42nd GST Council meeting: రాష్ట్రాలకు గుడ్‌న్యూస్ వినిపించిన నిర్మలా...రూ.20 వేల కోట్ల సెస్‌పై త్వరలో నిర్ణయం

నిర్మలా సీతారామన్

42nd GST Council Meet: ఈ ఏడాది వసూలు చేసిన రూ. 20 వేల కోట్ల పరిహార సెస్ త్వరలో రాష్ట్రాలకు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ మొత్తం ప్రక్రియపై వచ్చే వారం నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు.

  • Share this:
    42nd GST Council meeting: 42వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ సమావేశం సాగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా జీఎస్టీ, ఐజీఎస్టీ సెటిల్‌మెంట్స్‌పై సమావేశంలో ముందుగా చర్చించారు. పరిహారం మొత్తం కేంద్రమే చెల్లించాలని.. పరిహారం పొందడం రాష్ట్రాల చట్టబద్ధమైన హక్కు అని పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కేంద్రాన్ని కోరారు. 42 వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశం అనంతరం ఫలితాలపై చర్చించడానికి విలేకరుల సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ఈ ఏడాది వసూలు చేసిన రూ. 20 వేల కోట్ల పరిహార సెస్ త్వరలో రాష్ట్రాలకు విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ మొత్తం ప్రక్రియపై వచ్చే వారం నిర్ణయం తీసుకుంటామని ఆమె తెలిపారు. కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇస్సాక్ ఇదే విషయం లేవనెత్తగా, చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తమకు పూర్తి పరిహారం చెల్లించాలని, 10 రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. అక్టోబర్13 న జరిగే తదుపరి సమావేశంలో దీనిపై చర్చించనున్నారు.

    5 కోట్ల కన్నా తక్కువ టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులు నెలవారీ రిటర్నులను దాఖలు చేయనవసరం లేదని, త్రైమాసిక రాబడి మాత్రమే రిటర్న్ చేస్తే సరిపోతుందన్నారు. జనవరి 1 నుండి ఈ నిర్ణయం ద్వారా పన్ను చెల్లింపుదారులు 24 రిటర్నులకు బదులుగా ఎనిమిది రిటర్నులను దాఖలు చేయవలసి ఉంటుంది.

    హెచ్‌ఎస్‌ఎన్ కోడ్ ద్వారా ఇన్ వాయిస్ మ్యాచింగ్ అలాగే ఈ రంగంలో అమ్మకాలను ట్రాక్ చేసే సామర్థ్యాన్ని ఇస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫలితంగా 5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులు 2021 ఏప్రిల్ 1 నుండి 6 అంకెలు వరకు హెచ్‌ఎస్‌ఎన్ కోడ్‌లను తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుంది.

    అయితే నిర్దిష్ట నోటిఫైడ్ క్లాస్ సరఫరాలపై మాత్రం, 8 అంకెలు అవసరమవుతాయని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) అజయ్ భూషణ్ పాండే సమావేశంలో అన్నారు.

    రిటర్నుల విషయానికొస్తే, పాన్, ఆధార్ చేత ధృవీకరించబడిన బ్యాంకు ఖాతాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. రిటర్నుల దరఖాస్తుపై ఆధార్ ద్వారా సంతకం చేయవచ్చని జిఎస్టి కౌన్సిల్ నిర్ణయించింది" అని పాండే చెప్పారు.

    ఇదిలా ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వాలకు జీఎస్‌టీ రెవిన్యూ రూ.2.35 లక్షల కోట్ల మేరకు తగ్గింది. దీనిలో రూ.97,000 కోట్లు మాత్రమే జీఎస్‌టీ అమలు వల్ల తగ్గిందని, మిగిలిన రూ.1.38 లక్షల కోట్లు కోవిడ్-19 మహమ్మారి ప్రభావం వల్ల తగ్గిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని భర్తీ చేసుకునేందుకు రెండు అవకాశాలను ఆగస్టులో ప్రకటించింది. వీటిలో ఒకటి, భారతీయ రిజర్వు బ్యాంకు ఏర్పాటు చేసిన స్పెషల్ విండో ద్వారా రూ. 97,000 కోట్లు వరకు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తెచ్చుకోవచ్చు. మరొకటి, మార్కెట్ నుంచి రూ. 2.35 లక్షల కోట్ల వరకు అప్పు తెచ్చుకోవచ్చని తెలిపింది.
    Published by:Krishna Adithya
    First published: