Covid Tax Exemption: ట్యాక్స్ చెల్లింపుదారులకు భారీ ఊరట.. కరోనా నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

కోవిడ్ క‌ష్ట‌కాలంలో ప‌న్ను చెల్లింపుదారుల‌కు కేంద్ర‌ప్ర‌భుత్వం ఊర‌ట‌నిచ్చింది. అదేంటో తెలుసుకోండి...

  • Share this:
కోవిడ్ క‌ష్ట‌కాలంలో ప‌న్ను చెల్లింపుదారుల‌కు కేంద్ర‌ప్ర‌భుత్వం ఊర‌ట‌నిచ్చింది. కోవిడ్ చికిత్స కోసం ప‌న్ను చెల్లింపుదారుడు త‌ను ప‌నిచేసే కంపెనీ నుంచి కానీ, లేదా త‌న స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషుల నుంచి తీసుకున్న మొత్తంపై ప‌న్నును మిన‌హాయిస్తున్న‌ట్టు కేంద్రం తాజాగా ప్ర‌క‌టించింది. కోవిడ్ చికిత్స కోసం తీసుకున్న మొత్తం 10ల‌క్ష‌ల‌రూపాయ‌ల వ‌ర‌కు ఈ ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. 2019 ఆర్థిక సంవ‌త్స‌రంతో పాటు త‌దుప‌రి ఆర్థిక సంవ‌త్స‌రాల‌కు ఈ విధానం వ‌ర్తిస్తుంద‌ని కేంద్రం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇక కోవిడ్‌తో మ‌ర‌ణించే ఉద్యోగి కుటుంబానికి ల‌భించే ప‌రిహారం (ఎక్స్ గ్రేషియా)పైనా ప‌న్ను ఊర‌ట‌ క‌ల్పించారు. ఇది స్వాగ‌తించ‌ద‌గ్గ ప‌రిణామం అంటున్నారు ఆర్థిక నిపుణులు.
Health Insurance: ఇంట్లో చికిత్స చేయించుకున్నా కూడా హెల్త్ ఇన్సూరెన్స్.. బీమా సంస్థలకు IRDA కీలక ఆదేశాలు

కోవిడ్ కార‌ణంగా ప‌న్ను చెల్లింపుదారులు అనేక అవ‌స్థ‌లు ప‌డుతున్నారు.ఇలాంటి క‌ష్ట‌కాలంలో కోవిడ్ చికిత్స‌ల‌పై 10ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను ఊర‌ట క‌ల్పించ‌డం కేంద్ర‌ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డు తీసుకున్న మంచి నిర్ణ‌యం. ఈ నిర్ణ‌యం ప‌న్ను చెల్లింపుదారుల‌కు ఎంతో కొంత ఊర‌టనిస్తుంది. అలాగే మ‌ర‌ణించిన కుటుంబాల‌కు చెల్లించే ఎక్స్ గ్రేషియాపైనా ప‌న్ను మినహాయించడంతో, బాధిత కుటుంబాలు మరింత లబ్ధి పొందనున్నాయి. ఈ నిర్ణయాలు బాధిత కుటుంబాల‌కు కొంత ఉప‌శ‌మ‌నం కల్పిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఆధార్‌, పాన్ లింక్ గ‌డువు పెంపు
పాన్‌, ఆధార్ అనుసంధాన గ‌డువుతేదీని జూన్ 30 నుంచి సెప్టెంబ‌రు 30వ‌ర‌కు పొడిగించారు. ఇన్‌క‌మ్ టాక్స్ ఈ ఫైలింగ్ పోర్ట‌ల్‌లో పాన్‌, ఆధార్ అనుసంధానం చేయ‌డానికి చాలామంది అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఈ క‌ష్టాల‌ను గ‌మ‌నించిన ప్ర‌భుత్వం తాజాగా గ‌డువును జూన్ 30 నుంచి సెప్టెంబ‌ర్ 30వ‌ర‌కు పొడిగించింది. మరోవైపు ‘వివాద్ సే విశ్వాస్’ ప‌థ‌కం కింద ఎటువంటి అద‌న‌పు రుసుము లేకుండా చెల్లింపులు చేయ‌డానికి కూడా ఆగ‌స్టు 31వ తేదీవ‌ర‌కు గ‌డువును పెంచుతున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

అసెస్‌మెంట్ ప్రొసీడింగ్స్‌, జ‌రిమానా ప్రొసీడింగ్స్ ను దాఖ‌లు చేయ‌డానికి గ‌డువును సైతం ప్రభుత్వం పెంచింది. ఇక ఆదాయ‌పు ప‌న్ను మినహాయింపు కోసం చారిట‌బుల్ ట్రస్టులు, సంస్థ‌లు రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌డానికి కూడా గ‌డువు పెంచుతూ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. దీనివ‌ల‌్ల అటు ప‌న్ను చెల్లింపుదారుల‌కు, ఇటు అధికారుల‌కు త‌గినంత స‌మ‌యం లభిస్తుంది. ఏప్రిల్ 1, 2021, సెప్టెంబ‌ర్ 29 2021 అర్ధ సంవ‌త్స‌రానికి మూల‌ధ‌న లాభాల‌పై ప‌న్ను ఆదా చేసే అవ‌కాశాన్ని కూడా ప్ర‌భుత్వం సెప్టెంబ‌ర్ 30 వ‌ర‌కు పొడిగించింది. అంటే మీ ఆస్తిపై వ‌చ్చే మూల‌ధ‌న‌ లాభాల‌ను ఆదా చేయ‌డానికి జూన్ 30వ‌ర‌కు ఉన్న గ‌డువును, ఇప్పుడు సెప్టెంబ‌ర్ 30వ‌ర‌కు పెంచారు.
Published by:Nikhil Kumar S
First published: