మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (Ys Vivekanandha reddy) హత్య కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ పై సుప్రీంకోర్టు (Supreme Court)లో నేడు విచారణ జరిగింది. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో బెయిల్ మంజూరూ చేసినప్పుడు మెరిట్ ను పరిగణలోకి తీసుకోలేదు. అందుకే మరోసారి ఈ అంశంపై విచారణ జరపాలని తెలంగాణ హైకోర్టు (Telangana High court) ఆదేశించింది. ఈ మేరకు బెయిల్ రద్దు అంశాన్ని హైకోర్టుకు బదిలీ చేసింది. బెయిల్ పిటీషన్ పై అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే ఈ కేసు తెలంగాణ సీబీఐకి బదిలీ అయిన విషయం తెలిసిందే.
గతంలో బెయిల్..సవాల్ చేసిన సీబీఐ..
ఈ కేసులో ఎర్ర గంగిరెడ్డికి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే గంగిరెడ్డికి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు సీబీఐ పిటీషన్ ను తోసిపుచ్చింది. ఈ క్రమంలో సీబీఐ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
ఏపీలో న్యాయం జరగదని..
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీలో న్యాయం జరగదని ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన కుమార్తె సునీత దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఇటీవల పిటీషన్ వేసింది. ఇక దర్యాప్తు పురోగతిని కూడా నేరుగా పర్యవేక్షించాలని ఆమె పిటీషన్ లో పేర్కొంది. ఈ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు విచారణ జరిపింది. కేసుకు సంబంధించి విచారణపై వివేకా కూతురుకు, భార్యకు అసంతృప్తి ఉందన్న కారణంతో విచారణను తెలంగాణకు బదిలీ చేసింది. హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టుకు తదుపరి విచారణను బదిలీ చేస్తున్నట్టు కోర్టు తీర్పు ఇచ్చింది. ఇక ఈ కేసుకు సంబంధించి అన్ని పత్రాలు, ఛార్జ్ షీట్, అనుబంధ ఛార్జ్ షీట్ కూడా సీబీఐకి పంపించాలని కోర్టు ఆదేశించింది.
ఈ కేసును త్వరితగతిన, స్వతంత్రంగా, నిష్పాక్షికంగా తదుపరి దర్యాప్తు కొనసాగాలని కోర్టు సూచించింది. ఈ కేసులో పెద్ద ఎత్తున నిందితులను విచారించాల్సి ఉంటుంది కాబట్టి హైదరాబాద్ CBIకి పూర్తి సహకారం అందించాలని ఆదేశాలు ఇచ్చింది. బాధితులకు న్యాయం జరుగుతుందని మాత్రమే కాదు న్యాయం జరగాలని కోర్టు చెప్పింది. న్యాయం జరగాలనుకోవడం బాధితురాలి యొక్క ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు కేసును తెలంగాణకు బదిలీ చేస్తున్నట్టు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సుందరేష్ లతో కూడిన ధర్మాసనం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది.
3 ఏళ్లుగా దర్యాప్తు..
వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ 3 ఏళ్లుగా కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి గంగిరెడ్డి, ఉమా శెంకర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, షేక్ దస్తగిరిలను నిందితులుగా పేర్కొంటూ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆ తర్వాత షేక్ దస్తగిరి అప్రూవర్ గా మారాడు. దీనితో కేసులో మరికొంత మంది ప్రమేయం ఉందొ లేదో తెలుసుకోడానికి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Ap, AP High Court, Ys viveka murder case, YS Vivekananda reddy