హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Tholi Ekadashi 2022: రేపే తొలి ఏకాదశి.. నియమనిష్టలతో ఇలా చేస్తే సమస్త వ్యధల నుంచీ విముక్తి..

Tholi Ekadashi 2022: రేపే తొలి ఏకాదశి.. నియమనిష్టలతో ఇలా చేస్తే సమస్త వ్యధల నుంచీ విముక్తి..

Vishnu-Bhagawan

Vishnu-Bhagawan

Tholi Ekadashi 2022: ఏకాదశి తెలుగువారి మొదటి పండుగ. ఈ పండుగ తర్వాతే ఇతర పండుగలు జరుగుతాయి. హిందూ ఆచారాల్లో తొలి ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది. దాని ప్రాసస్త్యం ఇదీ.

  చాలా మంది వినాయక చవితితో తెలుగువారి పండుగలు మొదలవుతాయని అనుకుంటారు. కానీ హిందు సంప్రదాయాల ప్రకారం... తొలి ఏకాదశి మొదటి పండుగ. దీని తర్వాతే వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు వస్తాయి. తొలి ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. దీన్ని పేలాల పండుగ, హరి వాసరం, శయనైకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని “శయన ఏకాదశి” అంటారు. నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు.సంవత్సరం కాలంలో 24 ఏకాదశులు వస్తాయి. వాటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశి అనేది తొలి ఏకాదశి.

  పురాణాల ప్రకారం.. శ్రీమహావిష్ణువు పాల సముద్రంలో శేషతల్పంపై 4 నెలలు నిద్రపోతారు. అక్టోబర్ లేదా నవంబర్‌లో వచ్చే ప్రబోధినీ ఏకాదశికి ఆయన తిరిగి నిద్రలేస్తారు. ఈ 4 నెలల్నీ చతుర్మాసాలు అంటారు. ఈ కాలంలో కొంతమంది చతుర్మాస దీక్ష చేస్తారు. ఈ 4 నెలలూ స్వామివారు పాతాళంలో బలి చక్రవర్తి దగ్గర ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది తొలి ఏకాదశి 10-7-22 (రేపు ఆదివారం) వ తేదీన ఉంది.

  నియమాలు:

  దక్షిణాయనం మొన్నే మొదలైంది. ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పండుగలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా వచ్చే కాలం ఇది. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకోసం కొన్ని నియమాలు పాటించాలి. ఈ కాలంలో పెద్దలు... వ్రతాలు, పూజలు చేస్తారు. తొలి ఏకాదశి నాడు ఉపవాస దీక్ష చేస్తే ఆరోగ్యానికి మంచిదని ప్రతీతి.

  పురాణ గాథ:

  కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మ నుంచి వరం పొంది... దేవతల్నీ, రుషులనీ హింసించేవాడు. ఆ రాక్షసుడితో శ్రీమహావిష్ణువు వెయ్యేళ్లు పోరాడారు. చివరకు అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుంటే... శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య పుట్టి... ఆ రాక్షసుణ్ని చంపేసింది. దానికి ఆ కన్యను ఏదైనా వరం కోరుకోమని స్వామి చెప్పగా... తాను విష్ణుప్రియగా భూమిపై పూజలు అందుకోవాలని కోరింది. స్వామి వరం ఇచ్చారు. దాంతో... ఆమెను ఏకాదశి తిథిగా పిలుస్తున్నారు. రుషులు, భక్తులు ‘ఏకాదశి’ వ్రతం చేసి విష్ణుసాయుజ్యం పొందినట్లు ప్రతీతి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతం చేసినట్లు చెబుతారు.

  చేయాల్సినవి:

  ఏకాదశి రోజున ఉపవాసం ఉండొచ్చు. రాత్రంతా జాగారం చెయ్యాలి. విష్ణుసహస్రనామ పారాయణం చెయ్యాలి. విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవాలి. అలాంటివి చేయడం పుణ్యం. మర్నాడు ద్వాదశి. ఆ రోజున దగ్గర్లోని ఆలయానికి వెళ్లి ఉపవాస దీక్ష విరమించాలి. ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే ఎంతో మంచిదని పండితులు తెలిపారు.

  ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి.

  ఇది కూడా చదవండి :శనివారం సాయంత్రం ఎవరికీ చెప్పకుండా ఈ పరిహారం చేస్తే.. కష్టాలు తీరిపోయి అదృష్టం ఒక్కరాత్రిలోనే మేల్కొంటుందట..

  పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలంటారు పెద్దలు. మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండుగ రోజున గుర్తు చేసుకోవడం మన ధర్మం. వాతావరణంలో మార్పుల వల్ల మనకు రకరకాల రోగాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలం మొదలైంది కాబట్టి... ఇన్ఫెక్షన్ల దాడి తప్పదు.

  ఈ సమయంలో పేలాల పిండి బాడీలో వేడిని పెంచుతుంది. తద్వారా ప్రోటీన్స్ పెరిగి... ఇమ్యూనిటీ పెరిగి... ఇన్ఫెక్షన్లు సోకవు. అందుకే నేడు ఇళ్లలో, ఆలయాల్లో పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు. పైన చెప్పిన నియమాలు, ఉపవాసం ఇవన్నీ చేస్తే మంచిదే. అనారోగ్యంతో ఉన్న వారు ఇలాంటివి చెయ్యడం కష్టం. అలాంటి వారు పూర్తి విశ్రాంతి తీసుకోవడం మేలని పండితులు తెలిపారు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Astrology, Fasting

  ఉత్తమ కథలు