ఆరోగ్య శ్రీ (Aarogyasri) కింద చేస్తున్న చికిత్సా విధానాలను గణనీయంగా పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) తెలిపారు. ఇకపై ఆరోగ్యశ్రీ పరిధిలోకి 754 ప్రొసీజర్లు చేర్చడంతో.. మొత్తం ఆరోగ్యశ్రీ కిందకు 3,118 చికిత్స విధానాలు అందుబాటులో ఉంటాయని, సెప్టెంబర్ 5 నుంచి కొత్త చికిత్సా విధానాలు అమల్లోకి రానున్నట్లు నేరుగా ముఖ్యమంత్రే ప్రకటించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో వైద్యారోగ్యశాఖపై వైఎస్ జగన్ సమీక్ష (Review) నిర్వహించారు. ఈ సమీక్షలో పలు కీలక అంశాలు వెల్లడించారు.
పార్వతీపురం మన్యం జిల్లాలోనూ వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశం. అదేవిధంగా జిల్లాలో ఉండే ప్రభుత్వ ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్స్ అన్నీకూడా సంబంధిత జిల్లాలోని మెడికల్‌కాలేజీ పరిధిలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. మెడికల్ కాలేజీ పరిధిలోకి రానున్న వైద్య, పరిపాలనా కార్యకలాపాలు పకడ్బందీగా వైద్య సేవలు అందడానికి, సిబ్బంది మధ్య సమన్వయానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎవరి బాధ్యతలు ఏంటి? విధి విధానాలు ఏంటన్న దానిపై ఎస్‌ఓపీని తయారుచేయాలిని సీఎం ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని.. ఇకపై కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లుగా మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్లు ఉంటారని ముఖ్యమంత్రి తెలిపారు.
సమర్ధవంతంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయాలన్న సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం మూడు అంశాలపై దృష్టిపెట్టాలన్న జగన్ సూచించారు. విలేజ్ క్లినిక్, పీహెచ్‌సీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని.. దీనితర్వాత పూర్తిస్థాయిలో సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచనలు చేశారు. ఒక ప్రత్యేక అధికారిని నియమించుకుని ఈ పనులు ఎలా ముందుకు సాగుతున్నాయన్నదానిపై ప్రతిరోజూ సమీక్ష, పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు.
వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లపైనా సమీక్ష
ప్రతి విలేజ్‌క్లినిక్‌లో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్, ఒక ఏఎన్‌ఎం, ఒకరు లేదా ఇద్దరు ఆశావర్కర్లు ఉంటారని.. అంటే ప్రతి విలేజ్ క్లినిక్‌లో 3 నుంచి నలుగురు సిబ్బంది ఉంటారని.. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లను ఇకపై కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్‌గా పిలవాలని సీఎం ఆదేశించారు. విలేజ్ క్లినిక్స్‌లో 67 రకాల మందులు అందుబాటులో ఉంటాయని..14 రకాల పరీక్షలు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 6956 టెలీమెడిసన్ స్పోక్స్, 27 హబ్స్ ఏర్పాటు. మెడికల్ హబ్స్‌ను అన్ని జిల్లాల వైద్యకళాశాలల్లో ఏర్పాటు చేయాలని జగన్ చెప్పారు. జిల్లా వైద్య కళాశాల నేతృత్వంలోనే ఇవి పనిచేస్తూ.. ఈ మెడికల్ హబ్స్ నుంచి చికిత్సలకు అవసరమైన సలహాలు, సూచనలు వైద్యులకు వెళ్లాలని ఆదేశించారు.
బూస్టర్ డోస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ
18 ఏళ్లు పైబడ్డ వారందరికీ బూస్టర్ డోసు వేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చెప్పారు. పార్వతీపురం జిల్లాలోనూ వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన కార్యకలాపాలు అన్నీ అదే జిల్లాకు చెందిన వైద్యకళాశాల నేతృత్వంలో జరగాలంటూ కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యకలాపాలుకూడా జిల్లా మెడికల్‌కాలేజీలోనే ఉండాలని.. డీఎంఅండ్‌హెచ్‌ఓ, డీసీహెచ్‌ఎస్‌లను జిల్లా మెడికల్ కాలేజీ పరిధిలోకి తీసుకురావాలన్న సీఎం స్పష్టం చేశారు.
మొత్తంలో జిల్లాలో ఉండే అన్నిరకాల ఆస్పత్రులు, క్లినిక్స్‌కు సంబంధించిన వైద్య సంబంధిత కార్యకలాపాలు, పరిపాలనా కార్యకలాపాలు అన్నీ కూడా మెడికల్‌కాలేజీ నేతృత్వంలోనే ఉండాలన్న జగన్ ఆదేశించారు. ఎవరు ఏం చేయాలి? ఎవరి విధులు ఏంటి? ఎవరి బాధ్యతలు ఏంటి? అన్నదానిపై పకడ్బందీగా ఎస్‌ఓపీ తయారుచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ జె నివాస్, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జీ ఎస్ నవీన్ కుమార్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఏపీ వైద్య విధానపరిషత్ కమిషనర్ డాక్టర్ వి వినోద్ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ (డ్రగ్స్) రవిశంకర్, డాక్టర్ వైయస్సార్ ఏహెచ్‌సీటీ అడిషనల్ సీఈఓ ఎంఎన్ హరీంద్రప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aarogyasri, Health department, Review meeting, Ys jagan