస్డ్ కాల్
EPF బ్యాలెన్స్ చెక్ కోసం మొబైల్ ఫోన్‌ని ఉపయోగించవచ్చు. దీని కోసం UAN కూడా అవసరం లేదు. దీని కోసం EPFO అందించిన మిస్డ్ కాల్ సేవను ఉపయోగించాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. రెండు రింగ్‌ల తర్వాత, కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. వినియోగదారు PF బ్యాలెన్స్ వివరాలు మెసేజ్ ద్వారా అందుతాయి. ఈ సేవ ఉచితంగా లభిస్తుంది. స్మార్ట్ ఫోన్లు లేని ఫోన్ల నుంచి కూడా ఈ సేవలు పొందే సదుపాయం ఉంది. అయితే ఉద్యోగి UAN బ్యాంక్ ఖాతా, ఆధార్ నంబర్, PAN కి లింక్ అయి ఉండాలి. సంబంధిత ఉద్యోగి మొబైల్ నంబర్ కూడా తప్పనిసరిగా యూనిఫైడ్ పోర్టల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. అప్పుడే సదరు ఉద్యోగి మిస్ట్ కాల్ ద్వారా పీఎఫ్ వివరాలను పొందే అవకాశం ఉంటుంది.
UMANG యాప్‌లో PF బ్యాలెన్స్
PF బ్యాలెన్స్, క్లెయిమ్ స్టేటస్, కస్టమర్ (KYC) స్థితిని తెలుసుకోవడానికి, ఇతర EPF వివరాలు పొందడానికి UMANG యాప్ ఉపయోగపడుతుంది. యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్-ని(UMANG) డౌన్లోడ్ చేసుకొంటే ఈపీఎఫ్ వివరాలను సులువుగా తెలుసుకొనే వీలుంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.