news18-telugu
Updated: September 30, 2020, 8:06 PM IST
ఫ్రతీకాత్మక చిత్రం
ఏపీ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవులను భర్తీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 56 కులాలకు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం.. ఆ కార్పొరేషన్లకు చైర్పర్సన్లను ప్రకటించింది. మొత్తం 56 బీసీ కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం.. వాటికి చైర్మన్లను నియమించింది. వీరిలో సగం పదవులను మహిళలకే కేటాయించింది. జిల్లాల వారీగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలకు 6 పదవులు, విశాఖ, కృష్ణా జిల్లాలకు 5 పదవులు దక్కాయి. అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలకు 4 పదవులు దక్కాయి.
అన్ని జిల్లాల్లోనూ సగం పదవులు మహిళలకు దక్కేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఎన్నడూలేని విధంగా భారీ సంఖ్యలో కులాలకు ప్రాతినిధ్యం దక్కనుంది. ఆయా కులాల ఆర్థిక, సామాజిక ప్రగతికి ఆయా కార్పొరేషన్లు తోడ్పాటు అందించన్నాయి. మొత్తంగా 56 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన జగన్ ప్రభుత్వం.. వన్నికుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, బెస్త, ఈడిగ, నాగవంశీయులు, పులనాటి వెలమ తదితర కులాలకూ కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. 30 వేల పైబడి జనాభా ఉన్నవాందరికీ కార్పొరేషన్ల ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఆయా కార్పొరేషన్లలో డైరెక్టర్ల పదవుల్లో 50 శాతం మహిళలకు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఏపీలో బీసీలకు చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని వైసీపీ ఆరోపిస్తూ వస్తోంది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీల కోసం సీఎం జగన్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని వెల్లడించింది. ఈ క్రమంలోనే బీసీలకు మరింత మేలు చేసేందుకు వారి కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించింది జగన్ ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే 56 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. తాజాగా ఆయా కార్పొరేషన్లకు చైర్పర్సన్లను నియమించింది. అందులోనూ మహిళలకు 50 శాతం పదవులు కేటాయించింది తమ ప్రభుత్వం మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందనే సంకేతాలు పంపించింది.
Published by:
Kishore Akkaladevi
First published:
September 30, 2020, 7:58 PM IST