ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని చోట్ల స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదయవుతోంది. వీరి వ్యవహార తీరు ఆ పార్టీ అగ్ర నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారుతోంది. పార్టీని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది. గుంటూరు జిల్లా, సత్తెనపల్లిలోని స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య స్మృతి వనంలో వైసీపీ నేత పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే సత్తెన పల్లి టౌన్ వైసీపీ యూత్ వింగ్ అధ్యక్షుడు అచ్యుత శివప్రసాద్ జన్మదిన వేడుకలను ఎలాంటి అనుమతి లేకుండానే వావిలాల స్మృతి వనంలో నిర్వహించారు. అంతేకాదు లౌడ్ స్పీకర్లు పెట్టి మద్యం మత్తులో సినిమా పాటలకు చిందులేశారు. అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్సులు కూడా ఏర్పాటు చేశారు. మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడి సమాధి వద్దే మందుకొడుతూ ఎంజాయ్ చేశారు.
నిబంధనల ప్రకారం రాతి 7గంటలు దాటితే స్మృతివనంలోకి ఎవర్నీ అనుమతించరు. అలాంటిది రాత్రి 9గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు మాజీ కౌన్సిలర్లు, మున్సిపల్ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు అమ్మాయిలతో చిందులు వేశారు. వైసీపీ నేతల ఆగడాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎంత అధికారంలో ఉంటే మాత్రం ఒక మహనీయుడ్ని అవమానించేలా ప్రవర్తిస్తారా అని స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ విచారణకు ఆదేశించారు.
ఎలాంటి అభివృద్ధికి నోచుకోని వావిలాల స్మృతివనాన్ని గత ప్రభుత్వం రూ.10కోట్లతో సుందరంగా తీర్చిదిద్దింది. స్థానికులు పవిత్రస్థలంగా భావించే స్మృతి వనంలో మందుపార్టీలు చేసుకోవడంపై వివిధ పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీ, జనసేన నాయకులు నిరసలను చేపట్టారు. టీడీపీ ఆధ్వర్యంలో స్మృతివనాన్ని పసుపునీటితో శుద్ధి చేశారు.
ఇప్పటికే పలు వైసీపీ నేతల తీరుతో ఇరుకున పడుతున్న ప్రభుత్వం.. ఈ చర్యతో మరిన్ని విమర్శలు ఎదుర్కోక తప్పేలా లేదు. ఏ రోడ్డుపైనో పార్టీలు జరిగి న్యూసెన్స్ జరిగితే వేరుకానీ ఓ వావిలాల గోపాల కృష్ణయ్యలాంటి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడి సమాధినే రికార్డింగ్ డాన్సులకు వేదికగా చేయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. వావిలాల గోపాలకృష్ణయ్య స్ఫూర్తితోనే మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్తున్న వైసీపీ ప్రభుత్వం మరి ఇలాంటి నేతలపై చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bjp, Guntur, Janasena, Liquor ban, Ysrcp