భారత్- చైనా సరిహద్దులోని గల్వాన్ ప్రాంతంలో రక్తపాతానికి ఏడాది పూర్తయ్యింది. గల్వాన్ ఘటన తర్వాత దేశంలో చైనా ఉత్పత్తులు, యాప్‌ల వినియోగం విషయంలో కేంద్రం వైఖరి మారింది. అదే క్రమంలో ప్రజల ఆలోచనా విధానంలో కూడా మార్పులొచ్చాయి. గత 12 నెలల్లో చైనా ఉత్పత్తుల వినియోగంపై లోకల్ సర్కిల్స్ అనే ఆన్‌లైన్ సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. చైనా ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి ఏకంగా 43 శాతం మంది నిరాకరించారని సర్వే తేల్చింది. జూన్ 1 నుంచి 10 వరకు దేశంలో 281 జిల్లాల్లో 17,800 మందితో ఈ సర్వే నిర్వహించారు.
చైనా ఉత్పత్తుల వినియోగం విషయంలో ప్రజల ఆలోచన ఇలా ఉంటే... చైనా ఉత్పత్తుల దిగుమతి మాత్రం పెరగడం విశేషం. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు దేశంలో దిగుమతి అయ్యే చైనా ఉత్పత్తులు 42 శాతం పెరిగాయి. అయితే వీటిలో ఎక్కువగా ప్రాణాలు నిలిపే వైద్య సామగ్రి ఎక్కువగా ఉన్నాయి. దీంతోపాటు ఆక్సిజన్ ఎక్విప్‌మెంట్ కూడా ఉందట. కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశంలో అమ్ముడైన పల్స్ ఆక్సీ మీటర్లలో 90 శాతం చైనావే అనేది గమనార్హం. భారతదేశం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల్లో చైనా వస్తువులు 12 శాతం ఉంటాయి. కేపిటల్ గూడ్స్ అయితే 30 శాతం, కన్జ్యూమర్ గూడ్స్ అయితే 26 శాతం ఉంటాయి.
సర్వేలో అడిగిన తొలి ప్రశ్నే... మీరు గత 12 నెలల కాలంలో చైనా ఉత్పత్తులు ఎన్ని కొన్నారు?. దీనికి 43 శాతం మంది నుంచి ‘సున్నా’ అనే సమాధానమే వచ్చింది. ఈ ఏడాది కాలంలో వాళ్లు చైనాకు చెందిన ఉత్పత్తులు ఏవీ కొనలేదు అని చెప్పారట. 34 శాతం మంది ఒకటి, రెండు ఉత్పత్తులు కొన్నామని చెప్పారు. ఎనిమిది శాతం మంది అయితే మూడు నుంచి ఐదు వస్తువులు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఐదు నుంచి 10 ఉత్పత్తులు కొనుగోలు చేసినవారైతే నాలుగు శాతం మంది ఉన్నారు. అదే 10 నుంచి 15 ఉత్పత్తులు కొనుగోలు చేసినవారి శాతం మూడుగా ఉంది. ఒక శాతం మంది 20కిపై వస్తువులు కొనుగోలు చేయగా, 15 నుంచి 20 వస్తువులు కొన్నది ఒక శాతం మంది. అయితే ఆరు శాతం మంది ఈ విషయంపై స్పందించలేదు.
చైనా ఉత్పత్తుల వాడకంపై నిషేధం అనే అంశం ఎప్పటినుంచో ఉన్నప్పటికీ... సరిగ్గా ఏడాది క్రితం గల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. అయితే ఈ ఘటనలో ఇరువైపులా ప్రాణ నష్టం జరిగినట్లు మన సైన్యం చెబుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, ప్రజల్లో వచ్చిన మార్పుతో చాలామంది చైనా ఉత్పత్తులకు దూరంగా ఉండటం మొదలుపెట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China