Home /News /astrology /

VIJAYAWADA NAVARATRI 2020 VIJAYAWADA KANAKADURGAMMA APPEARS AS ANNAPURNA DEVI TODAY NK

Dussehra 2020: ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి శోభ... అన్నపూర్ణ దేవి అలంకారంలో అమ్మవారు

అన్నపూర్ణ దేవి అలంకారంలో అమ్మవారు

అన్నపూర్ణ దేవి అలంకారంలో అమ్మవారు

Dussehra 2020: దసరా నవరాత్రుల్లో ఒక్కోరోజు అమ్మవారిని ఒక్కో రూపంలో పూజించడం, అలంకారం చేయడం మన సంప్రదాయం. మరి నేటి అన్నపూర్ణ దేవి అలంకార ప్రాసస్థ్యం తెలుసుకుందాం.

    Vijayawada Navaratri 2020: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తులు, భవానీలు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని వివిధ రూపాల్లో దర్శించుకొని తరిస్తున్నారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజు అమ్మవారు... అన్నపూర్ణ దేవిగా భక్తులను కటాక్షిస్తున్నారు. అమ్మవారి ప్రతి రూపానికీ ప్రత్యేక అర్థం, పరమార్థం ఉన్నాయి. సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నపూర్ణ దేవి రూపంలో అమ్మ... రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆధిభిక్షువైన ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాక్ సిద్ధి, శుద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయని పండితులు తెలిపారు.

    అన్నపూర్ణ దేవి అలంకారంలో అమ్మవారు


    మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా అన్నపూర్మ దేవి అనుగ్రహిస్తుంది. ప్రపంచ సృష్టి పోషకురాలు ‘అమ్మ‘ అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుద్ధి, జ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది.

    అక్టోబర్ 17 శనివారం బెజవాడ ఇంద్రకీలాద్రిపై మొదలైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 25వ తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం పది అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుంది. దసరా రోజున భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి... అందుకు తగిన ఏర్పాట్లలో అధికారులు, ఆలయ నిర్వాహకులు తలమునకలయ్యారు. ప్రస్తుతం దర్శనానికి వచ్చే వాళ్ళు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించేలా చేస్తున్నారు. మాస్క్ తప్పని సరి చేశారు. ఏడాది నుంచి నిర్మాణంలో ఉన్న శివాలయం కూడా పూర్తయింది. శనివారం నుంచి శివాలయంలో కూడా దర్శనాలకు అనుమతిస్తున్నారు.

    భక్తులకు ఇవీ రూల్స్ :

    కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ వినాయక గుడి నుంచి రావాలి. ఆన్‌లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఐడీ కార్డు ఉంటేనే అనుమతిస్తారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు చీరను సమర్పిస్తారు. ఆన్‌లైన్ టికెట్ సమస్యలు ఉన్న వాళ్ళకి పున్నమి ఘాట్, మాడపాటి సత్రం వద్ద టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. ఈ సారి సామూహిక పూజలు లేవు. పరోక్ష పూజలు అందుబాటులో ఉంటాయి. ఘాట్ రోడ్ లో ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు ఈవో తెలిపారు. వీఐపీలకు ఉదయం 7 నుంచి 9 వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటలు వరకే అనుమతి ఉంటుందని ఈవో సురేష్ బాబు చెప్పారు. వీఐపీలు కూడా ఆన్‌లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోవాలని స్పష్టం చేశారు. టైం స్లాట్ ప్రకారమే రావాలని తేల్చి చెప్పారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Dussehra 2020, Navaratri 2020

    తదుపరి వార్తలు