Bharat Mata Temple: మన భారత మాత ఆలయం గురించి తెలుసా..? అసలు గుడి ఎందుకు కట్టారంటే..?

శ్రీకాకుళంలో భరత మాత ఆలయం

భారత మాతకు గుడి కట్టడమే కాదు.. నిత్యం పూజలు కూడా చేస్తుంటారు.. ప్రతి గురు వారం ప్రత్యేక దీక్షలు చేస్తారు. అలాగే ఆగస్టు 15, జనవరి 26న ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు.. అసలు ఈ గుడి ప్రత్యేకత ఏంటో తెలుసా..?

 • Share this:
  దేశ ప్రజలంతా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. భారత్ మాతాకీ జై అంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినాదాలు చేస్తున్నారు. భారత దేశ ఔనత్యాన్ని గుర్తు చేస్తున్నారు. ఇలా ఆగస్టు 15 రోజుమాత్రమే అందరిలో దేశ భక్తి ఉప్పొంగుతుంది. మిగిలిన రోజులు పరిస్థితి ఏంటి.. నిత్యం ఇదే భావన కలిగి ఉంటారా. భారత మాతను పూజిస్తుంటారా..? కానీ కొందరు దేశభక్తులు నిజమైన తమ భక్తిని చాటుకుంటున్నారు. భారత మాతకు ఏకం ఆలయమే కట్టారు.. సాధారణంగా దేవుళ్లు, లేదా అమ్మవార్లకు మాత్రమే గుడి కడతారు. భక్తి శ్రద్ధలతో విగ్రహాలను ప్రతిష్టించి నిత్యం పూజలు చేస్తుంటారు. ఈ మధ్య కొందరు కరోనా దేవత అంటూ గుడి కూడా కట్టారు. అయితే తమ దేశ భక్తి ఏంటో చాటి చెప్పడానికి కొన్ని దశాబ్ధాల క్రితమే ఆంధ్రప్రదేశ్ లో భారత మాత ఆలయం వెలిసింది. అది ఎక్కడో తెలుసా.. ఆలయం ప్రత్యేక ఏంటో తెలుసుకోవాలి అనుకుంటున్నారు. అసలు భరత మాతకు కోవెల కట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది. ఏదో తూతూ మంత్రంగా ఆలయం కట్టడమే కాదు.. విగ్రహాన్ని ప్రతిష్టించి.. నిత్యం పూజలు కూడా చేస్తున్నారు.. ఇదే సంప్రదాయాన్ని నేటికి కూడా కొనసాగిస్తున్నారు. తమ ఆరాధ్య దేవతగా కొలుస్తూ ఏటా ఉత్సవాలు నిర్వహిస్తూ దేశభక్తిని చాటుకుంటున్నారు. నిజమైన దేశ భక్తులు అంటే వీరే కదా అనేలా చేస్తున్నారు..

  సాధరణంగా భక్తులు దుర్గా మాతను, ఇతర అమ్మవార్లను ఎలా కొలుస్తారో.. ఈ గ్రామస్తులు సైతం అదే విధంగా భారత మాత అమ్మావారిని నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..? శ్రీకాకుళం జిల్లా కవిటి మండల కపాసుకుద్ది గ్రామంలో భరతమాతకు ఆలయం నిర్మించారు. నిత్యం పూజలు కూడా నిర్వహిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఈ గ్రామంలోనే భారత మాతకు ఆలయం నిర్మించారు. ప్రతి గురువారం భరత మాతకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయిన తమ పూర్వీకున్ని భరతమాత కాపాడిందని ఇక్కడి మత్స్యకారులు విశ్వసిస్తారు. అందుకే ఊరిలో గుడికట్టి నిత్య పూజలు చేస్తున్నారు.

  కపాసుకుద్ది గ్రామ ప్రజలు ఆగస్టు 15, జనవరి 26న ఈ ఆలయం దగ్గర జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. తరువాత ప్రత్యేక పూజలు చేసి గ్రామ మహిళలు దేవతకు కుంకుమ, పసుపు, పండ్లు, వివిధ రకాల స్వీట్లు సమర్పిస్తారు. నాటి నుంచి నేటి వరకు భరత మాత తమను ప్రాణాంతక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతోందని గ్రామస్థులు నమ్ముతారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే, భారత మాత గుడిని గ్రామస్తులంతా చందాలు వేసుకొని నిర్మించారు. అయితే ఈ నిర్మాణం వెనుక పెద్ద కథే ఉంది. దాదాపు ఆరు దశాబ్దాల క్రితం ఆ ప్రాంతంలో కలరా వ్యాప్తి చెందిందట. ఆ సమయంలో గ్రామ మాతగా ఉన్న గుల్లా చక్రపాణికి కలలో భారత మాత కనిపించిందని చెబుతున్నారు. ఆ గ్రామ పెద్ద చెప్పిన మాట ప్రకారం.. అక్కడి ప్రజలను అంటువ్యాధుల నుంచి రక్షించడానికి తాను కపాసకుద్దికి వచ్చానని చెప్పిందట. ఆ తర్వాత వ్యాధి కనుమరుగయ్యిందని.. అదే సమయంలో గ్రామ శివారులో ఒక చెట్టు కింద ఉన్న భారత మాత విగ్రహాన్ని నివాసితులు కనుగొన్నారని అక్కడి పెద్దలు చెబుతున్నారు. ఆ తర్వాత అక్కడ పూజలు చెయ్యడం.. గుడి కట్టడం వెంట వెంటనే జరిగిపోయాయి. అప్పటి నుంచి ఆ గ్రామస్తులు తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే వస్తున్నారు.
  Published by:Nagesh Paina
  First published: