శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డికి అవమానం జరిగింది. జిల్లాలో జరిగిన గణతంత్ర వేడుకలకు కనీసం ఆయన్ను ఆహ్వానించలేదు అధికారులు. దీంతో జిల్లా అధికారులపై మాజీ మంత్రి, వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డికి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి, అధికార పార్టీకి చెందిన నేత అయిన తనకు కూడా గణతంత్ర వేడుకలకు ఆహ్వానం రాకపోవడంపై మండిపడ్డారు. ఈ విషయంపై జిల్లా అధికారుల మీద నిరసన తెలిపారు. ‘జిల్లా ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలను కూడా గణతంత్ర వేడుకలకు పిలవరా? నన్ను ఎందుకు ఆహ్వానించలేదు? అధికారుల నిర్లక్ష్యమా? లేకపోతే అహంకారమా?. ఎందుకు ఆహ్వానించలేదని ప్రోటోకాల్ అధికారిని అడిగితే మేం చిన్నవాళ్లం. మీకు సమాధానం చెప్పలేం అంటున్నాడు. దీన్ని వదిలి పెట్టం. దీనిపై రాష్ట్ర ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తా.’ అని ఆనం రాంనారాయణరెడ్డి హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్ అయిన ఆనం రామనారాయణరెడ్డి మొదట కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2019 ఎన్నికల్లో పోటీ చేసి వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మొదటి నుంచి కొంత నిరసనతోనే ఉన్నారు. అప్పుడప్పుడు తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. గతంలో అధికారుల మీద, అలాగే పార్టీ అధినాయకత్వం మీద కూడా నిరసన తెలిపారు.
గతంలో కూడా ఆనం మాట్లాడుతూ ఏడాది నుంచి తన నియోజకవర్గానికి తాను ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎమ్మెల్యే పదవి అలంకారం కాదని... గతంలో అనేకసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశానని ఆయన తెలిపారు. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 23 జిల్లాలకు మంత్రిగా పని చేశానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జిల్లా అధికారులు వెంకటగిరి నియోజకవర్గాన్ని మర్చిపోయారేమో అని ఆనం అన్నారు. తాను ఎంతో ఆవేదనతో మాట్లాడాల్సి వస్తుందని అన్నారు. ప్రజల కోసం ఎవరినైనా నిలదీస్తానని ఆయన అన్నారు. సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా ప్రజలకు అందేవి తప్ప... మిగతా ఏ కార్యక్రమాలు తాను చేయలేకపోతున్నానని ఆనం తెలిపారు. సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు.ఇంత అధ్వాన్నపు అధికార యంత్రాంగాన్ని చూడలేదని అన్నారు. జలవనరులశాఖలో అధికారులే నీళ్లు అమ్ముకున్నారంటూ విమర్శలు చేశారు. మంత్రులకు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం డీపీఆర్‌లు ఇస్తే... అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anam Ramanarayana Reddy, Andhra Pradesh, Nellore Dist, Republic Day 2021, Ysrcp