Andhra Pradesh: పంచాయతీల్లో శ్రుతిమించిన విజయోత్సవాలు.. హోరెత్తిన రికార్డింగ్ డాన్సులు

పంచాయతీ ఎన్నికల విజయోత్సవాల్లో రికార్డింగ్ డాన్సులు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పంచాయతీ ఎన్నికలు (AP Panchayat Elections) ముగిసినా.. పల్లెల్లో మాత్రం ఆ హడావిడి తగ్గలేదు. విజయోత్సవాలతో గ్రామాలు హోరెత్తుతున్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ముగిసినా.. పల్లెల్లో మాత్రం ఆ హడావిడి తగ్గలేదు. విజయోత్సవాలతో గ్రామాలు హోరెత్తుతున్నాయి. సర్పంచ్ పదవులు కైవసం చేసుకున్న ప్రధాన పార్టీల మద్దతుదారులు వేడుకలు, ఊరేగింపులతో అదరగొడుతున్నారు. కొంతరు ఊరంతా భోజనాలు పెడుతుంటే మరికొందరు ప్రచారంలో పనిచేసిన కుర్రోళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. విందుతో పాటు మందు, మరికొన్ని అదనపు సౌకర్యాలను కల్పిస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పంచాయతీ ఎన్నికలు సంక్రాంతి సంబరాలను తలపిస్తున్నాయి. కోడిపందేలు లేవుగానీ.. బ్యాలెట్ ఫైట్లో గెలిచిన వాళ్ల ఆనందం మాములుగా లేదు. కొన్నిచోట్ల వేడుకలు శ్రుతిమించేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన ఓ సర్పంచ్ రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.

    తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామ పంచాయతీలో సర్పంచ్ గా గెలిచిన అభ్యర్థి కొబ్బరితోటలో పార్టీ ఏర్పాటు చేశాడు. అమ్మాయిలను పిలిపించి రికార్డింగ్ డాన్సులు కూడా అరేంజ్ చేశారు. ఈనెల 21న కాపవరం గ్రామపంచాయతీ సర్పంచ్ గా వైసీపీ బలపరిచిన జాజుల రాము విజయం సాధించారు. వార్డు మెంబర్లు కూడా గెలపొందారు. దీంతో వారి ప్రమాణస్వీకారం సందర్భంగా అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేశారు. ఐతే అక్కడ చిన్నపిల్లలు కూడా ఉండటం విమర్శలకు తావిస్తోంది. ఐతే అంతకుముందు ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి కాపు కార్పొరేషన్ ఛైర్మన్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా హాజరయ్యారు.

    పంచాయతీ ఎన్నికల తర్వాత గోదావరి జిల్లాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో సంక్రాంతి రాజోలు సమీపంలోని ఓ తోటలో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. విజయోత్సవ ర్యాలీలకే షరతులు విధిస్తున్న పోలీసులు..రికార్డింగ్ డాన్సులకు ఎలా పర్మిషన్ ఇచ్చారన్నది ఇక్కడ చర్చనీయాంశమైంది. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వ్యక్తి తన షష్టిపూర్తికి రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేయడంతో అతడితో పాటు పలువురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. చర్యలు తీసుకోలేదంటూ ఏకంగా ఎస్సైనే సస్పెండ్ చేశారు. మరి ఈ ఘటనలో పోలీస్ ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
    Published by:Purna Chandra
    First published: