ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan mohan Reddy) మీద కొందరు వైసీపీ (YSRCP) నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. సీఎం జగన్ ఇటీవల అసెంబ్లీ సమావేశాల (AP Assembly Sessions) సందర్భంగా రెండు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే తీసుకొచ్చిన రెండు బిల్లులను, ఒక తీర్మానాన్ని వెనక్కి తీసుకున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ (CRDA Bill) రద్దు బిల్లులను వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత రోజే శాసనమండలిని (AP Legislative council) రద్దు చేయాలని చేసిన తీర్మానాన్ని కూడా వెనక్కి తీసుకుంటూ మరో తీర్మానం చేశారు. వైఎస్ జగన్ తన వైఖరికి విరుద్ధంగా చేసిన ఈ రెండు పనులు కొందరు వైసీపీ నేతల్లో ఆశలు చిగురింపచేస్తున్నాయి. తమ ముఖ్యమంత్రి ఆ డెసిషన్ కూడా వెనక్కి తీసుకుంటే తమ పంట పండినట్టేనని ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇంతకీ ఆ వైసీపీ నేతలు ఎవరో కాదు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు. తాజాగా ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీలు ఎన్నికయ్యారు. చిన్న గోవిందరెడ్డి, ఇషాక్ బాషా, పాలవలస విక్రాంత్ వర్మకు ఎమ్మెల్యే కోటాలో పెద్దల సభకు వెళ్లారు. మరోవైపు ఎనిమిది జిల్లాల్లో స్థానిక సంస్థల కోటా కింద మరో 11 మంది ఎమ్మెల్సీలు శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
చిత్తూరు నుంచి కృష్ణ రాఘవ జయేంద్ర భరత్, అనంతపురం నుంచి ఎల్లారెడ్డిగారి శివరామిరెడ్డి, ప్రకాశం నుంచి తూమాటి మాధవరావు, గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు, కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్, తూర్పుగోదావరి నుంచి అనంత సత్య ఉదయ భాస్కర్, విశాఖపట్నం నుంచి వరుదు కళ్యాణి, చెన్నుబోయిన శ్రీనివాస్, విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.
ఇప్పుడు వైసీపీకి శాసనమండలిలో మెజారిటీ వచ్చింది. ఇదే వైసీపీ నేతల్లో ఆశలు చిగురింపజేస్తోంది. రాబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఎమ్మెల్సీలను కూడా తీసుకుంటే బాగుంటుందని ఆశ పెట్టుకున్నారు. గతంలో మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసిన సందర్భంగా ఇద్దరు ఎమ్మెల్సీలను కేబినెట్ నుంచి తప్పించారు సీఎం జగన్. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లను రాజ్యసభకు పంపించారు. వారి స్థానంలో కొత్త మంత్రులను తీసుకున్నారు.
ఇప్పుడు శాసనమండలిలో మెజారిటీ వచ్చింది కాబట్టి ఎమ్మెల్సీలను కూడా కేబినెట్ లోకి తీసుకుంటే బాగుంటుందని, సీఎం జగన్ ఈ విషయంలో కూడా మనసు మార్చుకోవాలని కోరుకుంటున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ys jagan mohan reddy, Ysrcp