Yearly Horoscope: కొత్త సంవత్సరం 2021లో ఏ రాశి ఫలాలు ఎలా ఉంటాయి? తెలుసుకోండి

కొత్త సంవత్సరం 2021లో ఏ రాశి ఫలాలు ఎలా ఉంటాయి? తెలుసుకోండి

Yearly Horoscope: 12 రాశుల వారికి కొత్త సంవత్సరం... జనవరి 1, 2021 నుంచి డిసెంబర్ 31, 2021 వరకు వార్షిక ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం.

 • Share this:
  తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనావేసేందుకు రాశి ఫలాలు, వారఫలాలు, మాసఫలాలు, వార్షిక ఫలాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదు:ఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు వార ఫలాలు దోహదపడుతాయి. 12 రాశుల వారికి కొత్త సంవత్సరం (జనవరి 1, 2021 నుంచి డిసెంబర్ 31, 2021) వార్షిక ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ... ముందుకు సాగవచ్చు.

  మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1)
  దాదాపు ఏడాదంతా శని, గురువు మకరంలో,... రాహువు వృషభంలో సంచరిస్తూ ఉండడం వల్ల కొన్ని ప్రతికూల పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ప్రధానంగా ఉద్యోగంలో, ఆర్థిక, కుటుంబ వ్యవహారాల మీద వీటి ప్రభావం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం కోల్పోతారు. విపరీతంగా పని ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా ఒడిదొడుకులు తప్పవు. కుటుంబంలో భేదాభిప్రాయాలు తలెత్తవచ్చు. జాతక చక్రంలో గ్రహాల స్థితిగతులు, దశాంతర్దశలు అనుకూలంగా ఉన్న పక్షంలో ఈ సమస్యలన్నీ బాగా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఇక ఇతర విషయాలకు వస్తే, బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. స్థలం కొనుగోలు కోసం అగ్రిమెంట్‌ రాసుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. పాత స్నేహితులు తటస్థపడతరు. దూరపు బంధువు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్‌ ఎస్టేట్‌ వారికి అన్ని విధాలా బాగుంటుంది. దూరపు బంధువుకు సంబంధించి దుర్వార్త వింటారు. ఎవరితోనూ వాదలు, వివాదాలకు దిగవద్దు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. తరచూ శివాలయాన్ని సందర్శిస్తే శ్రేయస్కరంగా ఉంటుంది.

  వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
  భాగ్య స్థానంలో శని, గురువు ఉండడం వల్ల మీకు విదేశాల్లో ఉద్యోగం, ధన లాభం, పరువు ప్రతిష్ఠలు, ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి సంభవిస్తాయి. రాశిలో రాహువు ఉండడం వల్ల మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. మొత్తం మీద ఈ ఏడాదంతా మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా, అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగరీత్యా గానీ, చదువు రీత్యా గానీ దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ లెక్కచేయరు. అధికారులు మీ శ్రమకు, ప్రతిభకు విలువనిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాల సందర్శన ఉంటుంది. ఇతర స్త్రీలతో పరిచయాలు పెంచుకోవడం ఇంటికి, వంటికి మంచిది కాదు. సమీప బంధువుల్లో ఒకరికి సంబంధించి దుర్వార్త వింటారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత
  సాధిస్తారు. లాయర్లకు అనుకూల సమయం. డాక్టర్లకు పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. హృద్రోగ నిపుణులకు ఉన్నత శిక్షణకు విదేశాల నుంచి అవకాశం వస్తుంది. ఉద్యోగానికి సంబంధించి టెక్నాలజీ నిపుణులకు విదేశా నుంచి
  చల్లని కబురు అందుతుంది. కోపతాపాలకు ఇది సమయం కాదు. స్నేహితులతో పెళ్లి జరిగే అవకాశం ఉంది. వృద్ధ తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించే అవకాశం ఉంది. స్నేహితులతో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. కోర్టు కేసు పరిష్కారం అవుతుంది కానీ, అది అంతగా సంతృప్తి ఇవ్వకపోవచ్చు. కుమారుడు విదేశాల్లో ఉద్యోగం సంపాదిస్తాడు. మొక్కుబడులు తీర్చుకోండి.

  మిధునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
  అష్టమ శని, అష్టమ గురువు, వ్యయంలో రాహువు కారణంగా ఈ సంవత్సరం అంత ప్రశాంతంగా గడిచే అవకాశం లేదు. అనారోగ్యాలు, అనుకోని ఖర్చులు, ఆదాయంలో తగ్గుదల, ఇష్టం లేని ప్రాంతాలకు స్థాన చలనం, ప్రమోషన్లు ఆగిపోవడం, జీవిత భాగస్వామికి ఆరోగ్యం బాగా లేకపోవడం వంటివి జరగవచ్చు. జాతక చక్రంలో గ్రహాల స్థితిగతులు, దశాంతర్దశలు బాగున్నట్టయితే, కష్టనష్టాలు బాగా తగ్గే అవకాశం ఉంది. ఇక ప్రతి పనీ ఆసస్యం అయ్యే అవకాశం ఉన్పప్పటికీ, తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. ప్లాటును గానీ, ఫ్లాటును గానీ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ, పూర్తిగా పడకపెట్టేంత పరిస్థితి రాకపోవచ్చు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల్లో ఒకరి గురించి దుర్వార్త వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొందరు స్నేహితుల తీరు చూసి ఆందోళన చెందుతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. పని విషయంలో పై అధికారు నుంచి విమర్శలకు అవకాశముంది. సైన్స్‌, ఐ.టి విద్యార్థు రాణిస్తారు. ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌, కళకు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయడం మంచిది. నిరుత్సాహానికి గురయ్యే సూచనలు ఉన్నాయి. రాజకీయ నాయకులు, సామాజిక రంగంలోని వారు అభివృద్ధి సాధిస్తారు. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుంటే మంచిది.

  కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
  సప్తమంలో శని ఉన్నప్పటికీ, గురుగ్రహం కూడా ఉన్నందువల్ల, లాభంలో రాహువు ఉన్నందువ్ల ఈ ఏడాదంతా శుభకార్యాలు, శుభవార్తలు ఎక్కువగా ఉంటాయి. జాతక చక్రం పరిస్థితి కూడా సరిగా ఉంటే మీకు ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది. కుమారుడికి గానీ, కుమార్తెకు గానీ విదేశీ కంపెనీలో మంచి ఉద్యోగం లభించవచ్చు. పిల్లల చదువుల్లో కూడా పురోగతి సాధిస్తారు. తల్లితండ్రులు, కుటుంబ సభ్యులతో తీర్థయాత్రకు వెళ్తారు. సప్తమంలో శని సంచరిస్తూ ఉండడం వల్ల ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. భార్యకు అనారోగ్యం కలిగే సూచనలు ఉన్నాయి. ఇక ఈ ఏడాది బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. సాహిత్యం మీద మోజు పెంచుకుంటారు. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. విందు వినోదాల్లో పాల్గొంటారు. భార్యాపిల్లలతో కాలక్షేపం చేస్తారు. ఎవరు స్నేహితులో, ఎవరు శత్రువులో తెలుసుకుని మెలగండి. వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. ఇష్టంలేని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పై అధికారుల నుంచి వేధింపులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అనుకోకుండా బంధువు ఇంటికి వచ్చి రెండు రోజులుండే సూచనలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. స్నేహితురాలితోనే వివాహం జరిగే అవకాశం ఉంది. ఐ.టి నిపుణులకు, అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది.

  సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1)
  ఈ ఏడాదంతా ఆరవ రాశిలో శని, గురువు, దశమంలో రాహువు సంచరిస్తున్నందువల్ల, ఉద్యోగ జీవితం ఆశించినంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. ఉద్యోగంలో కొనసాగుతారు కానీ, సమస్యలు ఎదురవుతాయి. కొత్త ఉద్యోగం రావడానికైనా, పెళ్లి సంబంధం కుదరడానికైనా సమయం పడుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు బాగా పెరుగుతాయి. డబ్బు నష్టపోతారు. ఇల్లు కొనడం, ఇల్లు కట్టడం, పెళ్లి సంబంధం కుదర్చుకోవడం వంటి శుభకార్యాల్ని ఆశించకపోవడం మంచిది. జాతక చక్రం బాగుంటే చెడు ఫలితాలు తగ్గే అవకాశం ఉంది. ఇతరత్రా, ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఇతరల శుభకార్యాలకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆశాభావంతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం విషయంలో అన్ని విధాలా అనుకూమయిన సమయం. భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయం పెరుగుతుంది. సమయానికి చేతికి డబ్బు అంది అవసరాలు తీరుతాయి. స్నేహితులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. భార్యాపిల్లలతో వివాహానికి వెళ్తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. భార్య వైపు బంధువు ఇంటికి వస్తారు. కొత్త వస్తువు కొనుగోలు చేస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. బ్యాంకర్లు, వడ్డీ వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు అనూహ్యమైన సత్ఫలితాలు సాధిస్తారు. ఐ.టి నిపుణులకు విదేశా నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. దుర్గాదేవిని పూజించండి.

  కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
  ఈ ఏడాదంతా పంచమంలో శని, గురు గ్రహాలు, నవమంలో రాహువు ఉండడం కొద్దిగా మంచి ఫలితాన్నే ఇస్తాయి. విదేశాల్లో ఉద్యోగం, విదేశీ చదువు, సంతానం అభివృద్ధి, ఆదాయం పెరుగుదల, ఆధ్యాత్మిక చింతన వంటివి అనుభవానికి వస్తాయి. జాతక చక్రం అనుకూలంగా ఉన్న పక్షంలో ఈ ఏడాది బాగా గడిచిపోతుందనే చెప్పవచ్చు. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. పిల్లలకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి. భార్య ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇతరత్రా, అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. వీసా సమస్యలు పరిష్కారమవుతాయి. స్త్రీలతో పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. విదేశీ పర్యటన సూచనలున్నాయి. సతీమణితో కలిసి షాపింగ్‌ చేసి, కొత్త వస్తువు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా కామర్స్‌ విద్యార్థులకు సమయం బాగుంది. స్నేహితురాలితో ప్రేమ వ్యవహారం పెళ్లికి దారితీసే అవకాశం ఉంది. లాయర్లు, బ్యాంకర్లు, ఆర్థిక నిపుణులు, కళా సాహిత్య రంగాలకు చెందినవారు, సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంది. శుభవార్త వింటారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఏప్రిల్‌, సెప్టెంబర్‌ నెల మధ్య స్వల్ప అనారోగ్యం సంభవం.

  తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
  ఈ ఏడాదంతా నాలుగింట శని, గురువు, అష్టమంలో రాహువు సంచారం చాలావరకు ప్రతికూల ఫలితాన్ని ఇస్తుంది. ఉద్యోగం పోవడం, కొత్త ఉద్యోగం రాకపోవడం, చదువుల్లో ఇబ్బందులు తలెత్తడం, తల్లికి అనారోగ్యం, దుర్వార్త శ్రవణం, స్థాన చలనం, ఇల్లు అమ్మడం, ఆస్తులకు సంబంధించి కేసుల్లో చిక్కుకోవడం, కోర్టు కేసుల్లో అపజయాలు వంటివి చోటు చేసుకుంటాయి. జాతక చక్రం బాగుంటే ఫలితాలు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనుల్లో కొన్ని మాత్రం పూర్తవుతాయి. ఇతర గ్రహాల సంచారాన్ని బట్టి చూ స్తే, పెళ్లి ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. స్నేహితులకు పార్టీ ఇస్తారు. తోబుట్టువు ఒకరితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. దూర ప్రయాణాలు గానీ, తీర్థయాత్రలు గానీ చేయడానికి ప్రణాళికలు వేసుకుంటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండో ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. ఇతరులకు డబ్బులిచ్చి మోసపోతారు. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆదాయానికి కొరత లేదు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ముఖ్యంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార, ఆతిథ్య రంగంలోని వారికి, చిన్న వ్యాపారులకు, రైతులకు అన్ని విధాలా అనుకూల సమయం. కోర్టు వ్యవహారాల్లో గెలవవచ్చు. రుణాలు పెరగవచ్చు. చెడు ఫలితాలు తగ్గించుకోవడానికి తీర్థయాత్రలు చేయడం మంచిది. ఏప్రిల్‌, సెప్టెంబర్‌ నెల మధ్య కొద్దిగా ఊరట ఉంటుంది.

  వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
  ఈ ఏడాదంతా మూడింట శని, గురువు, సప్తమంలో రాహువు సంచరించడం వల్ల ప్రతికూల ఫలితాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. మూడింట శని సంచారం కొద్దిగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. విపరీతమైన తిప్పుట, ప్రతి పనీ ఆలస్యం కావడం, అనవసర ఖర్చులు, అనవసర ప్రయాణాులు, ఉద్యోగంలో స్థాన చలనం, సోదరులతో విభేదాలు, ఇరుగు పొరుగుతో సమస్యలు, భార్యకు అనారోగ్యం వంటివి చోటు చేసుకుంటాయి. ఈ సంవత్సరం అన్ని విధాలా ప్రతికూలంగా ఉంటుందనే చెప్పాలి. జాతక చక్రంలోని గ్రహాల స్థితిగతులు, దశాంతర్దశలు బాగుంటే, ఈ ఫలితాలు తగ్గుతాయి. ఇతరత్రా గ్రహాల సంచారాన్ని బట్టి చూ స్తే, చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూడడం, అతిగా ఆలోచించడం మానుకుంటే ప్రశాంతంగా గడిచిపోతుంది. కోపతాపాలను అదుపులో ఉంచుకోండి. ఎవరితోనూ వివాదాలకు, వాదనలకు దిగవద్దు. జీవితంలో పైకి రావాలనే తపన పెరిగి, కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. కొత్త స్నేహితులు పరిచయమవుతారు. కొత్త ప్రాజెక్టులు చేతికి అందివస్తాయి. రియల్‌ ఎస్టేట్‌ వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది. భార్యాపిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. బంధువుతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. రహస్యాలను మనసులోనే ఉంచుకోండి. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవ రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగానికి సంబంధించి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. శివార్చన మంచిది.

  ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
  ఈ ఏడాదంతా శని, గురు గ్రహాలు రెండో స్థానంలో, రాహువు ఆరో ఇంట సంచరించడం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. రెండింట శని కారణంగా కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉన్నప్పటికీ, ఆదాయం పెరుగుదల, వ్యాపారాభివ ద్ధి, ప్రమోషన్లు, కొత్త ఉద్యోగం, విదేశీ ప్రయాణం, శుభకార్యాలు, శుభవర్తల వంటి వాటికి ఆస్కారముంది. ఇతర గ్రహాలు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఏతా వాతా మీ ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఈ ఏడాది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మీరు ఉన్న ఊరిలోనే మీకు ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. మీ తల్లితండ్రుల నుంచి మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయించండి. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలుఉన్నాయి. తీర్థయాత్రకు ప్లాన్‌ వేస్తారు. బంధుమిత్రుల నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది. విద్యార్థులు... ఉపాధ్యాయుల లేదా అధ్యాపకుల ప్రశంసలు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు దూసుకు వెళ్తారు. రియల్‌ ఎస్టేట్‌ వారికి, బ్యాంకర్లకు సమయం బాగుంది. కోర్టు కేసులు
  అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఏప్రిల్‌, సెప్టెంబర్‌ నెల మధ్య విదేశీ ప్రయాణానికి అవకాశం ఉంది. దూరపు బంధువుతో వివాహ సంబంధం కుదురుతుంది.

  మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
  ఈ ఏడాదంతా శని, గురువు మకరంలో, రాహువు పంచమంలో సంచరించడం వల్ల ప్రతికూల ఫలితాలే ఎక్కువగా అనుభవానికి వస్తాయి. ఆర్థిక నష్టాలు, ఆస్తి నష్టాలు, అనారోగ్యాలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగంలో ఇబ్బందులు, విపరీతమైన తిప్పుట, అనవసర ఖర్చుల వంటివి తప్పకపోవచ్చు. జాతక చక్రంలో గ్రహాల, దశలు అనుకూలంగా ఉన్న పక్షంలో ఈ చెడు ఫలితాల ప్రభావం తక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇతరత్రా గ్రహాల సంచారాన్ని బట్టి కూడా కొన్ని ప్రతికూల ఫలితాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. చిన్న పనికి కూడా అధికంగా కష్టపడడం, తిప్పుట వంటివి అనుభవానికి వస్తాయి. ఆదాయం మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. స్నేహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్‌ పనులను పూర్తి చేస్తారు. అయితే, కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సతీమణితో వివాదాలకు దిగవద్దు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. భారీఎత్తున షాపింగ్‌ చేస్తారు. పిల్లలు మిమ్మల్ని సంతోషపెడతారు. కామర్స్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఆర్థిక నిపుణులకు ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. ఇల్లు లేనివారు ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో తృప్తిగా ఉండవు. శివార్చన మంచిది.

  కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
  ఈ ఏడాదంతా శని, గురువు 12వ రాశిలోనూ, రాహువు 4వ ఇంటిలోనూ సంచరించడం వల్ల ఎక్కువగా ప్రతికూల ఫలితాలే అనుభవానికి వస్తాయి. నష్టానికి ఇల్లు గానీ, స్థలం గానీ అమ్ముకోవాల్సి రావడం, వైద్య ఖర్చులు పెరగడం, ఏ పనీ ఒకపట్టాన పూర్తి కాకపోవడం, అనవసర ఖర్చులు, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ తగ్గిపోవడం, ఉద్యోగం పోవడం, ఈతి బాధలు అనుభవానికి వస్తాయి. జాతక చక్రంలో గ్రహాల, దశలు బాగా ఉన్న పక్షంలో పరిస్థితులు కొద్దిగా మెరుగ్గా ఉంటాయి. అయితే, ఇతర గ్రహాల సంచారం కాస్తంత అనుకూలంగా ఉండడం వల్ల మొత్తం మీద రోజులు బాగానే గడిచిపోతాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటు ఉండదు. భార్యాపిల్లలతో కలిసి కొనుగోళ్లు చేస్తారు. ఏలిన నాటి శని కారణంగా తిప్పుట ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు పూర్తవుతాయి. సమీప బంధువు ఒకరు మిమ్మల్ని నమ్మించి మోసగించే ప్రమాదం ఉంది. విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. రెండో ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు. అప్పు తీరుస్తారు. వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. సహోద్యోగులు సహాయ సహకారాలు అందిస్తారు. సమీప బంధువుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. చెడు స్నేహాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. న్యాయ, పోలీస్‌, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఎంత ప్రయత్నించినా ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లవు.

  మీనం (Pices) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)
  ఈ ఏడాదంతా శని, గురు గ్రహాలు 11 లోనూ, రాహువు 3వ ఇంటిలోనూ సంచరిస్తున్నందువల్ల అనుకూల ఫలితాలు అధికంగా ఉన్నాయి. విదేశీ కంపెనీల్లో ఉద్యోగాలు రావడం, ప్రమోషన్లు, ఆదాయం పెరుగుదల, పలుకుబడి గలవారితో పరిచయాలు, ఆకస్మిక ధనలాభం, శుభకార్యాలు, శుభవార్తల వంటివి అనుభవానికి వస్తాయి. పెండింగ్‌ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఇల్లు గానీ, స్థలంగానీ కొనుగోలుకు ప్రయత్నిస్తారు. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. మరో ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. స్త్రీలతో అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆధ్యాత్మిక చింతన
  పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి తరఫు బంధువు మిమ్మల్ని పలకరించే అవకాశం ఉంది. విద్యార్థులు అనాయాసంగా పురోగతి సాధిస్తారు. ప్రేమించిన వారితోనే వివాహం జరిగే అవకాశం ఉంది. సంతాన యోగం ఉంది. ఎవరికీ డబ్బు ఇవ్వొద్దు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఆర్థిక, ఆధ్యాత్మిక, ప్రవచన రంగాల్లో ఉన్నవారు, ఆలయ సిబ్బంది, యోగా, సంగీతం తదితర రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. ఏప్రిల్‌, సెప్టెంబర్‌ నెల మధ్య కొద్దిగా అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణ సూచనలు కూడా ఉన్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు.
  Published by:Krishna Kumar N
  First published: