• HOME
 • »
 • NEWS
 • »
 • ASTROLOGY
 • »
 • UGADI PANCHANGAM 13 4 2021 HOROSCOPE FOR 12 ZODIAC SIGNS CHECK ASTROLOGY YEARLY PREDICTIONS FOR ALL RASI PHALALU HERE NK

Ugadi Panchangam: ఉగాది రాశి ఫలాలు.. ప్లవ నామ సంవత్సరంలో శుభాలు

Ugadi Panchangam: ఉగాది రాశి ఫలాలు.. ప్లవ నామ సంవత్సరంలో శుభాలు

Ugadi Panchangam: ఉగాది రాశి ఫలాలు.. ప్లవ నామ సంవత్సరంలో శుభాలు

Ugadi Panchangam 2021: అందరికీ ఉగాది శుభాకాంక్షలు. 12 రాశుల వారికి శ్రీ ప్లవ నామ సంవత్సర వార్షిక జ్యోతిష ఫలితాలు (ఉగాది పంచాంగం) ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.

 • Share this:
  Ugadi Rasi Phalalu: నేడు సూర్యోదయానికి పాడ్యమి కాబట్టి ఇవాళ ఉగాది. వికారినామ సంవత్సరం (2019) పేరుకు తగినట్టుగా వికృతంగా నాట్యం చేసింది. శార్వరి (అంటే చీకటి) నామ సంవత్సరం (2020) ప్రపంచాన్ని అంధకారం లోకి నెట్టింది. ఇప్పుడు ప్లవ నామ సంవత్సరం మొదలైంది. ఇది శుభప్రదమైన సంవత్సరం. ప్లవ అంటే దాటించునది అని అర్థం. "దుర్భిక్షాయ ప్లవ ఇతి. తతశ్శోభనే భూరితోయం" దుర్భరమైన ప్రతికూలతను దాటించి భూమికి శోభను చేకూరుస్తుంది అని వరాహసంహిత వివరించింది. అంటే చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తుందని అర్థం. ప్లవ నామ సంవత్సరం ముగియగానే "శుభకృత్", ఆ తరువాత "శోభకృత్" సంవత్సరాలు వస్తాయి. పేరుకు తగ్గట్టుగా ఇవి కూడా మన మనసుకు సంతోషాన్ని, వికాసాన్ని కలిగిస్తాయి. ఈ ఉగాది ప్లవ నామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలాంటి (ఉగాది పంచాంగం) ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.

  మేషం (Aries) (అశ్విని, భరణి, కృత్తిక 1)
  ఏప్రిల్ 6వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 14 వరకు గురువు కుంభంలో సంచరిస్తున్నందువల్ల ఆర్థికంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా, సామాజికంగా విజయాలు వరించే అవకాశం ఉంది. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగులకు మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగపరంగా కొన్ని సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉద్యోగం మారాలి అనుకునేవారు మంచి మార్పును ఆశించవచ్చు. ఈ ఏడాదంతా ప్రశాంతంగానే గడిచిపోతుంది. కష్టకాలం ముగిసిపోయినట్టే భావించవచ్చు. అప్పు తీరుస్తారు. కుటుంబపరంగా అభివృద్ధిని సాధిస్తారు. ఆరోగ్యానికి లోటు ఉండదు. శని సంచారం కారణంగా తిప్పుట ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు పూర్తవుతాయి. విదేశీ ప్రయాణాల సూచనలు ఉన్నాయి. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. చెడు స్నేహాలకు, వ్యసనాలకు దూరంగా ఉండండి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా మంచి ప్రయోజనం పొందుతారు. ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకూ దారితీస్తాయి.

  వృషభం (Taurus) (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
  గురు గ్రహం కుంభంలోకి మారడం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రాభవం తగ్గుతుంది. శ్రమ అధికమవుతుంది. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావడం, అదనంగా బాధ్యతలు మీద పడటం వంటివి జరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. ఈ రంగాల్లో కూడా శ్రమ అధికమవుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు కానీ, ఖర్చులు మాత్రం బాగా పెరుగుతాయి. పెండింగ్‌ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. స్త్రీలతో అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ప్రేమలో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక, వ్యాపార, ఆధ్యాత్మిక, స్వయం ఉపాధి వంటి రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. వివాదాలకు దిగవద్దు. కోర్టు కేసులు అనుకూలంగా వచ్చే సూచనలు ఉన్నాయి.

  మిధునం (Gemini) (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
  మీకు భాగ్య స్థానమైన కుంభ రాశిలోకి గురు గ్రహం ప్రవేశిస్తున్న కారణంగా, ఆర్థిక లాభం, ఆకస్మిక ధనలాభం, రుణ బాధ నివృత్తి వంటివి అనుభవానికి వస్తాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్‌ పనులను పూర్తి చేస్తారు. శుభకార్యం చేస్తారు. కాలం అన్నివిధాలా సహకరిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌, ఇంక్రిమెంట్‌లో పెరుగుదల వంటివి కూడా జరిగే అవకాశం ఉంది. అష్టమంలో శని సంచారం వల్ల ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. చిన్న పనికి కూడా అధికంగా కష్టపడటం వంటివి అనుభవానికి వస్తాయి. ఇంటా బయటా కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగ నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో తృప్తిగా ఉండవు. ఎవరికీ హామీలు ఉండవద్దు.

  కర్కాటకం (Cancer) (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
  ఈ ఏడాది కొద్దిగా గ్రహబలం తగ్గినందువల్ల మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఏప్రిల్‌ 6న గురు గ్రహం కుంభ రాశిలోకి,... అంటే మీకు అష్టమ రాశిలోకి ప్రవేశిస్తున్న కారణంగా ఆర్థికంగా కొన్ని సమస్యలు, ఇబ్బందులు తలెత్తుతాయి. ఆదాయంలో పెరుగుద ఉండదు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలోను, వృత్తిలోను శ్రద్ధను, శ్రమను బాగా పెంచాల్సి ఉంటుంది. ఇక సప్తమంలో శని సంచారం కారణంగా మధ్య మధ్య అనారోగ్య సమస్యులు తలెత్తుతుంటాయి. నిరుద్యోగులకు ఉన్న ఊరిలోనే ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. తల్లితండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. ప్రేమ వ్యవహారాల్లో ఆశించిన ఫలితం కనిపించదు. రియల్‌ ఎస్టేట్‌ వారికి, బ్యాంకర్లకు సమయం అన్ని విధాలా బాగుంటుంది. బాధ్యతను సహనంతో నిర్వర్తించాల్సి ఉంటుంది.

  సింహం (Leo) (మఖ, పుబ్బ, ఉత్తర 1)
  మీకు సప్తమ రాశి అయిన కుంభం రాశిలోకి గురు గ్రహం ప్రవేశించినందు వల్ల విశేషమైన శుభాలు జరగబోతున్నాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అభివృద్ధి ఉంటుంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ విజయంగా మార్చుకుంటారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరి జీవితంలో స్థిరపడతారు. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఇల్లు గానీ, స్థలంగానీ కొనే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. శుభవార్తలు వింటారు. మొత్తానికి ఈ ఏడాది అన్ని విధాలా అనుకూలంగా ఉంది. జీవితంలో ఎదుగుదలకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. భార్యాపిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. విద్యార్థులు అభినందనలు అందుకుంటారు. రియల్‌ ఎస్టేట్‌ వారికి, రాజకీయాు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. స్నేహితులతో విందుల్లో పాల్గొంటారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల కాస్తంత జాగ్రత్తగా ఉండండి.

  కన్య (Virgo) (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
  గ్రహ సంచారం కారణంగా ఈ ఏడాది ఈ రాశి వారు మిశ్రమ ఫలితాలు అనుభవించాల్సి ఉంటుంది. గురు గ్రహం మీకు ఆరవ రాశి అయినా... కుంభ రాశిలోకి ప్రవేశించడం వల్ల వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారికి కొద్దిగా చిక్కులు ఎదురవుతాయి. ఏది సాధించాలన్నా పట్టుదల పెంచాల్సి ఉంటుంది. ఆదాయంలోను, లాభాల్లోను పెరుగుదల, ఎదుగుదల కనిపించవు. సమస్య పరిష్కారంలో కొద్దిగా ఓర్పుతో వ్యవహరించాల్సి ఉంటుంది. విమర్శలు, ఆరోపణలు, నిందలు, అభాండాలు మీద పడే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవా లేదు. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. స్నేహితులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. తోబుట్టువుతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఎవరికీ డబ్బులివ్వవద్దు. స్నేహితుల్లో ఒకరు మోసం చేసే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విద్యార్థులకు బాగుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. చిన్న వ్యాపారులకు, రైతులకు అన్ని విధాలా బాగా కలిసి వచ్చే సమయం.

  తుల (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
  ఈ నెల 6వ తేదీన మీకు అయిదవ రాశి అయిన కుంభ రాశిలోకి గురు గ్రహం ప్రవేశించినందువల్ల ఆర్థిక పురోగతి ఉంటుంది. అన్నివిధాలా కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో అభివృద్ధికి అవకాశం ఉంది. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆధ్యాత్మికంగా పురోగతి చెందుతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. నాలుగింట శని సంచారం కారణంగా మధ్య మధ్య తిప్పుట, అనారోగ్య బాధలు తప్పవు. పెండింగ్‌ పనులు పూర్తవుతాయి. వీసా సమస్యలు  పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. కుటుంబంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. విద్యార్థులకు బాగా అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు పోవడం వల్ల ఇబ్బందులు పడతారు. చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి వారు ప్రయోజనం పొందుతారు. సమయం అనుకూంగా ఉంది. కోర్టు కేసు వాయిదా పడుతుంది. కొత్త పరిచయాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి.

  వృశ్చికం (Scorpio) (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)
  ఏప్రిల్‌ 6న గురువు కుంభ రాశిలోకి ప్రవేశించిన కారణంగా ఆర్థిక సమస్యలు కొంత వరకు పరిష్కారం అవుతాయి. ఇల్లు మారే అలోచన చేస్తారు. ఇల్లు గానీ, స్థలం గానీ కొనాలని ప్రయత్నిస్తారు. ఉద్యోగ రీత్యా స్థాన చలనానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు సంభవం. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు మీద పడతాయి. మొత్తం మీద జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుందనుకోవచ్చు. తలపెట్టిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఆశాభావంతో వ్యవహరిస్తారు. ఇంట్లో శుభకార్యానికి ప్రణాళికలు సిద్ధం చేస్తారు. క్రియాశీలంగా ఆలోచించి కొత్త నిర్ణయాలు తీసుకుంటే అవి భవిష్యత్తులో సత్ఫలితాలనిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. సమయానికి చేతికి డబ్బు అంది అవసరాలు తీరతాయి. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. బ్యాంకర్లు, డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు.

  ధనస్సు (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
  ఈ రాశివారికి గ్రహ సంచారం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. గురు గ్రహం కుంభ రాశిలోకి ప్రవేశం వల్ల సరికొత్త నిర్ణయాలు, ఆలోచనలతో పనులు ప్రారంభిస్తారు. ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. జీవితంలో సాహసాలకు ఒడిగడతారు. ఆదాయం బాగా పెరుగుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడి, భవిష్యత్తుకు బాటలు వేస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. బంధువుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారికి పరిస్థితులు కలిసి వస్తాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అయితే, వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారంలో మరో అడుగు ముందుకు వేస్తారు. ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఐ.టి నిపుణులకు బాగుంటుంది.

  మకరం (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
  ఈ రాశివారికి గురువు రెండో రాశిలోకి ప్రవేశించినందువల్ల, శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి. కొద్దిగా ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్‌, ఇంక్రిమెంట్‌, అధికారుల నుంచి ప్రశంసలు, ప్రోత్సాహకాలు వంటివి చోటు చేసుకుంటాయి. సమాజంలో పలుకుబడి పెరగడానికి, పలుకుబడి కలిగిన వాళ్లతో పరిచయాలు పెరగడానికి అవకాశం ఉంది. గృహ, వాహన యోగాలున్నాయి. సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు. ఏలిన నాటి శని కారణంగా ప్రతి పనీ ఆలస్యం అయ్యే అవకాశం ఉన్పప్పటికీ, తలచిన పనులు నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినా డాక్టర్ల సాయంతో బయటపడతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులు రాణిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు వెళ్తారు. రాజకీయ, సామాజిక రంగంలోని వారు అభివృద్ధి సాధిస్తారు. వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది.

  కుంభం (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
  ఈ ఏడాది ఈ రాశివారికి గ్రహబలం అంతగా అనుకూలంగా లేదు. ఈ నెల 6 నుంచి గురుగ్రహం కుంభ రాశి లోకి సంచారం వల్ల ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. వృత్తి, వ్యాపారాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తారు. ఆశలు, ఆశయాలు పెరుగుతాయి. సంతానం కలుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఉద్యోగం మారాలనే ఆలోచన పెట్టుకోవద్దు. ఉద్యోగంలో శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. అదనపు బాధ్యతలు మీద పడతాయి. అధికారుల వేధింపులు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు హద్దులు దాటుతాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. బంధువుతో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. సంతానంలో ఒకరికి సొంత ఊర్లోనే ఉద్యోగం వస్తుంది. చిన్ననాటి స్నేహితులు తటస్థపడతారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతి సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఆరోగ్యం జాగ్రత్త.
  ఇంజనీర్లు, వృత్తి నిపుణులకు, రియల్‌ ఎస్టేట్‌వారికి బాగుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు.

  ఇది కూడా చదవండి: Jealousy: మీపై ఎవరైనా ఈర్ష్యతో ఉన్నారా... వారిలో జలసీ లక్షణాలను ఇలా గుర్తించండి

  మీనం (Pices) (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర 4, రేవతి 4)
  ఈ రాశివారికి 12వ రాశిలో గురువు ప్రవేశిస్తున్నందువ్ల ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాల్లో శుభఫలితాలు ఉన్నాయి. సమాజంలో విశేషమైన కీర్తి లభిస్తుంది. ఉద్యోగంలో అధికార, పదవీ లాభాలు ఉన్నాయి. శుభకార్యాల మీద భారీగా ఖర్చయ్యే అవకాశం ఉంది. సొంత నిర్ణయాలు, ఆలోచనల కన్నా కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికమవుతుంది. అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు. ఇతర స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించే అవకాశం ఉంది. కోర్టు కేసులు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు బాగుంది.
  Published by:Krishna Kumar N
  First published:

  అగ్ర కథనాలు