57 నెలలు కడుపు మాడ్చి...3 నెలల్లో అన్నీ పెడతామంటారా..? చంద్రబాబుపై జగన్ నిప్పులు

రాష్ట్రంలో కొత్తగా 59 లక్షల దొంగ ఓట్లను చేర్చారని.. దొంగ ఓట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలక జగన్ సూచించారు. రాక్షసులతో, మోసగాళ్లతో యుద్ధం చేస్తున్నామని విరుచుకుపడ్డారు.

news18-telugu
Updated: February 11, 2019, 5:09 PM IST
57 నెలలు కడుపు మాడ్చి...3 నెలల్లో అన్నీ పెడతామంటారా..? చంద్రబాబుపై జగన్ నిప్పులు
వైఎస్ జగన్ (ఫైల్ ఫొటో)
news18-telugu
Updated: February 11, 2019, 5:09 PM IST
ఓటమి భయంతో ఓటుకు రూ.3వేలు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. టీడీపీ కుట్రలను వైసీపీ కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు చిల్లర డబ్బుకు ఎవరూ అమ్ముడుపోవద్దన్నారు జగన్. రాష్ట్రంలో కొత్తగా 59 లక్షల దొంగ ఓట్లను చేర్చారని.. దొంగ ఓట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. రాక్షసులతో, మోసగాళ్లతో యుద్ధం చేస్తున్నామని విరుచుకుపడ్డారు. సోమవారం అనంతపురం సమర శంఖారావం సభలో పాల్గొని ప్రసంగించిన జగన్.. సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

ఎన్నికలు దగ్గరకొచ్చేసరికి చంద్రబాబు డబ్బుల మూటలు పంపిస్తున్నారు. రూ. 3వేలు డబ్బు చేతిలో పెట్టే కార్యక్రమం చేస్తాడు. చంద్రబాబు ఇచ్చే డబ్బుకు మోసపోవద్దు. రేపు మన ప్రభుత్వం వస్తుంది. అమ్మఒడి ద్వారా విద్యార్థుల చదువు కోసం ఏడాదికి రూ. 15 వేలుఇస్తాం. 45 ఏళ్ళు నిండిన ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు రూ. 75 వేలు ఇస్తం. పెన్షన్ రూ. 2 వేల నుంచి రూ. 3 వేలకు పెంచుతాం. పిల్లల చదువులకు, పెద్దల వైద్య ఖర్చులకు ఎన్ని లక్షలైనా ప్రభుత్వమే భరిస్తుంది. చంద్రబాబు రూ. 3 వేలు ఇస్తానంటే రూ. 5 వేలు అడగండి. డబ్బులు తీసుకొని ఒక్క సెకను దేవుడ్ని స్మరించుకొని మనస్సాక్షిగా ఓటు వేయండి.
వైఎస్ జగన్, వైసీపీ అధినేత


జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

2014 ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోల్లో పేర్కొన్న ఏ హామీలని అమలు చేయలేదు. హామీలను అమలు చేయకుండా ప్రజల సొమ్మునే దోచుకున్నారు. మట్టి, ఇసుక, బొగ్గు, భూములు, గుడి భూములు, కరెంటు కొనుగోళ్ళు.. అన్నీ ఎక్కడికక్కడ దోచేశారు.నాలుగేళ్ళు బీజేపీ-పవన్ కళ్యాణ్‌తో కాపురం చేసి..తీరా ఎన్నికలొచ్చాక నల్ల చొక్కాలు వేసుకొని యుద్ధం-పోరాటం అంటున్నారు. ప్రత్యక హోదా సంజీవనా? అని ఆయనే గతంలో అన్నారు. ఇప్పుడేమో ఓట్ల కోసం హోదా నినాదం చేస్తున్నారు.

ఎన్నికలకు మూడు నెలల ముందు పసుపు-కుంకుమ పథకం తీసుకొచ్చారు. రైతు రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు. ఆ హామీ అమలు చేయకుండానే ఇప్పడు అన్నదాత సుఖీభవా అంటున్నారు. రాజధానిలో ఒక్క శాశ్వత భవానాన్ని కూడా కట్టడం లేదు.

వృద్ధుల పెన్షన్లను రూ.2వేల చేస్తామని, ఆటోలు, ట్రాక్టర్ల లైఫ్ ట్యాక్స్ రద్దు చేస్తామని గతంలో వైసీపీ హామీ ఇచ్చింది. ప్రతీ కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మహిళలకు రూ.75వేలు ఇస్తామని గతంలో చెప్పారు. వాటినే చంద్రబాబు కాపీ కొట్టి ఎన్నికల ముందు తాయిలాలు ప్రకటిస్తున్నారు.

57 నెలలు కడుపు మాడ్చి.. చివరి మూడు నెలల్లో ఇవన్నీ పెడతామంటే ..ఆ మనిషిని మీరు అన్న అంటారా? దున్న అంటారా?

చంద్రబాబు నాయుడు ఇచ్చే హామీలు కొత్త సినిమా వాల్ పోస్టర్ల మాదిరిగా ఉన్నాయి. కాపీ కొట్టడం కూడా చేతగాని మనిషి. కాపీ కొట్టేవాడ్ని కాపీ రాయుడు అంటాడు. ఈ పెద్ద మనిషి కనీసం జగన్ గారి దగ్గర కాపీ కొట్టడం కూడా చేతగాని మనిషి.

ఒక రాక్షసుడు పంచభక్ష పరమాణ్ణాలు తయారు చేసి అందర్నీ భోజనానికి పిలుస్తాడు. మనకు తినిపించటానికి కాదు.. అక్కడికి వెళితే మనల్ని భోంచేయడానికి రాక్షసుడు పిలిచినట్టే.. చంద్రబాబు నాయుడు కూడా అంతే.

కేవలం వారం ముందు తీసిన సినిమా. అది ఆరవ బడ్జెట్ సినిమా. ఏ ముఖ్యమంత్రి అయినా 5 బడ్జెట్లు ప్రవేశ పెడతారు. రూ. 2 లక్షల 26 వేల కోట్లతో ఆరవ బడ్జెట్ పెట్టి.. జగన్ పథకాలను సగం సగం కాపీ కొట్టాడు. మూడు నెలలు ఆగండి.. మనందరి ప్రభుత్వం వస్తుంది.

ఎన్నికల సంఘం సీ-విజిల్ అనే  యాప్ తయారు చేసిందని... ఆ యాప్‌ని ప్రతి వైసీపీ కార్యకర్తా డౌన్‌లౌడ్ చేసుకోవాలన్నారు వైఎస్ జగన్. టీడీపీ ఎలాంటి అన్యాయం, అక్రమాలకు పాల్పడినా సీ-విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.  తద్వారా 100 నిమిషాల్లో చర్యలు తీసుకునే అవకాశముందని చెప్పారు.

 
First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...