Home /News /bhadrari-kothagudem /

TALAMBARAS USED IN THE MARRIAGE OF SITARAMS HAVE A SPECIALTY LETS KNOW THAT VB KMM

Sri Rama Navami: సీతారాముల కళ్యాణం.. గోటితో వలచిన కోటి తలంబ్రాలు.. ఈ తలంబ్రాల వెనుక ఓ ప్రత్యేకత ఉంది.. అదేంటో తెలుసుకుందామా..

శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు

శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు

Sriramanavami: ఆదర్శ దాంపత్యానికి చిరునామా సీతారాములు. కష్టంలోనూ.. సుఖంలోనూ.. కలిమిలోనూ.. లేమిలోనూ.. ప్రత్యక్షంలోనూ.. పరోక్షంలోనూ.. భార్యభర్తలు ఇరువురూ ఎలా ఉండాలంటే.. సీతారాముల లాగా ఉండాలన్నది యుగాలుగా వస్తున్న లోకోక్తి. మరి అలాంటి ఆదర్శ దంపతుల కళ్యాణానికి ఇక్కడి దక్షిణాది అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి సిద్ధమైంది.

ఇంకా చదవండి ...
  (జి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా ప్రతినిధి‌, న్యూస్‌18 తెలుగు)

  భూదేవంత వేదిక పైన.. ఆకాశమంత పందిరి కింద అంగరంగ వైభవంగా జరగాల్సిన లోక కళ్యాణం.. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ఉగ్రరూపం రీత్యా పరిమితంగా జరుపుతున్నారు. భక్తులకు ఎలాంటి ప్రవేశం లేకపోయినా ఆన్‌లైన్‌లో వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లను చేశారు. భద్రాద్రి సీతారాముల అంతరాలయంలోనే ఈ ఏడాది కళ్యాణం జరిపిస్తున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌లు సతీసమేతంగా హాజరవుతున్నారు. వీరిద్దరే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీతారాములకు సంప్రదాయకంగా పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించనున్నారు. అయితే ఇంతటి విశిష్టత కలిగిన సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలకు ఓ ప్రత్యేకత ఉంది. సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలను మిల్లు పట్టరు. సీతారామలును మనసా వాచా కర్మణా ఆరాధించే భక్త జనం చేతితో వలచిన గింజలనే తలంబ్రాలుగా ఉపయోగించడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. సీతమ్మవారి మెడలో జగదభిరాముడు మూడుముళ్లు వేయగానే.. జానకి దోసిట కెంపుల బ్రోవై.. రాముని దోసిట నీలపు రాశై.. ఆణిముత్యములే తలంబ్రాలుగా... అంటూ సాగే ఈ ఆదర్శ దంపతుల వివాహ వేడుకలతో ఉపయోగించే తలంబ్రాలను తయారు చేయడానికి భక్తులు పడే తపన.. వారు భక్తి పారవశ్యంతో శ్రమను మరచి చేసే సేవలపై 'న్యూస్‌18 తెలుగు' ప్రత్యేక కథనం..

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఈ గోటి తలంబ్రాలను తయారు చేస్తారు. నాడు సీతారాముల కళ్యాణానికి శచీదేవి, అహల్యలతో పాటు, శబరి తమ గోటితో వలచిన తలంబ్రాలనే ఉపయోగించారన్న పురాణ కథనంతో ప్రేరణ పొందిన ఈ శ్రీకృష్ణచైతన్య సంఘం స్థాపకుడు కళ్యాణం అప్పారావు తానే ఈ బృహుత్కార్యానికి పూనుకున్నారు. 2012లో రామభక్తులను ఏకం చేసి.. తాను తన సొంత పొలంలో పండించిన వడ్లను వారికి ముందుగానే అందించి.. ఓ శుభ ముహూర్తాన తలంబ్రాలు వలవడం మొదలుపెట్టేవారు.

  తలంబ్రాలను పంచుతున్న దృశ్యం


  తలంబ్రాల విశిష్టతను తెలియజేస్తున్న దృశ్యం


  శ్రీరామక్షేత్రంలోనే గోటితలంబ్రాల పంట.. ఈ గోటి తలంబ్రాల విషయంలో అడుగడుగునా ప్రతి విషయంలోనూ ప్రత్యేక భక్తిశ్రద్ధలను తీసుకుంటారు. తలంబ్రాలకు ఉపయోగించే వరి నారు పోసే దగ్గరి నుంచి.. పంట కోత కోసేదాకా ప్రతి విషయాన్ని ఆధ్యాత్మికంగానే భావించి.. అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ క్రతువును నిర్వహిస్తుంటారు. నారు పోసే ముందు విత్తనాలను భద్రాచలం సీతారాముల మూలమూర్తుల పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం వాటిని అప్పారావుకు చెందిన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం, అచ్యుతాపురంలోని ఎకరం పొలంలో ఆంజనేయుడు, ఇతర వానరుల వేషధారణలోనే పొలం దున్ని, నారు పోసి.. మడి చేసి నాట్లు వేస్తారు. పొట్ట దశకు వచ్చాక శ్రీమంతం కూడా చేస్తారు. వరికోత సమంయలోనూ రాముడి వేషధారణలో ఉన్న భక్తునికి మొదట అందజేస్తారు. ఇలా పండించిన పంటను.. శ్రీరామనవమి రెండు నెలలు ముందు నుంచే భక్తజనానికి పంపిణీ చేసి వారిచేత వలిపిస్తారు. ఇలా పరిసర గ్రామాల ప్రజలు ఈ కోటి గోటి తలంబ్రాల మహా యజ్ణంలో పాలుపంచుకుంటారు. ఈ కార్యక్రమానికి 'వడ్లు వలుపు.. శ్రీరాముని పిలుపు' పేరిట నామకరణం చేస్తారు.

  అనంతరం ఇలా వలిచిన బియ్యాన్ని కలశాలలో నింపి రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్‌ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి 'రామయ్య పెళ్లికి రామచిలుకలతో పిలుపు' కార్యక్రమం నిర్వహించి.. భద్రాచలం తీసుకొస్తారు. ఇలా తెచ్చిన తలంబ్రాలతో భద్రాద్రి ప్రదక్షిణ చేస్తారు. అనంతరం ఈ గోటి తలంబ్రాలను ఆలయంలో అప్పగిస్తారు. వీటినే శ్రీసీతారాముల కళ్యాణంలో వినియోగిస్తారు. ఇలా ఈ గోటి తలంబ్రాల కార్యక్రమంలో పాల్గొంటే శుభం జరుగుతుందన్న నమ్మకంతో ఏటా భక్తులు విరివిగా ముందుకొస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని వంటిమిట్టలో జరిపే సీతారాముల కళ్యాణానికి సైతం ఈ గోటి తలంబ్రాలను పంపుతున్నారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Andhrapradesh, Bhadrari kothagudem, Kalyanam, Ramatemple, Sriramanavami, Sritarama kalyanam, Talambralu, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు