Ysrcp mla Roja: మున్సిపల్ గేటు కూడా తాకలేరు.. సొంత పార్టీ వారికి రోజా వార్నింగ్

ఎమ్మెల్యే రోజా (ఫైల్ ఫోటో)

Ysrcp mla Roja: పార్టీలో ఉంటూ చీడ పురుగుల్లా మారిన వారిని ఏరివేయాలని రోజా అన్నారు. ప్రతిపక్షాన్ని ప్రజలు తుక్కువగా ఓడించారని తెలిపారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 95 శాతానికిపైగా ఫలితాలు సాధించే దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. అయితే వైసీపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రోజా మాత్రం వైసీపీ గెలుపును ఆస్వాదిస్తూనే సొంత పార్టీ వాళ్లకు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. నగరి నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకున్న తరువాత రోజా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారికి ఆమె నేరుగా హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ కంటే సొంత పార్టీ నుంచే ఇబ్బంది ఎదురైందని రోజా వ్యాఖ్యానించారు.

    పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన నేతలు చైర్మన్ సీటు కాదు కదా.. కనీసం మున్సిపల్ ఆఫీసు గేటు కూడా తాకలేరంటూ వార్నింగ్ ఇచ్చారు. సొంత పార్టీ వాళ్లే వెన్నుపోటు పొడిచినా రెండు మున్సిపాలిటీల్లో గెలిచామని రోజా అన్నారు. రెబల్స్‌తో నామినేషన్ వేయించినవారికి ఇదే తన వార్నింగ్ అన్నారు రోజా. పార్టీలోనే ఉంటూ వ్యతిరేకంగా పనిచేసిన వారిని తొక్కిపారేశామని వ్యాఖ్యానించారు. పార్టీలో ఉంటూ చీడ పురుగుల్లా మారిన వారిని ఏరివేయాలని రోజా అన్నారు. ప్రతిపక్షాన్ని ప్రజలు తుక్కువగా ఓడించారని తెలిపారు.

    కొద్దిరోజుల క్రితం నగరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్న రోజా.. సొంత పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తనను ఓడించేందుకు ప్రయత్నించిన వారే మరోసారి ఇప్పుడు ఓడించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరి, పుత్తూరు నియోజకవర్గాల్లో 14 మంది రెబల్స్ ను బరిలోకి దింపి ప్రతిపక్ష పార్టీ గెలుపునకు సహకరిస్తున్నారని రోజా మండిపడ్డారు. రెబెల్స్‌ను గెలిపించేందుకు భారీగా డబ్బులు కూడా ఖర్చు చేశారని ఆరోపించారు. పార్టీలో ఉన్న కొందరు పెద్దలు రెబెల్ నాయకులకు సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వడం ఇష్టం లేనివారే ఇదంతా చేస్తున్నారని.. ఇప్పటికైనా అదిష్టానం చర్యలు తీసుకోకపోతే పార్టీకి నష్టం తప్పదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఆమె మళ్లీ అదే రకమైన ధోరణితో మాట్లాడటంతో.. రెబల్ నేతలతో తాడోపేడో తేల్చుకోవడానికి ఆమె సిద్ధమైందనే వార్తలు వినిపిస్తున్నాయి.
    Published by:Kishore Akkaladevi
    First published: