(జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్18 తెలుగు, ఖమ్మం జిల్లా)
సభ్య సమాజం తలదించుకునే ఘటన. నోరు తెరిచి తమ హక్కులపై (Right) మాట్లాడలేని ఆదివాసీలపై ఖచ్చితంగా ఇది దాష్టీకం. అస్సలు తమకు హక్కులంటూ ఉంటాయని కూడా తెలీని అమాయకులపై సాగిన దౌర్జన్యం. అన్నం వండుకోడానికి అవసరమైన పొయ్యిలోకి వాడే కర్రపుల్లలు (Firewood) ఏరుకుంటున్న ఆదివాసీ స్త్రీలపై అటవీశాఖ అధికారులు సాగించిన దారుణ దమనకాండ. ఇదేదో ఆంగ్లేయుల పాలన నాటి చరిత్ర ముచ్చట కానేకాదు. నిన్నటికి నిన్న భద్రాద్రి కొత్తగూడెం (Bhadrari kothagudem) జిల్లా ములకలపల్లి మండలంలో చోటుచేసుకున్న అమానుష ఘటన. తన ఇంట్లోనూ స్త్రీలు ఉన్నారని మర్చిపోయిన ఓ దుర్మార్గపు బీట్ ఆఫీసర్ (Beat officer) ఆదివాసీ మహిళ (Tribal woman)ను కింద పడేని కాళ్లతో తన్నుతూ ఆమె ఒంటిమీద కట్టుకున్న చీర, లంగాను సైతం లాగి పడేసి వివస్త్రను (Undressed) చేయడం.. నాగరిక సమాజపు పోకడలు ఏమాత్రం తెలీని ఆ అమాయక అడవి బిడ్డ (Forest child) తన మానం పోయిందన్న బెంగతో మంచం పట్టిన దుస్థితి ఇక్కడిది.
కేవలం పొయ్యిలో కట్టెలు ఏరుకుంటున్న ఆదివాసీ మహిళలపై (tribal women) ఇలాంటి అమానుష ఘటనకు పాల్పడిన బీట్ ఆఫీసర్పై చర్యలు తీసుకోకపోగా.. కనీసం విచారణ చేయకపోగా.. ఏంజరగలేదంటూ బుకాయిస్తూ అటవీశాఖ ఉన్నతాధికారులు కనీస మానవత్వాన్ని సైతం చాటుకోలేని అహంకార ఊబిలో కూరుకుపోయినట్లు ఈ ఘటన ద్వారా అర్థమవుతోంది.
భద్రాద్రి కొత్తగూడెం (Bhadrari kothagudem) జిల్లా ములకలపల్లి మండలం రాచన్నగూడెం పంచాయతీ పరిధిలోని సాకివాలస ఓ ఆదివాసీ గూడెం. ఇక్కడ ఓ ఏభైకి పైగా ఆదివాసీ కుటుంబాలు చత్తీస్ఘడ్ నుంచి వలస వచ్చి నివాసం ఉంటున్నాయి. ఈ గూడేనికి చెందిన ఎండ్ల వెట్టిలక్ష్మి, ఎండ్ల సోడే దేవమ్మ, సోడే రజని మరో మహిళతో కలసి పక్కనే ఉన్న అటవీ ప్రాంతంలో పొయ్యిలోకి కట్టెలు ఏరుకునే పనిలో ఉన్నారు. అంతలో అక్కడకు వచ్చిన ఫారెస్ట్ బీట్ గార్డ్ (Forest beat Guard) మహేష్ వారి పట్ల దారుణంగా ప్రవర్తించాడు. కనీసం ఎదుటి వాళ్లు తనలాంటి సాటి మనుషులే అన్న సోయి కూడా లేకుండా నోటికొచ్చిన బూతులు తిడుతూ.. వారిపై దౌర్జన్యంగా ప్రవర్తించాడు.
కట్టెపుల్లలు (Firesticks) ఏరుకోవడం ఒకవేళ అటవీ పరిరక్షణ నిబంధనలకు విరుద్ధం అయితే నిరోధించవచ్చు. లేదా అపరాధ రుసుం విధించవచ్చు. కానీ ఇక్కడ తానో ఉద్యోగిని, చదువుకున్నానన్న విచక్షణ మరచిన మహేష్ వారిపై పడి దారుణంగా కొడుతూ, తన్నుతూ, ఈడ్చేస్తూ అమానుషంగా ప్రవర్తించాడు. మొదట లక్ష్మీ, రజనిలను దారుణంగా కొట్టిన (beat) మహేష్, అనంతరం అడ్డొచ్చిన దేవమ్మపై దాడి చేశాడు. అతను బలంగా తోసేయడంతో పక్కనే ఉన్న కంపముళ్లపై కింద పడి పోయిన దేవమ్మను వదలకుండా చీర, ఆనక లంగాను బలవంతంగా లాగేయడంతో ఆమె వివస్త్రగా మారింది.
అయినా వదలకుండా మహేష్ ఆమెను తీవ్రంగా గాయపరుస్తూ తన రాక్షసత్వాన్ని చాటుకున్నాడు. ఎలాగో అతని బారి నుంచి తప్పించుకున్న ఆ నలుగురు ఆదివాసీ మహిళలు గూడేనికి చేరుకున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని పెద్దలకు చెప్పుకున్నారా అడవి బిడ్డలు. పంచాచతీ సర్పంచి చొరవతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు జరిగిన అన్యాయంపై దేవమ్మ మంచం పట్టింది. కట్టెపుల్లలు ఏరుకుంటున్న తనపై ఓ అధికారి ఇంతటి దాష్టీకానికి ఎందుకు పాల్పడ్డాడో అర్థంకాక ఆ అడవి బిడ్డ బేలచూపులు చూస్తోంది.
సీపీఐఎంఎల్ నిరసన..
ఓ పక్క కలప మాఫియా అడవిని నాశనం చేస్తున్నా ఆమ్యామ్యాలు పుచ్చుకుని చోద్యం చూస్తూ సహకరించే అటవీశాఖాధికారులు కడుపేదలైన ఆదివాసీ అమాయక మహిళలపై సభ్యసమాజం తలతించుకునేలా ప్రవర్తించడం పట్ల సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు మండిపడ్డారు. ఇలాంటి అమానుష ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు 'న్యూస్18 తెలుగు' ఖమ్మం ప్రతినిధితో చెప్పారు. తాము పార్టీ తరపున ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, బాధ్యుడైన ఫారెస్టు గార్డును సస్పెండ్ చేసేదాకా వదలమని పేర్కొన్నారు. ఇలాంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ మహిళలపై జరిగిన అమానుషంపై నిరసన ములకపల్లిలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Badradri, Bhadradri kothagudem, Forest, Tribal huts, WOMAN