news18-telugu
Updated: August 29, 2019, 2:36 PM IST
తెలుగుదేశం పార్టీ లోగో
తెలుగుదేశం పార్టీ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణ మూర్తిపై కేసు నమోదు అయింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ప్రోటో కాల్ విషయంలో ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే కరణం బలరాం.. అసభ్య పదజాలంతో తనను దూషించారని.. వైసీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ యడం రవిశంకర్.. చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో చీరాల 1 టౌన్ సీఐ నాగమల్లేశ్వర్రావు కేసు నమోదు చేశారు. ఆగస్ట్ 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చీరాల ఎమ్మార్వో కార్యాలయంలో వివాదం జరిగింది. కరణం బలరాంను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. కరణం వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు కూడా పోటీగా నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు.

కరణం బలరాం(ఫైల్ ఫోటో)
గత ఎన్నికల్లో చీరాల నుంచి వైసీపీ టికెట్ మీద పోటీ చేసిన ఆమంచి కృష్ణ మోహన్ ఓడిపోయారు. ఆయనపై కరణం బలరాం విజయం సాధించారు. ఆ తర్వాత నుంచి నియోజకవర్గంలో ఇద్దరి మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. అధికార పార్టీ నేతను కాబట్టి తన హవానే నడవాలని ఆమంచి పట్టుపడుతున్నారు. ఎమ్మెల్యే కాబట్టి, తాను చెప్పినట్టే జరగాలని కరణం బలరాం భీష్మించుకుంటున్నారు. దీంతో ఇద్దరు నేతల మధ్య పోలీసులు, అధికారులు నలిగిపోతున్నారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
August 29, 2019, 2:25 PM IST