Personal Finance: కరోనా కాలంలో ఆర్థిక సంరక్షణ కోసం ఈ పనులు తప్పకుండా చేయండి..

ప్రతీకాత్మకచిత్రం

ఆర్థిక క్రమశిక్షణతో పాటు ముందు చూపుతో కొన్ని పనులు చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎప్పటికి ఇలాంటి పరిస్థితే కొనసాగుతుందని కాకపోయినా ఇలాంటి పరిస్థితి ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండేందుకు మీ పెట్టుబడుల్లో కొన్ని అత్యావశ్యకమైన అంశాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.

  • Share this:
గతేడాది ప్రారంభమైన కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా అతలాకుతలం చేసేసింది. కొంతమంది ఉద్యోగాలు పోగొట్టుకొని ఇబ్బంది పడితే.. మరికొందరు ఆరోగ్యం పాడై ఆసుపత్రుల బిల్లుల కోసం ఉన్నవన్నీ అమ్మేయాల్సిన పరిస్థితి కూడా ఎదురైంది. ఇలాంటి పరిస్థితి మనకు ఇప్పుడే కాదు.. ముందు ముందు కూడా రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక క్రమశిక్షణతో పాటు ముందు చూపుతో కొన్ని పనులు చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎప్పటికి ఇలాంటి పరిస్థితే కొనసాగుతుందని కాకపోయినా ఇలాంటి పరిస్థితి ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండేందుకు మీ పెట్టుబడుల్లో కొన్ని అత్యావశ్యకమైన అంశాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.

ఆరోగ్య బీమా తప్పనిసరి
మీ పెట్టుబడులు ఎంత ఎక్కువగా ఉన్నా.. మీ బ్యాంకుల్లోనూ డబ్బు ఉన్నా.. ఒక్కసారి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే అందులోని చాలా భాగం హాస్పిటల్ బిల్సే మింగేస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే మీకంటూ ప్రత్యేకంగా ఆరోగ్య బీమా పాలసీ ఉండాల్సిందే. మీ ఆరోగ్య సమస్యలన్నింటినీ కవర్ చేసేలా ఈ పాలసీ ఉండేలా చూసుకోవాలి. మీతో పాటు మీ కుటుంబ సభ్యులందరికీ ఈ పాలసీ కవరేజ్ ఉండేలా చూసుకోవాలి.

అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోండి.
ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ మీకు ఆర్థిక భారం పడకుండా కాపాడుతుంది. కానీ మిగిలిన సమస్యలు ఎదురైనప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ఉండేలా అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలి. ఇది మీరు ఉద్యోగం కోల్పోవడం, లేదా జీతాలు తగ్గడం వంటి సమస్యలు ఎదురైనప్పుడు ఇబ్బంది పడకుండా మిమ్మల్ని కాపాడుతుంది. అత్యవసర నిధి ఎంత ఏర్పాటు చేసుకోవాలనే దానిపై కూడా చాలామందికి అవగాహన ఉండదు.

మీ ఖర్చులన్నింటినీ లెక్కించి మూడు లేదా ఆరు నెలల ఖర్చులు తీరేలా ఈ ఫండ్ ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మొత్తాన్ని సేవింగ్స్ అకౌంట్ లో దాస్తూ ఉంటారు చాలామంది. ఇలా చేయడం సరికాదు. సగం మొత్తాన్ని సేవింగ్ ఖాతాలో దాచి మిగిలిన సగాన్ని బాండ్లలో పెట్టుబడి పెట్టాలి. ఇది మీరు కావాలనుకున్నప్పుడు సులువుగా డబ్బుగా మార్చుకునేందుకు వీలుగా ఉంచుకోవాలి. దీనివల్ల మీకు రిస్క్ పెద్దగా ఉండదు. ఆదాయం కూడా ఎక్కువగానే లభిస్తుంది.

లాంగ్ టర్మ్ సేవింగ్స్ కూడా..
సాధారణంగా అత్యవసర నిధిలో ఎప్పుడైనా తిరిగి తీసుకునేలా పెట్టుబడులు పెడుతుంటాం. దీంతో పాటు లాంగ్ టర్మ్ కోసం కూడా కొన్ని పెట్టుబడులు పెట్టాలి. ఇందు కోసం రియల్ ఎస్టేట్, బాండ్స్ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టవచ్చు. వీటిల్లో ఎక్కువ కాలం పెట్టుబడులు పెట్టడం వల్ల ఎక్కువ లాభాలు ఆర్జించే వీలుంటుంది. అయితే మీ దగ్గర అందులో పెట్టుబడులు పెట్టి ఎక్కువ కాలం వేచి చూసేలా డబ్బు కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, చక్కటి స్ట్రాటజీ తో కూడిన పెట్టుబడుల వల్ల మంచి లాభాలు ఆర్జించే వీలుంటుంది.

పోర్ట్ ఫోలియో ఎలా ఉండాలంటే..
చాలామంది ఖర్చులు పోగా మిగిలిన డబ్బును పొదుపు చేస్తుంటారు. కానీ ఇది సరైన విధానం కాదు. మీరు సంపాదించే డబ్బులో కనీసం పావు వంతు పొదుపు కోసం పక్కన పెట్టి ఆ తర్వాతే ఖర్చులను పెట్టుకోవడం వల్ల దీర్ఘకాలంలో మీకు ఇబ్బంది ఎదురవకుండా ఉంటుంది. అయితే పెట్టుబడులన్నీ ఒకే దానిలో పెట్టుబడి పెట్టడం కూడా సరికాదు. ఉదాహరణకు మీ డబ్బులన్నీ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే మార్కెట్ క్రాష్ అవ్వడం వల్ల నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ లో పెడితే ఆ మార్కెట్ డౌన్ అయినప్పుడు ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

అందుకే నాలుగైదు రంగాలను ఎంచుకొని అన్నింటిలోనూ పెట్టుబడులు పెడుతూ పోవాలి. దీనివల్ల ఒకదానిలో నష్టం వచ్చినా మిగిలిన వాటిలో వచ్చే లాభాలతో ఆ నష్టాలను పూడ్చుకునే వీలుంటుంది. ఇందుకోసం కావాలంటే ఫైనాన్షియల్ ప్లానర్స్ సహాయం కూడా తీసుకోవచ్చు. మీ డబ్బులో కొంత మొత్తాన్ని మాత్రమే పొదుపు చేస్తూ.. నష్టభయం లేకుండా ఉంచుకొని మరికొన్ని రిస్కీగా ఉన్నా ఎక్కువ లాభాలను అందించే వాటిలో మదుపు చేయాలి.

మీ దీర్ఘకాలిక, స్వల్ప కాలిక లక్ష్యాలను గుర్తుంచుకొని వాటికి తగినట్లుగా మీ పెట్టుబడులను చేసుకుంటూ పోవాలి. ఇది ఒక్కరోజులో జరిగేది కాదు.. కానీ మొదటి అడుగు వేయడం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత మీ జీవితాన్ని మీరే టెన్షన్ ఫ్రీ చేసుకోవడానికి వీలుంటుంది.
Published by:Krishna Adithya
First published: