తిరుమల శ్రీవారి ఆస్తుల వేలం వ్యవహారంపై ఏపీలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. టీటీడీ తీరుపై విపక్షాలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ఐతే అధికార పార్టీకి చెందిన ఎంపీ కూడా టీటీడీ తీరును తప్పుబట్టారు. నిరర్థక ఆస్తుల పేరుతో భూములను వేలం వేయాలని టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తప్పుబట్టారు. భూములను వేలం వేయడమంటే.. భూములను విరాళం ఇచ్చిన దాతల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిచేయకుండా.. అదే తప్పు చేయడం సరికాదని విమర్శించారు. ఆస్తుల అమ్మకం పేరుతో తిరుమల వెంకన్నకు టీటీడీ ద్రోహం చేస్తోందన్నారు వైసీపీ ఎంపీ.
కాగా, శ్రీవారి ఆస్తుల వేలంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆస్తుల అమ్మకంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ఆస్తులను వేలం వేయాలన్న నిర్ణయం పాత బోర్డే తీసుకుందని.. దానిపై తాము సమీక్ష మాత్రమే చేస్తున్నామని చెప్పారు. రిపోర్టు వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు వైవీ సుబ్బారెడ్డి. దీనిపై రాజకీయాలు చేయడం తగదని విపక్షాలపై విరుచుకుపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: MP raghurama krishnam raju, Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Ttd