వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల సంఖ్య 25కి చేరింది. ఇప్పటికే ప్రశ్నించిన వారు ఇస్తున్న సమాధానాలతో అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. ఎవర్నీ వదలకూడదన్న ఉద్దేశంతో సిట్ అధికారులు... వన్ బై వన్ అందర్నీ ప్రశ్నిస్తున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని నాలుగు రోజుల కిందటే అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన పోలీసులు... సోమవారం రాత్రి మరో అనుచరుడు పరమేశ్వర రెడ్డిని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. వివేకానంద రెడ్డితో ఉన్న భూ తగాదాల కారణంగా పరమేశ్వర రెడ్డే ఆయన్ని హత్య చేశాడనీ లేదా చేయించి ఉంటాడనీ అనుమానాలు తెరపైకి వచ్చాయి. పైగా... హత్య తర్వాత పరమేశ్వర రెడ్డి... పులివెందుల నుంచీ కుటుంబంతో సహా కనిపించకుండా పోయారు. ఐతే... ఆయన తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలియడంతో... సిట్ అధికారులు అక్కడకు వెళ్లి ఆయన్ని కలిశారు. అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఈ హత్యతో తనకు ఏ సంబంధమూ లేదని పరమేశ్వర రెడ్డి తెలిపారు.
పరమేశ్వర రెడ్డి అనుచరులుగా భావిస్తున్న మరో నలుగురు అనుమానితులను సిట్ అధికారులు తాజాగా ప్రశ్నించారు. సింహాద్రిపురం మండలం కతనూరుకు చెందిన శేఖర రెడ్డి, సునీల్ యాదవ్‌తో పాటూ... మరో ఇద్దర్ని ప్రశ్నించారు. వీళ్లతోపాటూ... మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి పులివెందుల పట్టణంలో లక్ష్మీ థియేటర్ వెనుక వీధిలో తన ఇంట్లో ఉన్న పెద్దసోమప్పగారి చంద్రశేఖర్‌రెడ్డి (దిద్దెకుంట శేఖర్)ని పోలీసులు ప్రశ్నించారు.
కిరాయి హంతకుడైన శేఖర్ రెడ్డిపై ఇప్పటికే చాలా హత్య కేసులున్నాయి. ఈమధ్యే బెయిల్ పై బయటకు వచ్చిన ఆయన ఈ హత్య చేసి ఉంటాడన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఆ కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఇప్పటివరకూ వివేకానంద రెడ్డి పీఏ దగ్గరి నుంచి డ్రైవర్ వరకు అందర్నీ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. వైఎస్ కుటుంబ సభ్యుల్ని పోలీస్ స్టేషన్‌కు పిలిచి వారి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. దర్యాప్తు ఎంతవరకూ వచ్చిందన్న విషయం మాత్రం బయటపెట్టట్లేదు.
హైకోర్టుకు జగన్ : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని వైసీపీ అధినేత జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్యను సీఎం చంద్రబాబు చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు తన చిన్నాన్న హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిట్ దర్యాప్తు ద్వారా నిజం బయటకు వస్తుందనే నమ్మకం తమకు లేదనీ, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని జగన్ కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు బుధవారం విచారణ జరపబోతోంది.
వివేకా హత్య జరిగిన రోజు నుంచే జగన్‌తో పాటు, వైసీపీ నేతలు చాలా మంది ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు. ఏపీ ప్రభుత్వం మాత్రం ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తే సరిపోతుందని తేల్చి చెప్పింది. జగన్ ఇప్పుడు హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుదనే దానిపై ఆసక్తి ఉంది. కోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తుందా ? లేక సిట్ దర్యాప్తు సరిపోతుంది అని చెబుతుందా అన్నది ఇవాళ తేలే ఛాన్సుంది.
రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్రగడ్డ అనీల్ కూడా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. వివేకా కేసును చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్ నుంచి సీబీఐకి అప్పగించాలని కోరారు. ఏపీ ప్రభుత్వం, సిట్‌పై తమకు ఏ మాత్రం నమ్మకంలేదన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తేనే అసలు హంతకులెవరో తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలా ఈ కేసు ఓవైపు దర్యాప్తు, మరోవైపు హైకోర్టు విచారణను ఎదుర్కొంటోంది.
ఇది కూడా చూడండి :-
ఇవి కూడా చదవండి :
21న గాజువాకలో, 22న భీమవరంలో పవన్ కల్యాణ్ నామినేషన్... గెలిస్తే సీఎం అయ్యే ఛాన్స్
గోవా అసెంబ్లీలో నేడు బలపరీక్ష... నంబర్ గేమ్‌లో గెలిచేదెవరు?
గెలిస్తే ఎమ్మెల్యే... ఓడితే ఎమ్మెల్సీ... అందుకే నారా లోకేష్ పదవికి రాజీనామా చెయ్యలేదా?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, CBI, High Court, Ys jagan, YS Vivekananda reddy