హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

చొక్కాలు చించుకుని, కొట్టుకుంటూ రచ్చ రచ్చ, వైసీపీలో భగ్గుమన్న విబేధాలు

చొక్కాలు చించుకుని, కొట్టుకుంటూ రచ్చ రచ్చ, వైసీపీలో భగ్గుమన్న విబేధాలు

ప్రతికాత్మక చిత్రం

ప్రతికాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కొట్టుకున్నాయి. ఒకే పార్టీకి చెందిన రెండు గ్రూపులు పరస్పరం దాడి చేసుకున్నాయి. రాళ్లు రువ్వుకున్నాయి. పిడిగుద్దులు కురిపించుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కొట్టుకున్నాయి. ఒకే పార్టీకి చెందిన రెండు గ్రూపులు పరస్పరం దాడి చేసుకున్నాయి. రాళ్లు రువ్వుకున్నాయి. పిడిగుద్దులు కురిపించుకున్నాయి. ఈ ఘటనలో రెండు వర్గాల వారికి గాయాలు అయ్యాయి. కొందరి చొక్కాలు కూడా చిరిగిపోయాయి. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని కేసరపల్లి గ్రామంలో కొన్ని అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే టీడీపీలో గెలిచి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వంశీ వర్గం పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అదే కార్యక్రమానికి మరో వర్గం కూడా హాజరైంది. ఈ సందర్భంగా గొడవ జరిగింది. మాజీ సైనిక ఉద్యోగి ముప్పలనేని రవికుమార్ అనే వ్యక్తి గన్నవరం వ్యవసాయ సలహామండలి కమిటీ అధ్యక్షుడు గోపాలరావుపై అసభ్యకర పోస్టులు చేశారంటూ ఓ వర్గం ఆందోళనకు దిగింది. దీంతో మరో వర్గం కూడా ఎదురుదాడికి దిగింది. పరస్పరం దూషించుకున్నారు. దాడి చేసుకున్నారు. దీంతో పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టారు.

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ వర్గాల మధ్య ఇటీవల వర్గపోరు జరుగుతోంది. గన్నవరంలో ఇది చాలా ఎక్కువగా ఉంది. వల్లభనేని వంశీ టీడీపీ నుంచి వైసీపీలో చేరడాన్ని ముందు నుంచి ఉన్న నేతలు వ్యతిరేకిస్తున్నారు. వంశీపై పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు, మరో నేత దుట్టా రామచంద్రరావు వర్గాలు మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. వంశీకి వ్యతిరేకంగా మిగిలిన వారంతా ఒక్కటయ్యారు.

కొన్ని రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వర్గం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. ఆమంచి కృష్ణమోహన్ అనుచరులపై కరణం బలరాం వర్గం దాడి చేసింది. ఐలవల , బల్ల వల మత్స్యకారుల గొడవ ఆమంచి కృష్ణమోహన్, బలరం వర్గాల మధ్య గొడవకు దారి తీసింది. గొడవను సర్దుబాటు చేసేందుకు వచ్చిన మాజీ మంత్రి, రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకట రమణ ఎదుటే వారు కొట్టుకున్నారు. కరణం వర్గీయుల దాడిలో ఆమంచి వర్గానికి చెందిన వ్యవసాయ మార్కెట్ యార్డు డైరెక్టర్ బజ్జి బాబుకు గాయాలు అయ్యాయి. ఆమంచి సోదరుడు స్వాములు కారును కరణం అనుచరులు చుట్టుముట్టి అద్దాలు ధ్వంసం చేశారు. ఇరువర్గాల పరస్పర దాడుల్లో పోలీసు వాహనం ధ్వంసమైంది. ఘర్షణలో పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

అంతకు ముందు ప్రకాశం జిల్లాలోనే దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, పార్టీ నేత బూచేపల్లి శివప్రసాద్ మధ్య వైరం తలెత్తింది. ఈ ఇద్దరు నేతల మధ్య ఎప్పటి నుంచో వైరం ఉంది. అది తాజాగామరో సారి బయటపడింది. డిసెంబర్ 21న జగన్ బర్త్ డే కావడంతో అందు కోసం ముఖ్యమంత్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ నేతలు శివప్రసాద్ వర్గం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టింది. ఆ ఫ్లెక్సీలు మున్సిపాలిటీ అనుమతి లేకుండా ఏర్పాటు చేసిందంటూ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వర్గం వాటిని చించేసే ప్రయత్నం చేసింది. అలాగే, ఫ్లెక్సీల్లో పార్టీ ఎమ్మెల్యే పేరు, ఫొటో ఎందుకు వేయలేదంటూ గొడవకు దిగారు. దీంతో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారికి సర్దిచెప్పారు.

First published:

Tags: Andhra Pradesh, Vallabhaneni vamsi, Ysrcp

ఉత్తమ కథలు