వార్డు మెంబర్‌గా కూడా గెలవలేడు.. ఏపీ అసెంబ్లీలో రఘురామకృష్ణంరాజుపై మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే

ఎంపీ రఘురామ (ఫైల్ ఫోటో)

వెన్నుపోటుదారుల సంఘానికి చంద్రబాబుకు అధ్యక్షుడైతే.. తమ పార్టీ తరపున గెలిచిన ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉపాధ్యక్షుడని ఆరోపించారు.

 • Share this:
  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఆ పార్టీ ఎమ్మెల్యే జోగి ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై జోగి రమేశ్ మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు రఘురామకృష్ణంరాజుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెన్నుపోటుదారుల సంఘానికి చంద్రబాబుకు అధ్యక్షుడైతే.. తమ పార్టీ తరపున గెలిచిన ఎంపీ రఘురామకృష్ణంరాజు ఉపాధ్యక్షుడని ఆరోపించారు. తమ పార్టీ గుర్తు, తమ నాయకుడి ఫోటో పెట్టుకుని ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి.. తమకు వ్యతిరేకంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పుబట్టారు.

  రఘురామకృష్ణంరాజు తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని జోగి రమేశ్ డిమాండ్ చేశారు. తమ పార్టీ గుర్తు, తమ పార్టీ అజెండా లేకపోతే కనీసం తన సొంతూరులో వార్డు మెంబర్‌గా కూడా రఘురామకృష్ణంరాజు గెలవలేడని సవాల్ విసిరారు. అయితే రఘురామకృష్ణంరాజు విషయంలో తాను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే వాటిని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు.

  రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై వివిధ సెక్షన్ల కింద ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆయనను హైదరాబాద్ నుంచి గుంటూరుకు తరలించారు. అయితే ఈ కేసు వ్యవహారం అనేక మలుపులు తిరిగింది. ఏపీ ప్రభుత్వం తీరుపై రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఆయనను సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఆయన ఆర్మీ ఆస్పత్రిలో ఉన్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published: