మాజీమంత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మరోసారి అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గణతంత్ర వేడుకలకు తనను ఆహ్వానించకపోవడంపై మండిపడ్డారు. అధికారుల తీరు ఏ మాత్రం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై కోర్టును ఆశ్రయిస్తానని వ్యాఖ్యానించారు. అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టేందుకు సైతం వెనకాడబోనని ఆనం రామనారాయణరెడ్డి వారిని హెచ్చరించారు. యంత్రాంగం తీరుపై తాడోపేడో తేల్చుకుంటానని ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అనేక అవమానాలు ఎదుర్కొంటున్నానని ఆనం రామనారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్వహించే ఓ అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్యేల పాత్ర ప్రహసనంగా మారిందని అన్నారు. ఇందుకు సిగ్గుపడాలా లేదా బాధపడాలా అనే పరిస్థితి తలెత్తిందని ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు.
అయితే అధికార యంత్రాంగంపై ఆనం రామనారాయణరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది కూడా ఆయన ఇదే రకంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది నుంచి తన నియోజకవర్గానికి తాను ఏమీ చేయలేకపోయానని అన్నారు. తనకు ఎమ్మెల్యే పదవి అలంకారం కాదని... గతంలో అనేకసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశానని ఆయన తెలిపారు. తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలకు మంత్రిగా పని చేశానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జిల్లా అధికారులు వెంకటగిరి నియోజకవర్గాన్ని మర్చిపోయారేమో అని ఆనం అన్నారు. తాను ఎంతో ఆవేదనతో మాట్లాడాల్సి వస్తుందని అన్నారు. ప్రజల కోసం ఎవరినైనా నిలదీస్తానని ఆయన అన్నారు.
సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా ప్రజలకు అందేవి తప్ప... మిగతా ఏ కార్యక్రమాలు తాను చేయలేకపోతున్నానని ఆనం తెలిపారు. సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు.ఇంత అధ్వాన్నపు అధికార యంత్రాంగాన్ని చూడలేదని అన్నారు. జలవనరులశాఖలో అధికారులే నీళ్లు అమ్ముకున్నారంటూ విమర్శలు చేశారు. మంత్రులకు తన నియోజకవర్గ అభివృద్ధి కోసం డీపీఆర్లు ఇస్తే... అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
రోజులు గడుస్తున్న అధికార యంత్రాంగం తీరుపై ఆనం రామనారాయణరెడ్డి అసంతృప్తి ఏ మాత్రం తగ్గకపోవడంతో.. ఆయన వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.
Published by:Kishore Akkaladevi
First published:January 27, 2021, 19:39 IST