నాలో..నాతో..YSR: వైఎస్సార్‌పై విజయమ్మ పుస్తకం.. రేపే ఆవిష్కరణ

నాలో నాతో వైఎస్సార్ బుక్ కవర్ పేజీ

మరణం లేని మహానేత గురించి, తాను మరణించినా తన పథకాల్లో ఎప్పటికీ జీవించి ఉన్న మరణం లేని మంచి నాయకుడి గురించి, తెలుగువారంతా తమ కుటుంబమే అనుకున్న వైఎస్సార్ గురించి రాబోయే తరాలకు కూడా స్ఫూర్తి ఇవ్వాలన్న సత్సంకల్పంతో ఈ పుస్తకాన్ని ప్రజలముందుంచుతున్నానని విజయమ్మ అన్నారు.

 • Share this:
  దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఆయన సతీమణి విజయమ్మ మరో పుసక్త రాశారు. విజయమ్మ రాసిన ‘‘నాలో... నాతో... వైయస్సార్‌’’ పుస్తకాన్ని వైఎస్సార్ 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. తన తల్లి రాసిన ఈ పుస్తకాన్ని సీఎం వైఎస్ జగన్ బుధవారం ఇడుపులపాయలో ఆవిష్కరించనున్నారు. డాక్టర్‌ వైయస్సార్‌గారి సహధర్మచారిణిగా విజయమ్మ 37 ఏళ్ళ జీవితసారం ఈ పుస్తకం.

  వైఎస్ గురించి లోకం ఏమనుకుంటున్నదీ తాను ప్రజలనుంచి తెలుసుకున్నానని, ఆయన గురించి ప్రజలకు తెలియని కొన్ని విషయాలు తెలిపేందుకే ఈ పుస్తకాన్ని తీసుకువచ్చానని విజయమ్మ తన తొలి పలుకుల్లో తెలిపారు. డాక్టర్‌ వైయస్సార్‌ ఒక తండ్రిగా, భర్తగా, ఎలా ఉండేవారో ఈ పుస్తకం ఆవిష్కరించింది. కొడుకుగా, తండ్రిగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, అల్లుడిగా, మామగా, స్నేహితుడిగా, నాయకుడిగా... నిజ జీవితంలో వైయస్సార్‌గారు ఈ వేర్వేరు పాత్రల్లో ఎలా ఉండేవారో, ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో ఉన్నది ఉన్నట్టుగా విజయమ్మ వివరించారు.

  కుటుంబ సభ్యుల ప్రగతిని కోరినట్టే రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ప్రగతినీ కోరుకుని, అన్ని ప్రాంతాల్లో ఇంటింటా అందరికీ మేలు చేయబట్టే, తమ కుటుంబ సభ్యుల మాదిరిగానే రాష్ట్ర ప్రజలంతా డాక్టర్‌ వైయస్సార్‌ను ఇప్పటికీ ఆరాధిస్తున్నారని పుస్తకం ముందుమాటలో విజయమ్మ వివరించారు. డాక్టర్‌ వైయస్సార్‌ తన జీవితమంతా పెంచి, పంచిన మంచితనమనే సంపద తన పిల్లలూ మనవలకే కాకుండా... ఇంటింటా పెరగాలనే సంకల్పంతోనే ఈ పుస్తకాన్ని సవినయంగా సమాజం ముందుంచుతున్నానని పేర్కొన్నారు. ఆయన్ను ప్రేమించిన తెలుగు ప్రజలందరికీ ఈ పుస్తకాన్ని అంకితం చేస్తున్నాని ఆమె అన్నారు.

  తమ వివాహం, ఆ నాటి పరిస్థితులు, పేదల డాక్టర్‌గా వైయస్సార్, రాజకీయాల్లో ఆయన రంగ ప్రవేశం, చిన్ననాటినుంచి వైయస్సార్‌ నాయకత్వ లక్షణాలు, పేదల పట్ల కరుణ, రాజకీయాల్లో ఆటుపోట్లు, కుటుంబంలో ఆత్మీయతలు, పిల్లల చదువులు, వివాహాలు, దైవం పట్ల భక్తి శ్రద్ధలు, అందరివాడిగా గడిపిన జీవితం, పీసీసీ అధ్యక్షుడిగా మొదలు ముఖ్యమంత్రి వరకు ఎదురైన ఒత్తిడులు, చారిత్రక ప్రజా ప్రస్థానం, వైయస్‌ జగన్‌, షర్మిలలతో.. వారి కుటుంబాలతో వైఎస్సార్ అనుబంధాలు, మహానేత మరణంతో ఏదురైన పెను సవాళ్ళు, వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేవరకు పరిణామాలు... ఇవన్నీ ఈ పుస్తకంలో రేఖామాత్రంగా కొన్ని, వివరంగా మరి కొన్ని తెలిపారు.

  మరణం లేని మహానేత గురించి, తాను మరణించినా తన పథకాల్లో ఎప్పటికీ జీవించి ఉన్న మరణం లేని మంచి నాయకుడి గురించి, తెలుగువారంతా తమ కుటుంబమే అనుకున్న వైఎస్సార్ గురించి రాబోయే తరాలకు కూడా స్ఫూర్తి ఇవ్వాలన్న సత్సంకల్పంతో ఈ పుస్తకాన్ని ప్రజలముందుంచుతున్నానని విజయమ్మ అన్నారు. ఆయన జీవితమే తెరిచిన పుస్తకమని.. ఆయన ప్రజాప్రస్థానంలో ప్రతి అడుగూ ప్రజల జీవితంతోనే ముడిపడి ఉందని విజయమ్మ వివరించారు.
  Published by:Shiva Kumar Addula
  First published: