హోమ్ /వార్తలు /bhadrari kothagudem /

Mirchi crop: భద్రాద్రి జిల్లాలో రైతులకు కుచ్చుటోపీ.. మిర్చి పంట కొని డబ్బులివ్వని వ్యాపారులు.. పోలీస్​స్టేషన్​కు రైతన్న..

Mirchi crop: భద్రాద్రి జిల్లాలో రైతులకు కుచ్చుటోపీ.. మిర్చి పంట కొని డబ్బులివ్వని వ్యాపారులు.. పోలీస్​స్టేషన్​కు రైతన్న..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ చివరకు ప్రకృతి వైపరీత్యాలకు సైతం వెనుకాడక ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చికి ధర దక్కింది సరే. సొమ్ములు దక్కని దుస్థితి నెలకొంది.

(G Srinivas Reddy, News 18, Khammam)

ఎర్ర బంగారం. అవును అది నిజంగా బంగారమే. ఈ ఏడు మిర్చి పంటకు దక్కిన ధర గతంలో ఎన్నడూ రాలేదు. కనీసం ఊహించను కూడా లేదు. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. చలికి వణుకుతూ చివరకు ప్రకృతి వైపరీత్యాలకు సైతం వెనుకాడక ఆరుగాలం శ్రమించి పండించిన మిర్చి (Mirchi)కి ధర దక్కింది సరే. సొమ్ములు దక్కని దుస్థితి నెలకొంది. ఏడాదంతా చెమటోడ్చి నీడ ముఖం కూడా తెలియని రైతన్న మార్కెట్‌ మాయాజాలానికి బలవుతూనే ఉన్నాడు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem District) జిల్లాలో చోటుచేసుకున్న ఘటన రైతన్న దుస్థితిని మరోసారి వెలుగులోకి తెస్తోంది. మార్కెట్‌ కన్నా మంచి ధర ఇస్తానంటూ నమ్మబలికిన దళారులు రైతులను (farmers) నిలువునా మోసం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించినా  పంటకు దక్కాల్సిన సొమ్ము దక్కక రైతన్న దిగాలు పడుతునే ఉన్నాడు.

టన్నుల కొద్దీ మిర్చి పంట కొనుగోలు..

తమ పంటను కొని డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పలువురు మిర్చి రైతులు (mirchi famers) ఓ వ్యాపారిపై ఇల్లందు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కట్టు గూడెం, నిజాంపేట, చెన్నంగలగడ్డ, తులసి తండా గ్రామాలకు చెందిన 17 మంది రైతులు గత రెండు నెలల క్రితం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాదారం గ్రామానికి చెందిన నాగయ్య అనే వ్యాపారికి మిర్చి పంటను అమ్మారు. ఇలా ఈ వ్యక్తి అనేక ఏజెన్సీ గ్రామాల్లో టన్నుల కొద్దీ మిర్చి (Chillies) పంటను కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. మార్కెట్‌ కన్నా మంచి ధర ఇస్తానంటూ నమ్మబలికిన ఈ వ్యాపారి (Businessman) మిర్చి కళ్లాల్లోనే సరుకును లారీల్లోకి లోడ్‌ చేయించాడు. కాంటాలు వేయించి స్లిప్పుల పైన లెక్కలు అప్పజెప్పాడు. అదీ అనామతుగానే. కానీ ఇప్పటికీ సదరు మిర్చి పంటకు సంబంధించిన చెల్లింపులు చేయనేలేదు. ఇలా సదరు వ్యాపారి వందలాది మంది రైతులకు కోట్లాది రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికీ ఇంకా కూలీలకు ఇవ్వాల్సిన మొత్తాలను సైతం ఇవ్వలేదంటే పరిస్థితి ఊహించొచ్చు.

పంట సొమ్ము కోసం రెండు నెలలుగా..

అమాయకులైన గిరిజన, ఆదివాసీ రైతులను ఎక్కువ ధరలు ఆశచూపి మోసం చేయడం కొందరు వ్యాపారులకు పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే ఏటా ఏదో ఒక పేరుతో అమాయక రైతులను మోసం చేస్తునే ఉన్న దుస్థితి. మోసం చేస్తున్న దళారులపై చట్ట పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలా లేకపోవడంతో ఏటా ఇలాంటి దందా పెరుగుతూనే ఉంది. ఇలా ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో ఏటా వందలాది రైతులు నష్టపోతూనే ఉన్నారు. తాజాగా ఇల్లెందు ప్రాంతంలో మిర్చి  (Chillies) పంటను కొనుగోలు చేసిన వ్యక్తి కోసం, పంట సొమ్ము కోసం రెండు నెలలుగా రైతులు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. అప్పులు చేసి ఆరుగాలం కష్టపడి తీసిన పంట అమ్మితే వ్యాపారుల చేతిలో దగా పడవలసిన పరిస్థితి ఏర్పడింది.

డబ్బులు కావాలని రైతులు తిరుగుతున్న క్రమంలో ఒక వ్యాపారి తాను ఉంటున్న ఊరు నుండి పరారయ్యాడు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చిన రైతులు మొత్తానికి ఆ వ్యాపారిని పట్టుకున్నారు.  ఈ క్రమంలో అక్కడి పెద్దలు  సామాజిక వర్గ కోణంలో మోసం చేసిన వ్యాపారికి అండగా నిల్చినట్టు ఆరోపిస్తున్నారు. ఇచ్చినంత తీసుకుని నోర్మూసుకుని పోండని పంచాయతీలో చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.  దీంతో చేసేది ఏమీ లేక మోసానికి గురైన రైతులు ఇల్లందు పోలీసులను ఆశ్రయించారు. వ్యాపారి నుంచి తమకు రావాల్సిన డబ్బులు చెల్లించే విధంగా పోలీసులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని రైతులు ప్రాధేయ పడుతున్నారు.

ఇలా ఏటేటా ఎన్నో చోట్ల రైతులు దళారుల చేతిలో మోసపోతున్నా ఎవరికీ పట్టని దుస్థితి ఉంది. గతేడాది ఖమ్మం నగరంలో సుమారు పాతిక కోట్ల సరకును కొనుగోలు చేసిన ఓ వ్యాపారి ఇప్పటికీ పేమెంట్లు చేయని విషయం మరువక ముందే అక్కడక్కడా ఇలాంటివి వెలుగుచూస్తూనే ఉన్నాయి.

First published:

Tags: Crops, Farmers, Khammam, Police station

ఉత్తమ కథలు