YSRCP CHALLENGE FOR TDP REGARDING THEIR PARTY WINNERS IN AP PANCHAYAT ELECTIONS AK
YSRCP VS TDP: వాళ్లంతా మావాళ్లే.. ఇదిగో సాక్ష్యం.. టీడీపీకి వైసీపీ సవాల్
చంద్రబాబు, సజ్జల రామకృష్ణారెడ్డి (ఫైల్ ఫోటో)
YSRCP VS TDP: టీడీపీ వెంటిలేటర్ మీద ఉందని ఆరోపించారు. ఆ పార్టీ కార్యకర్తలు కట్టువిప్పుకుని వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి జోస్యం చెప్పారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ముఖ్యనేత, ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆయన పరిస్థితి ఆడలేక మద్దెలు ఓడు అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. కొద్దిరోజుల క్రితం ఈ ఎన్నికల కోసం కేంద్ర బలగాలను పంపాలని లేఖ రాసిన చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ విఫలమైందని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ మొత్తంగా ఐదు వందల పైచీలుకు స్థానాల్లోనే గెలిచిందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ 2600కు పైగా స్థానాల్లో విజయం సాధించిందని స్పష్టం చేసింది. అసలు టీడీపీ తీరు ఎవరికీ అర్థంకావడం లేదని సజ్జల ఆరోపించారు.
మూడు రోజుల కిందట 38.74 శాతం తమ పార్టీ మద్దతు దారులు గెలిచారని టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారని గుర్తు చేసిన ఆయన.. ఇప్పుడు ఎస్ఈసీ విఫలం అయ్యిందని అనడం హాస్యాస్పదంగా ఉందని ధ్వజమెత్తారు. టీడీపీ చెబుతున్న ఈ రెండింటిలో ఏది వాస్తవం? అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాల కోసం YSRCPPoll.in వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. మొదటి విడతలో గెలిచిన 2,640 మంది వైసీపీ మద్దతుదారుల్లో 2616 మంది ఫోటోలు ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేశామని అన్నారు. ఈ జాబితాలోని సర్పంచులు మా మద్దతుదారులో కాదో పరిశీలించుకోవచ్చని సవాల్ విసిరారు. టీడీపీ వెంటిలేటర్ మీద ఉందని ఆరోపించారు. ఆ పార్టీ కార్యకర్తలు కట్టువిప్పుకుని వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారని సజ్జల రామకృష్ణారెడ్డి జోస్యం చెప్పారు.
ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తే ధిక్కరణ అంటూ నోటీసులు ఇస్తున్నారని, ఇప్పటికీ రాష్ట్ర ఎన్నికల అధికారిపై తమకు గౌరవం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో తోకకుక్కను ఆడించినట్లు కనిపించిందని ఎద్దేవా చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ వెళ్లడం ఆగిపోయి 12 రోజులైందని తెలిపారు. విశాఖ ఉక్కుపై తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి అన్నీ చెప్పారని తెలిపారు. సీఎం జగన్ క్షుణ్నంగా లేఖ రాశారని.. చేయాల్సినదంతా చేస్తున్నాం.. చేస్తామని చెప్పారు. ఒక ప్రభుత్వం ఏమేమి చేయాలో అన్ని చేస్తామని స్పష్టం చేశారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.