YS Viveka Murder Case: పులివెందులలోని వైఎస్ వివేక ఇంటిని మరోసారి పరిశీలించిన సీబీఐ.. కేసు విచారణకు ఎస్పీ స్థాయి అధికారి..

ప్రతీకాత్మక చిత్రం

గత 50 రోజులుగా సీబీఐ అధికారులు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారు వివేకానందరెడ్డి సన్నిహితులతో పాటుగా, పలువురిని ప్రశ్నించారు.

  • Share this:
    మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. విచారణలో భాగంగా ఆరుగురితో కూడిన సీబీఐ అధికారుల బృందం నేడు పులివెందులకు చేరుకుంది. ఈ క్రమంలోనే వారు వైఎస్ వివేకానందరెడ్డి ఇంటిని మరోసారి క్షుణంగా పరిశీలించారు. గత 50 రోజులుగా సీబీఐ అధికారులు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారు వివేకానందరెడ్డి సన్నిహితులతో పాటుగా, పలువురిని ప్రశ్నించారు. ఇటీవల జమ్మలమడుగు మేజిస్ట్రేట్ వద్ద.. వివేకానందరెడ్డి వాచ్‌మెన్ రంగన్న వాంగ్మూలం కూడా నమోదు చేశారు.

    ఇక, ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు.. వాచ్‌మెన్ రంగయ్యతో పాటు వివేకా ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఇనాయతుల్లా, మాజీ డ్రైవర్‌ దస్తగిరి, పులివెందులకు చెందిన వైసీపీ కార్యకర్త కిరణ్‌కుమార్‌ యాదవ్‌, కిరణ్ సోదరుడు సునీల్‌కుమార్‌ యాదవ్‌, తల్లిదండ్రులు కృష్ణయ్య, సావిత్రి, సోదరి నందిని, మైనింగ్‌ వ్యాపారి గువ్వల గంగాధర్‌, కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి యజమాని లక్ష్మిరెడ్డి తదితరులను విచారించిన సీబీఐ.. రంగయ్య నుంచి కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం.

    విచారణలో రంగయ్య కీలక విషయాలు వెల్లడించడంతో.. జమ్మలమడుగు మేజిస్ట్రేట్ వద్ద అతని స్టేట్‌మేట్ రికార్డు చేశారు. సెక్షన్‌ 164 కింద రంగన్న వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్‌ ఫక్రూద్దీన్‌ రికార్డు చేశారు. అనంతరం సీబీఐ అధికారులు రంగన్నను పులివెందుల బస్టాండ్‌లో వదిలి వెళ్లారు. అక్కడి నుంచి వాచ్‌మెన్‌ రంగన్న నడుచుకుంటూ ఇంటికి వెళ్లారు. అయితే వివేకానందరెడ్డి హత్య కేసులో తొమ్మిది మంది పాత్ర ఉందని, అందులో ఇద్దరు ప్రముఖులు ఉన్నట్లు రంగయ్య చెప్పినట్లు వార్తలు వెలువడ్డాయి. పులివెందులలో ఇంటికి చేరుకున్నాక రంగయ్య స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. తనకు భయం వేస్తోందని రంగన్న సమాధానమిచ్చారు. భయపడాల్సిన పనిలేదని పదే పదే ప్రశ్నించగా అక్కడున్నవారి చెవిలో.. వైఎస్ వివేకానందరెడ్డి సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, పాత డ్రైవర్‌ దస్తగిరి, సునీల్‌కుమార్‌ పేర్లను చెప్పారు.

    అయితే అంతకు ముందు మాత్రం రంగయ్య.. తాను ఏం చెప్పానో గుర్తులేదని అన్నాడు. సీబీఐ అధికారులు కూడా కేసు గురించి ఎవరితోనూ మాట్లాడవద్దని చెప్పినట్టుగా తెలిపాడు. ఇక, రంగయ్య వాంగ్మూలం ఆధారంగా సీబీఐ అధికారులు మరింత లోతైన దర్యాప్తు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, రంగయ్య చేసిన ఆరోపణలపై ఎర్ర గంగిరెడ్డి స్పందించారు. రంగన్నతో తనకు పరిచయమే లేదని అన్నారు. తానెవరినీ బెదిరించలేదని తెలిపారు. వివేకానందరెడ్డికి ద్రోహం చేసే వ్యక్తిని కాదని చెప్పారు.

    మరోవైపు వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు కోసం కొత్తగా సీబీఐ ఎస్పీ స్థాయి అధికారి రామ్‌కుమార్‌ను నియమించారు. ఇప్పటి వరకు మహిళా అధికారి సుధా సింగ్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరిగింది.. కానీ ఇటీవల ఢిల్లీకి తిరిగి వెళ్లిపోయారు. ఆమె స్థానంలో రామ్‌కుమార్ బాధ్యతలు చేపట్టారు. వివేకా కేసు దర్యాప్తు కీలకంగా ఉన్న సమయంలో ఈ మార్పు చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
    Published by:Sumanth Kanukula
    First published: