Andhra Pradesh: ఎస్ఈసీ భేటీకి వైసీపీ దూరం.. మళ్లీ నిమ్మగడ్డ వర్సెస్ జగన్ తప్పదా ?

Andhra Pradesh: కరోనా కారణంగా వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు సిద్ధమవుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్.. ఇందులో భాగంగా రేపు రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కావాలని నిర్ణయించింది.

news18-telugu
Updated: October 27, 2020, 10:27 PM IST
Andhra Pradesh: ఎస్ఈసీ భేటీకి వైసీపీ దూరం.. మళ్లీ నిమ్మగడ్డ వర్సెస్ జగన్ తప్పదా ?
నిమ్మగడ్డ రమేశ్ కుమార్, వైఎస్ జగన్
  • Share this:
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలో వివిధ పార్టీలతో ఎస్‌ఈసీ(రాష్ట్ర ఎన్నికల సంఘం) నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండాలని రాష్ట్రంలోని అధికార పార్టీ వైసీపీ నిర్ణయించింది. కరోనా కారణంగా వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు సిద్ధమవుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్.. ఇందులో భాగంగా రేపు రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కావాలని నిర్ణయించింది. రేపు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఎస్ఈసీ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పార్టీల అభిప్రాయం తీసుకోబోతున్నారు.

ఒక్కో పార్టీ నుంచి ఒక్కో ప్రతినిధికి ఆహ్వానం పంపారు. హాజరైన ప్రతినిధితులతో ఎస్ఈసీ విడివిడిగా సమావేశం కానుంది. పార్టీల అభిప్రాయాలను రాతపూర్వకంగా ఇవ్వాలని పార్టీలను కోరింది. పార్టీల అభిప్రాయం అనంతరం దీనిపై ఎస్ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ఏమాత్రం సముఖంగా లేదు. రోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యమని ప్రభుత్వంలోని మంత్రులు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తాను చెప్పినట్టే జరగాలన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు.

మరోవైపు నవంబర్, డిసెంబర్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉండే అవకాశం ఉందని.. అప్పటి పరిస్థితిని బట్టి స్థానిక సంస్థల ఎన్నికలపై తరువాత నిర్ణయం తీసుకుంటామని మరో ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని ఎస్ఈసీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో రేపు రాజకీయ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఎలాంటి అభిప్రాయం చెబుతాయి ? ఆ తరువాత దీనిపై ఎస్ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే అంశం ఆసక్తికరంగా మారింది.
Published by: Kishore Akkaladevi
First published: October 27, 2020, 10:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading