Home /News /business /

4 VANDE BHARAT TRAINS EVERY MONTH FROM SEPTEMBER RAILWAYS MINISTER GH VB

Vande Bharat Trains: సెప్టెంబర్ నుంచి ప్రతి నెలా 4 వందే భారత్ రైళ్లు ప్రారంభిస్తాం: రైల్వే మంత్రి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 2 వందే భారత్ రైళ్లు ఢిల్లీ-వారణాసి (Delhi-Varanasi), ఢిల్లీ-కాట్రా (Delhi-Katra) మార్గంలో నడుస్తున్నాయి. అయితే త్వరలోనే భారతదేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వందే భారత ట్రైన్స్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
అధునాతన సౌకర్యాలతో అత్యంత వేగంగా దూసుకెళ్లే వందే భారత్ రైళ్లు (Vande Bharat Trains) ఇప్పటివరకు కేవలం రెండు రూట్స్‌లోనే నడుస్తున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 2 వందే భారత్ రైళ్లు ఢిల్లీ-వారణాసి (Delhi-Varanasi), ఢిల్లీ-కాట్రా (Delhi-Katra) మార్గంలో నడుస్తున్నాయి. అయితే త్వరలోనే భారతదేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వందే భారత ట్రైన్స్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. తాజాగా కేంద్ర రైల్వే మంత్రి (Union Railways Minister) అశ్విని వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) ఈ ట్రైన్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్‌ (September) నుంచి ప్రతి నెలా నాలుగు వందే భారత్‌ రైళ్లను ప్రారంభించనున్నట్లు అశ్విని వైష్ణవ్‌ శనివారం ప్రకటించారు.

జాతీయ రైల్వే అవార్డుల సెరిమోనీలో వైష్ణవ్ మాట్లాడుతూ, "ఇండియన్ రైల్వేలను ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని మేం నిర్ణయించుకున్నాం. సెప్టెంబర్ నుంచి ప్రతి నెలా 4-5 వందేభారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపి ప్రారంభిస్తాం. బుల్లెట్ రైళ్ల తయారీ పని కూడా కొనసాగుతోంది" అని తెలిపారు. శుక్రవారం విడుదలైన భారతీయ రైల్వే అధికారిక ప్రకటన ప్రకారం, భారత్‌లో ఇప్పటికే నడుస్తున్న రెండు వందే భారత్ రైళ్లు న్యూఢిల్లీ నుంచి వారణాసి.. న్యూఢిల్లీ నుంచి వైష్ణోదేవి కాట్రా వరకు సేవలు అందిస్తున్నాయి.

Explained: ప్రభుత్వానికి RBI ట్రాన్స్‌ఫర్ చేసే డివిడెండ్‌లో భారీ తగ్గుదల.. ఈ డివిడెండ్ ఎందుకు తగ్గుతోంది..?


మరో రెండు వందే భారత్ సెమీ-హైస్పీడ్ రైళ్లు ఆగస్టు నాటికి అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు రైళ్లు చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో తయారు అవుతున్నాయి. వీటి తయారీ చివరి దశలో ఉంది. ఈ కొత్త రైళ్లు, ఈ ఏడాది ఆగస్టులో ట్రయల్స్ కోసం ట్రాక్‌లపై నడవచ్చని తెలుస్తోంది. వీటిలో ఒక్కొక్క ట్రైన్‌ని సుమారు రూ.110-120 కోట్లతో తయారు చేస్తున్నారు. మునుపటి రెండు రైళ్లకు ఒక్కోదానికి రూ.106 కోట్లు ఖర్చు చేశారు. ఆగస్టు 2023 నాటికి ఇలాంటి 75 రైళ్లను తయారు చేయగలమని రైల్వే శాఖ నమ్ముతోంది. "16-కోచ్‌ల వందే భారత్ రైలు తయారీ ఖర్చు దాదాపు రూ. 110 నుంచి రూ.120 కోట్లు అవుతుంది." అని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, చెన్నై, జనరల్ మేనేజర్ ఎ.కె. అగర్వాల్ అన్నారు. కిటికీలను మరింత వెడల్పుగా అందిస్తున్నామని, లగేజ్ కోసం ఎక్కువ స్థలం కూడా ఆఫర్ చేస్తున్నామని అగర్వాల్ పేర్కొన్నారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా 75 పెద్ద పట్టణాలను కలుపుతూ 75 వందేభారత్ రైళ్లు రానున్నాయని గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా తన బడ్జెట్ ప్రతిపాదనలలో వందే భారత్ రైళ్ల గురించి కీలక ప్రకటన చేశారు. రాబోయే మూడేళ్లలో మెరుగైన ఇంధన సామర్థ్యం, మెరుగైన ప్యాసింజర్ రైడింగ్ అనుభవం అందించే 400 వందే భారత్ రైళ్లను తయారు చేయనున్నట్లు ప్రకటించారు. వందే భారత్ దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రైలు కావడం గమనార్హం. ఈ రైలు పరీక్ష వేగం గంటకు 180 కి.మీ కాగా, గరిష్ట వేగం గంటకు 160 కి.మీ.

మరికొద్ది నెలల్లో అందుబాటులోకి రానున్న వందే భారత్ రైళ్లలో మరింత భద్రత, సౌకర్యాలు కల్పించినట్లు సమాచారం. ఫైర్ డిటెక్షన్ అలారాలు, ఎమర్జెన్సీ పుష్ బటన్లు, పుష్ బ్యాక్ సీటింగ్​ వంటి ఫీచర్లతో 75 వందేభారత్ రైళ్లు ప్రయాణికులను పలకరించనున్నాయని ఓ సీనియర్ రైల్వే అధికారి మీడియాకు వెల్లడించారు.
Published by:Veera Babu
First published:

Tags: Indian Railway, Railway news, Railways

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు