వివిధ రాశులకు సంబంధించి శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఫలితాలను ఇక్కడ అందజేస్తున్నాం. ప్రధానగ్రహాలైన శనీశ్వరుడు, గురువు, రాహువు, కేతువుల స్థితిగతులను బట్టి ఇతర గ్రహాల సంచారాన్ని బట్టి ఈ రాశుల ఫలితాలను చెప్పడం జరుగుతోంది. అయితే, వ్యక్తిగత జాతక చక్రాలను ఆధారం చేసుకుని ఫలితాలను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత జాతక చక్రాలలో గ్రహాల స్థితిగతులు ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ గ్రహ సంచారానికి కూడా అత్యంత ప్రాధాన్యం ఉంటుందని గమనించాలి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
ఆదాయం 2, వ్యయం 11
రాజపూజ్యం 4, అవమానం 7...
ప్రధాన గ్రహాలు అనుకూలంగా లేనందువల్ల కొద్దిగా ప్రతికూల ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరానికి శుక్ర బుధ గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉన్నందువల్ల, సంవత్సర మొత్తంలో రెండు మూడు నెలలు మాత్రం ఆదాయపరంగా, ఉద్యోగ పరంగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు మీద పడి ఇబ్బంది పడతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయాల్సి వస్తుంది. బంధుమిత్రుల నుంచి కానీ సహచరుల నుంచి గానీ ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభించక పోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన కలిసి రావు.
ముఖ్యమైన నెలలు
మే, జూలై, నవంబర్ నెలల్లో ఆర్థిక పరిస్థితి కాస్తంత మెరుగుపడి కొన్ని సమస్యల నుంచి గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన నెలలో పెద్దగా మెరుగుదల, ఎదుగుదల ఉండకపోవచ్చు. దూర ప్రాంతం నుంచి ఒకటి రెండు శుభవార్తలు అందుతాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. కొద్దిగా ఓర్పు సహనాలను పాటిస్తే ఆ తర్వాత అదృష్టం మీది అవుతుంది.
కొన్ని జాగ్రత్తలు
ఆహార, విహారాలకు సంబంధించిన నియమాలను పాటించడం మంచిది. పొదుపు అలవాటు చేసుకోవలసిన అవసరం ఉంది. పొగడ్తలకు పొంగిపోవడం మంచిది కాదు. నమ్మించి ద్రోహం చేసే వ్యక్తులు మీ చుట్టూరా ఉన్నారని గమనించండి. గ్రహాలు కొద్దిగా ప్రతికూలంగా ఉన్నప్పుడు తలవంచడం శ్రేయస్కరం. తరచూ వినాయకుడిని పూజించడం వల్ల కొన్ని కష్టాల నుంచి గట్టెక్కడం జరుగుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Ugadi 2023