HOME »NEWS »BUSINESS »4 personal finance lessons from 2020 that must not forget in next year 2021 ns gh

Finance Lessons: 2020లో కరోనా నేర్పిన 4 ఆర్థిక పాఠాలివే.. 2021లో వీటిని అస్సలు మర్చిపోకండి

Finance Lessons: 2020లో కరోనా నేర్పిన 4 ఆర్థిక పాఠాలివే.. 2021లో వీటిని అస్సలు మర్చిపోకండి
ప్రతీకాత్మక చిత్రం

కరోనా నేపథ్యంలో ఈ ఏడాది అంతటా ఆరోగ్య సంక్షోభంతో జీవించాం. దీనితో పాటు చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడం, జీతాల్లో కోతలు చూశారు. దీంతో అందరిలోనూ ఆర్థిక క్రమశిక్షణ అలవడింది. ఈ తరుణంలోఈ ఏడాది కరోనా మనకు నేర్పిన 4 ఆర్థిక పాఠాలపై ఓ లుక్కేయండి.

  • Share this:
2020 ఏడాది కరోనా(Corona) రూపంలో ప్రతీ ఒక్కరికీ జీవితంలో మర్చిపోలేని చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఈ ఏడాది అంతటా ఆరోగ్య సంక్షోభంతో జీవించాం. దీనితో పాటు చాలా మంది ఉద్యోగాలు కోల్పోవడం, జీతాల్లో కోతలు చూశారు. దీంతో అందరిలోనూ ఆర్థిక క్రమశిక్షణ అలవడింది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడంతో ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. లాక్డౌన్(Lockdown), కరోనా సంక్రమణ ప్రమాదంతో 2020లో ఎక్కువ కాలం ఇంట్లోనే గడపాల్సి వచ్చింది. దీంతో కొంత మేర ఖర్చులు కూడా తగ్గాయి. అయితే, కరోనాతో ఏర్పడిన ఆర్థిక అంతరాయాలు దీర్ఘకాలిక ఆర్థిక దృఢత్వాన్ని నిర్వహించడం, కీలకమైన ఆర్థిక వ్యూహాలను అనుసరించడం వంటి ముఖ్యమైన ప్రాముఖ్యతను తెలియజేశాయి. దీంతో ఈ ఏడాది నేర్పిన ఆర్థిక పాఠాలు(Finance Lessons) ఇక ముందు కూడా కొనసాగించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ఏడాది కరోనా మనకు నేర్పిన 4 ఆర్థిక పాఠాలపై ఓ లుక్కేయండి.

భవిష్యత్ అవసరాల కోసం అత్యవసర నిధి


కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభించడం వల్ల ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ (Lockdown) విధించింది. దీంతో అనేక సంస్థలు మూతపడ్డాయి. తద్వారా ఎంతో మంది తమ ఉపాధిని కోల్పోయారు. అంతేకాక, ప్రజలు తాము తీసుకున్న రుణాలను తీర్చడానికి ఇబ్బందులు పడ్డారు. దీంతో వారికి కొంత మేర ఊరటనిచ్చేందుకు ఆర్‌బిఐ మారిటోరియంను ప్రకటించింది. జూలై 2020 లో ఆర్‌బిఐ విడుదల చేసిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రకారం, 2020 ఏప్రిల్ 30 నాటికి పర్సనల్ లోన్ తీసుకున్న వారిలో 50 శాతం మంది మారిటోరియం (Moratorium)ను ఎంచుకున్నారు.

ఇదిలా ఉండగా కరోనా భారిన పడితే ప్రైవేట్ హాస్పిటల్స్లో లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో తమను, తమ కుటుంబ సభ్యులను కాపాడుకోవడం కోసం అత్యవసర నిధి (Emergency Fund) ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యమని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు. భవిష్యత్లో ఎప్పుడు ఇలాంటి సంక్షోభం ఎదురైనా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేందుకు ఈ అత్యవసర నిధి (Emergency Fund) ఎంతగానో ఉపయోగపడుతుంది. అత్యవసర నిధి ఏర్పర్చుకుంటే భీమా ప్రీమియంలు, ఇంటి అద్దె, కనీసం ఆరు నెలల యుటిలిటీ బిల్లులు వంటి అనివార్యమైన ఖర్చులు ఇబ్బంది లేకుండా తీర్చవచ్చు.

ఈక్విటీ SIP లను కొనసాగించడం
కరోనా ప్రభావంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈక్విటీ మార్కెట్లు బాగా దెబ్బతిన్నాయి. దీనితో గత 3-4 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా ఈక్విటీ(Equity) SIP ల నుండి రాబడి పడిపోయింది. దీంతో చాలా మంది పెట్టుబడిదారులు భవిష్యత్లో మరింత నష్టాలు రావొచ్చనే అంచనాతో తమ ఈక్విటీ SIP లను ఆపాలని నిర్ణయించుకున్నారు. అయితే, అటువంటి మార్కెట్ అల్లకల్లోల సమయంలో SIP లను కొనసాగించడం చాలా ముఖ్యమని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి విపత్కర సమయంలో ఫండ్లను కొనుగోలు చేయడం ద్వారా చందాదారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది వారి సగటు పెట్టుబడి వ్యయాన్ని మరింత తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా వారు తమ SIP లను ఆపివేసిన వారి కంటే ఎక్కువ రాబడిని నమోదు చేస్తారని వారు అభిప్రాయపడ్డారు.

భవిష్యత్ కోసం వివిధ మార్గాల్లో పెట్టుబడి పెట్టడం
కరోనా సంక్షోభంతో పెట్టుబడిదారుల ఆలోచనల్లో మార్పులు వచ్చాయి. పెట్టుబడులన్నింటినీ ఒకే దగ్గర పెట్టకుండా, వివిధ మార్గాలను ఎన్నుకోవడం చాలా ముఖ్యమని తెలుసుకున్నారు. ఎందుకంటే ఎప్పుడూ ఒకే మార్గంలో పెట్టుబడి పెట్టడం లాభాన్ని చేకూర్చదని గుర్తించుకోవాలి. ఉదాహరణకు మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడటంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి మార్గాల వైపు చూశారు. దీనిలో భాగంగానే బంగారంలో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరిగింది.

తద్వారా బంగారానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో దీని ధర ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరింది. దీన్ని బట్టి కరోనా సంక్షోభానికి ముందు బంగారంలో పెట్టుబడి పెట్టిన వారి పంట పండిందని చెప్పవచ్చు. కాగా, మహమ్మారి సమయంలో ఫార్మా, ఎఫ్ఎంసిజి రంగాల షేర్లు లాభపడగా, ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. అందువల్ల ఎప్పుడూ ఒకే రకమైన పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవడం లాభించదు అని గుర్తించారు.

వ్యక్తిగత, ఆరోగ్య భీమా అవసరం
ఈ ఏడాది కరోనా మహమ్మారి వ్యక్తిగత భీమా, కుటుంబానికి తగిన ఆరోగ్య భీమా అవసరాన్ని చాటి చెప్పింది. మహమ్మారి కారణంగా హాస్పిటల్ ఖర్చులు భారీగా పెరగడంతో పాటు, ఇది జీవితకాల పొదుపులను ఎలా తుడిచిపెట్టగలదో చూపించింది. కరోనా సంక్షోభంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఉద్యోగాలు కోల్పోతుండటంతో, ఆయా కంపెనీలు సమకూర్చే ఆరోగ్య బీమా పథకాలపై ఆధారపడకుండా సొంతగా వ్యక్తిగత బీమా తీసుకోవాలని చాలా మంది నిర్ణయించుకున్నారు. ఇటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే మీరు మీ వార్షిక ఆదాయంలో 10 నుంచి -15 రెట్లు కవర్ చేసే, తగినంత టర్మ్ ఇన్సూరెన్స్(Term Insurance) కూడా కొనుగోలు చేయాలి. దురదృష్టవశాత్తు అకాల మరణం సంభవించినప్పుడు మీపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కొంతమేర ఇది ఆర్థికంగా అండగా నిలుస్తుంది.
Published by:Nikhil Kumar S
First published:December 30, 2020, 20:15 IST