news18-telugu
Updated: July 18, 2020, 5:28 PM IST
వైఎస్ వివేకానంద రెడ్డి (File)
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముందడుగు పడింది. ఏపీ హైకోర్టు ఆదేశాలతో కేసును విచారించేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. సీబీఐ అధికారులు కడప ఆర్ అండ్ బీ గెస్ట్ లో కేసు విచారణను ప్రారంభించారు. ఈ కేసును ఏపీ ప్రభుత్వం సిట్‌కు అప్పగించింది. సిట్ ఇప్పటి వరకు జరిపిన విచారణ గురించి సీబీఐ అధికారులకు అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ అన్బురాజన్ ఈ సిట్‌కు నేతృత్వం వహించారు. ఈ క్రమంలో ఆయన్ను కూడా కలిసి వివరాలు సేకరించనున్నారు.
2019 మార్చిలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ దర్యాప్తు చేపట్టాలని అప్పటి ప్రతిపక్ష నేత, నేటి సీఎం జగన్ డిమాండ్ చేశారు. హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. అయితే అధికారంలోకి వచ్చాక హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. వివేకా కూతురు సునీత దీనిపై మళ్లీ హైకోర్టుకు వెళ్లారు. సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. సునీత పిటిషన్‌ను విచారించిన ఉన్నత న్యాయస్థానం.. హత్య కేసుగా నమోదు చేయాలని, దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసులో మరికొందరు టీడీపీ నేతలు కూడా హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సిట్ విచారణ జరిపితే తమను అన్యాయంగా ఇరికించే అవకాశం ఉందంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కోర్టు విచారణ జరిపి.. కేసును సీబీఐకి అప్పగించింది.
ఇవాళ్టి నుంచి సీబీఐ దర్యాప్తు చేపట్టింది. సిట్ బృందం నుంచి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ కేసులో సిట్ తొలుత వేగంగా దర్యాప్తు జరిపినా..ఆ తర్వాత నిదానించింది. సుమారు 1400 మందిని విచారించినా ఏదీ తేల్చలేకపోయింది. సిట్ దర్యాప్తుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసును సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు చేసి.. నివేదిక అందించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
July 18, 2020, 5:28 PM IST