VIJAYAWADA NAVARATRI 2020 VIJAYAWADA KANAKA DURGAMMA APPEARS AS MAHA SARASWATI DEVI TODAY NK
Dussehra 2020: విజయవాడలో మహా సరస్వతిగా అమ్మవారు... నేడు ఇంద్రకీలాద్రికి సీఎం జగన్
శ్రీ మహా సరస్వతిగా కనక దుర్గ అమ్మవారు
Dussehra 2020: దసరా నవరాత్రుల్లో ఒక్కోరోజు అమ్మవారిని ఒక్కో రూపంలో పూజించడం, అలంకారం చేయడం మన సంప్రదాయం. మరి నేటి మహా సరస్వతి దేవి అలంకార ప్రాసస్థ్యం తెలుసుకుందాం.
Vijayawada Navaratri 2020: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తులు, భవానీలు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని వివిధ రూపాల్లో దర్శించుకొని తరిస్తున్నారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఐదో రోజు అమ్మవారు... మహా సరస్వతి దేవిగా భక్తులను కటాక్షిస్తున్నారు. అమ్మవారి ప్రతి రూపానికీ ప్రత్యేక అర్థం, పరమార్థం ఉన్నాయి. త్రి శక్తులలో ఒక మహాశక్తి సరస్వతీ దేవి. అమ్మవారు సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో ఉంది. ఆ రూపాలు ఏవంటే... చింతామని సరస్వతి, జ్ఞాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మహా సరస్వతి. ఈ రూపాలలో ఒకటైన మహా సరస్వతి దేవి... శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ప్రజలకు స్వేచ్ఛను కల్పించింది.
శ్రీ మహా సరస్వతిగా కనక దుర్గ అమ్మవారు
నేడు ఇంద్రకీలాద్రికి సీఎం జగన్:
ఏపీ సీఎం వైఎస్ జగన్... ఇవాళ ఇంద్రకీలాద్రికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లూ చేశారు. బుధవారం మూల నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం కావడంతో... ఇవాళ జగన్... రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు ఇస్తారు. ఇందుకోసం మధ్యాహ్నం 3.30 గంటలకు ఇంటి నుంచి బయల్దేరతారు. 3.40కి దుర్గమ్మ గుడిని చేరుకొని పట్టువస్త్రాలు ఇస్తారు. 4 గంటలకు తిరిగి సీఎం క్యాంప్ ఆఫీస్ కి వెళ్తారు.
అక్టోబర్ 17 శనివారం బెజవాడ ఇంద్రకీలాద్రిపై మొదలైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 25వ తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం పది అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుంది. దసరా రోజున భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి... అందుకు తగిన ఏర్పాట్లలో అధికారులు, ఆలయ నిర్వాహకులు తలమునకలయ్యారు. ప్రస్తుతం దర్శనానికి వచ్చే వాళ్ళు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించేలా చేస్తున్నారు. మాస్క్ తప్పని సరి చేశారు. ఏడాది నుంచి నిర్మాణంలో ఉన్న శివాలయం కూడా పూర్తయింది. శనివారం నుంచి శివాలయంలో కూడా దర్శనాలకు అనుమతిస్తున్నారు.
భక్తులకు ఇవీ రూల్స్ :
కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ వినాయక గుడి నుంచి రావాలి. ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఐడీ కార్డు ఉంటేనే అనుమతిస్తారు. ఆన్లైన్ టికెట్ సమస్యలు ఉన్న వాళ్ళకి పున్నమి ఘాట్, మాడపాటి సత్రం వద్ద టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. ఈ సారి సామూహిక పూజలు లేవు. పరోక్ష పూజలు అందుబాటులో ఉంటాయి. ఘాట్ రోడ్ లో ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు ఈవో తెలిపారు. వీఐపీలకు ఉదయం 7 నుంచి 9 వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటలు వరకే అనుమతి ఉంటుందని ఈవో సురేష్ బాబు చెప్పారు. వీఐపీలు కూడా ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోవాలని స్పష్టం చేశారు. టైం స్లాట్ ప్రకారమే రావాలని తేల్చి చెప్పారు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.