ఆ ఆలయంలో ఎలుకలు కొరికితేనే ప్రసాదం.. నిజంగా మహత్యమే

ప్రతీకాత్మక చిత్రం

ఈ గుడిలో ఇలా ఎలుకలు ముట్టిన ఆహారాన్ని ప్రసాదంగా తిన్నప్పటికీ ఇప్పటి వరకూ ఏ ఒక్కరికీ కలరా సోకకపోవటం అమ్మవారి మహత్యమే.

  • Share this:
మనదేశంలో ఉన్న గుళ్లు (temples), గోపురాలు అసంఖ్యాకం. వీటిలో పాటించే ఆచార వ్యవహారాలు కూడా వేటికవే విశిష్టం. అలాంటి ఓ దేవాలయంలో ఎలుకలు (rats) తినగా మిగిలిన ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ వింత ఆచారం రాజస్థాన్ (Rajastan) లో తరతరాలుగా పాటిస్తున్నారు. రాజస్థాన్ లోని బికనీర్ సమీపంలో ఉన్న కర్నిమాతా (Karni Mata) మందిరంలో ఎలుకలు తిని మిగిలిన ఆహారాన్ని ప్రసాదంగా తీసుకుంటారు. ఎలుకలు తాగి మిగిలిన పాలనే ఇక్కడికి వచ్చిన భక్తుల తీర్థంగా సేవిస్తారు. ఇక్కడి ఈ ప్రత్యేక ప్రసాదాన్ని సేవిస్తే కోరిన కోర్కెలన్నీ తప్పకుండా తీరి, తమ జీవితంలో అద్భుతాలు (miracles) జరుగుతాయని భక్తుల విశ్వాసం.

కోరిన కోర్కెలన్నీ తీర్చే కర్ని మాత దర్శనానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. కోర్కెలు తీరాలంటూ, తీరిన కోర్కెల తాలూకు మొక్కులను చెల్లించుకునేందుకు ఇక్కడికి నిత్యం వచ్చే భక్తుల సంఖ్య అపారం. నిత్యం భక్తుల (devotees) రద్దీతో కర్ని మాత ఆలయం కిటకిటలాడుతుంది. ఇక్కడున్న ఎలుకల సంఖ్య పాతిక వేల పైమాటే. ఇవి ఇక్కడి భక్తులపై పాకుతాయి కూడా. నల్ల ఎలుకల సంఖ్య చాలా ఎక్కువగా ఉండగా, కొన్ని తెల్ల ఎలుకలు కూడా ఉన్నాయి. గుడి ఆవరణంలో తెల్ల ఎలుకలు కనిపిస్తే అత్యంత శుభసూచకమని ఇక్కడికి వచ్చిన భక్తులు చెప్పుకుంటారు. నిత్యం ఇంత రద్దీ ఉన్నా ఈ ఎలుకల గుంపు మాత్రం ఎవరినీ కొరకడం, బాధపెట్టడం వంటివి చేయకపోవటం విశేషం.

దుర్గామాత
సాక్షాత్తూ దుర్గా మాతనే ఇక్కడ శ్రీ కర్నిజీ మహరాజ్ గా అవతరించారని స్థల పురాణం చెబుతోంది. 15వ శతాబ్దంలో 150 ఏళ్లపాటు ఈమె ఇక్కడ నివసించినట్టు చెబుతారు. జోధ్ పూర్, బికనీర్ కు చెందిన రాజకుటుంబాలు (royal families) ఈమెను ఆరాధించి, అమ్మ కృపకు పాత్రులయ్యారని చరిత్ర చెబుతోంది. రాజకుటుంబాలకు అవసరమైనప్పుడు సలహాలు, సూచనలు సైతం ఇచ్చిన అమ్మవారు కావటంతో నేటికీ ఆయా రాజకుంబాలవారు అమ్మవారిని తరచూ దర్శించుకుంటారు. కర్ని మాత గుడి 25,000 ఎలుకలు నివాసం కావటం విశేషం.

తెల్ల ఎలుకలు కనిపిస్తే శుభం
సాధారణంగా ఇక్కడ తెల్ల ఎలుకల (white rats) దర్శనం అందరికీ అవ్వదు. కేవలం అమ్మవారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలున్న భక్తులకు మాత్రమే ఈ తెల్ల ఎలుకలు కనిపిస్తాయని ప్రతీతి. కర్ని మాత, ఆమె సంతానం ఇక్కడ తెల్ల ఎలుకల రూపంలో సంచరిస్తూ ఉంటారని భక్తుల విశ్వాసం. కనుక మందరి ప్రాంగణంలో తెల్ల ఎలుకలు కనిపిస్తే మాత్రం అత్యంత శుభకరమని, తాము కోరిన కోర్కెలు తప్పకుండా తీరుతాయని భావిస్తారు. మరో విచిత్రం ఏమిటంటే ఎలుకలు తిన్న ఆహారం, తాగిన పాలు మిగిలిపోగా వాటిని తీర్థ, ప్రసాదాలుగా తీసుకున్నప్పటికీ భక్తులెవ్వరికీ అనారోగ్యం కలుగదు. సాధారణంగా ఎలుకలు ముట్టిన ఆహారం తింటే కలరా వంటి వ్యాధులు వస్తాయి. కానీ ఈ గుడిలో ఇలా ఎలుకలు ముట్టిన ఆహారాన్ని ప్రసాదంగా తిన్నప్పటికీ ఇప్పటి వరకూ ఏ ఒక్కరికీ కలరా సోకకపోవటం అమ్మవారి మహత్యమే.
Published by:Kishore Akkaladevi
First published: