హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

సొంత పార్టీని ఇరుకున పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే ?

సొంత పార్టీని ఇరుకున పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే ?

వైసీపీకి షాక్

వైసీపీకి షాక్

ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చినా ఇసుక విషయానికి వచ్చేసరికి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు.

    కొన్నిసార్లు నేతలు చేసే వ్యాఖ్యలు వారి సొంత పార్టీలనే ఇరుకునపెడుతుంటాయి. ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతుంటాయి. తాజాగా గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చేసిన కామెంట్స్ కూడా అధికార పార్టీకి ఇబ్బందిగా మారే పరిస్థితులు తలెత్తాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. గుంటూరులో ఇసుక నూతన విధానంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్వహించిన సమీక్షలో వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఇసుక అక్రమాలపై ఘాటైన విమర్శలు చేశారు.రీచ్‌లో లోడింగ్‌ అయిన ఇసుక లారీ డిపోకు వచ్చేసరికి మాయమైపోతోందని...అసలు ఇది ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

    సమావేశంలో అన్నీ మాట్లాడుకుందామన్నారు కనుక ఓపెన్‌గా మాట్లాడుతున్నానని బ్రహ్మనాయుడు అన్నారు. ఒక్క పల్లెటూరులో కూడా బొచ్చెడు కాదు కదా దోసెడు ఇసుక కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. కలెక్టర్‌తోపాటు మైనింగ్‌ అధికారులకు చెప్పినా ఉపయోగం లేకుండా పోయిందని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చినా ఇసుక విషయానికి వచ్చేసరికి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని... జిల్లాలో నాడు-నేడు, ఉపాధి హామీ పనులకు కూడా ఇసుక సరఫరా చేయలేని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఈ విధంగా ఇసుక దోపిడీపై మాట్లాడటంతో ఇది ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం ఉందని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు.

    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Guntur, Sand issue, Ysrcp