(జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్ 18తెలుగు, ఖమ్మం జిల్లా)
మల్లెల సునీల్ (Sunil). వన్యప్రాణి వేటగాడు (Hunter). అకస్మాత్తుగా చోటుచేసుకున్న ఇతని మృతి ఘటన ఎన్నో సందేహాలను (Doubts) లేవనెత్తింది. ఓ మాఫియా ఆగడాలు, అరాచకాలను మన్యం బయటికి వచ్చేలా చేసింది. సునీల్‌లాగా ఎందరో ఈ వృత్తిలో ఉన్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. వన్య ప్రాణులైన జింక, దుప్పి, అలుగు, అడవి పంది లాంటి వాటిని వేటాడడం సునీల్ లాంటి వారికి వృత్తిగా మారింది. మొదట్లో సరదాగా మొదలైన ఈ వేట, ఆనక వృత్తిగా, చివరకు అదే భృతిగా మారింది. వన్య ప్రాణుల మాంసానికి ఉన్న గిరాకిని సొమ్ము చేసుకోడానికి తయారైన మాఫియా చేతిలో ఇలా సునీల్ లాంటివాళ్లు కీలుబొమ్మలుగా మారడం ఇక్కడ సాధారణ విషయంగా తయారైంది. ఇలా రాత్రిళ్లు వేటకు వెళ్లి వన్యప్రాణులు తిరిగే ప్రాంతాలను గుర్తించి విద్యుత్ వైర్లు అమర్చడం.. ఆనక షాక్‌తో అవి కింద పడగానే చంపడం.. చచ్చి పడి ఉన్నవాటిని కోసి మాంసాన్ని తమ బాస్‌ల ఆదేశాల మేరకు బయటకు చేర్చడం.. దాన్ని ఆర్డర్ల ప్రకారం పంపిణీ చేయడం పరిపాటిగా మారింది.
ఇలా జింక, దుప్పి, అడవి పంది, అలుగు, కుందేలు మాంసానికి ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా వేటగాళ్ల పనితనానికి రేటు కడతారు. ఫోన్ల మీద ఆర్డర్ తీసుకుని తెల్లారేసరికి సరఫరా చేస్తుంటారు. ఈ వన్యప్రాణుల మాంసం మాఫియాపై దృష్టి పడకుండా ఉండేందుకు అటవీ , పోలీసు అధికారులు, రాజకీయ నేతలు, ఇంకా పలుకుబడి ఉన్న వర్గాల వారికి ఉచితంగా వారం వారం లేదంటే వాళ్లు అడిగిన రోజుల్లో ఉచితంగా మాంసాన్ని పంపడం రివాజుగా మారింది. దీంతో గతంలో ఎప్పుడో ఒకసారి జరిగే ఈ వేట కార్యక్రమం కాస్త.. ఇప్పుడు నిత్యకృత్యంగా మారింది. వేటకు, తరలించేందుకు.. రవాణాకు, సరఫరాకు సహకరించినందుకు అటవీ, పోలీసు శాఖల్లో కొందరికి నజరానాలు సైతం ముడుతున్నట్టు ఆరోపణలున్నాయి.
పోలీసులు పట్టించుకోలేదు..?
అలా అలవాటుగా సునీల్ వేటకు వెళ్లాడు. అదృశ్యమయ్యాడు (Missing). ఏమయ్యాడో తెలీదు. ఒకటి.. రెండు.. మూడు.. ఇలా ఆరు రోజులుగు గడిచినా అడవికి వేటకెళ్లిన మనిషి ఇంటికి చేరలేదు. ఇంట్లోవాళ్లు కంగారు పడ్డారు. తమకు అనుమానం ఉన్న పేర్లను పోలీసులకు చెప్పారు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. చట్టవిరుద్ధమైన పనిచేసినందుకా లేక ఇంకేదైనా కారణమో తెలీదు కానీ.. సునీల్ కుటుంబ సభ్యులు ఫిర్యాదుకు పోలీసులు సకాలంలో స్పందించలేదన్న ఆరోపణ ఉంది. దీనిపై గత ఆరు రోజులుగా కుటుంబ సభ్యులు పడుతున్న ఆందోళన, ఆతృతను పోలీసులు సీరియస్‌గా తీసుకోలేదు. చివరకు ఆరు రోజులకు అతను శవమై (Dead body) అడవిలోనే పడి ఉన్నాడన్న విషయం తెలుసుకుని మృతదేహాన్ని అప్పగించారు.
ఇక్కడ అనేక సందేహాలు ముప్పిరిగొంటున్న ఈ కేసులో అసలు సునీల్ సొంతంగా వెళ్లాడా.. బృందంగానా.. ఒకవేళ టీంగా వెళ్లినట్లయితే మిగిలిన వాళ్లకు అతని ఆచూకీ తెలియాలి కదా..? సునీల్ మృతి బయటి ప్రపంచానికి వెల్లడైతే తమ కార్యకలాపాలు బహిర్గతమవుతాయని భయపడ్డారా..? తోటి వేటగాళ్ల విద్యుత్ వైర్లు తగిలి మృతిచెందిన సునీల్ మృతదేహాన్ని (Sunil dead body) ఇన్ని రోజులు దాచిపెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది. ?ఎవరి ఆదేశాలతో మృతదేహం దాచారు..?ఎవరు చెబితే కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లి మండల మాటున దాచిన శవాన్ని పోలీసులు వెలికితీశారు. వీటిన్నింటికీ సమాధానం లేదు.
ఏం జరిగిందంటే..?
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం పెనుబల్లి అడవి ప్రాంతంలో గత ఐదు రోజుల కిందట అడవి జంతువుల వేట కు వెళ్ళిన సునీల్ మరో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందాడు. అతని మృతదేహం కోసం పెనుబల్లి అడవి ప్రాంతంలో పోలీసులు (Police), ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు పెనుబల్లి అటవీ (Forest) ప్రాంతంలోని గుట్ట మీద సునీల్ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ఎక్కడో వేటలో మృతిచెందిన అతని డెడ్‌బాడీని తరలించి.. గుట్టపైన చేర్చి దాచాల్సిన అవసరం ఏంటి.? ఎవరు దాచారు? కామన్‌గా వచ్చే ఈ డౌట్‌కు ఇక్కడ జవాబులేని ప్రశ్న. ఏళ్లుగా సాగుతున్న నోరులేని వన్యప్రాణుల వేట మాఫియా బండారం బట్టబయలవుతుందన్న భయంతోనే వేటగాడు సునీల్ మృతిచెందిన విషయాన్ని కుటుంబానికి కూడా తెలియనివ్వకుండా.. డెడ్‌బాడీని దాచిపెట్టడంలోనే ఆంతర్యం తెలిసిపోతున్న పరిస్థితి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Forest, Khammam