ఈ నెల 11న వైసీపీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రభుత్వ పథకాలు(Government Schemes) అందుతున్న ఇళ్ల వివరాలు సేకరించి ఆ ఇళ్లకు స్టిక్కర్లు వేయనున్నారు. గృహసారధులు, వాలంటీర్ల సమన్వయంతో అలాంటి ఇళ్లను గుర్తించనున్నారు. ఆ ఇంటికి మా నమ్మకం నువ్వే అనే ట్యాగ్‌లైన్‌తో జగన్ (YS Jagan) స్టిక్కర్ వేయబోతున్నారు. ఇంటి యజమాని అనుమతితోనే స్టిక్కర్ వేయాలని నిర్ణయించారు. గృహసారధులు, వాలంటీర్ల నియామకంతో పాటు నియోజకర్గ ఇంఛార్జ్‌లు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 2019 ఎన్నికలకు ముందు రావాలి జగన్ కావాలి జగన్ అంటూ ఉండే స్టిక్కర్లను వైసీపీ(Ysrcp) కార్యకర్తలు ఇదే రకంగా పలు ఇళ్లకు అంటించారు.
ఈ నినాదం జనంలోకి బలంగా వెళ్లడానికి ఇది కూడా ఓ కారణమని వైసీపీ నాయకత్వం భావించింది. అప్పట్లో ఎన్నికల నినాదాన్ని ఇంటింటికి చేర్చిన వైసీపీ నాయకత్వం.. ఈసారి లబ్దిదారులకు తాము ఏం చేశామనే విషయాన్ని వారికి గుర్తు చేసేందుకు వీలుగా ఈ స్టిక్కర్‌ను రూపొందించినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే గృహసారధులు, వాలంటీర్లకు శిక్షణ అందించారు. ఇంటి యజమాని అనుమతి తీసుకున్న తరువాతే ఈ స్టిక్కర్లు వేయాలని వారికి సూచించారు. ఈ విషయంలో ఎవరినీ బలవంతం చేయకూడదని వారికి స్పష్టం చేశారు.
ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యనేతలు గడప గడపకు అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి.. వారికి ప్రభుత్వం ద్వారా ఏ రకమైన లబ్ది, పథకాలు అందుతున్నాయనే దానిపై ఆరా తీశారు. వారికి ఇంకా ఏం చేయాల్సి ఉందో తెలుసుకున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆధ్వర్యంలోని వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఎవరెవరికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయనే దానిపై జాబితాను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రజలకు తాము అందిస్తున్న పథకాలే, ఆర్థిక సాయం వంటి అంశాలే తమకు మళ్లీ గెలిపిస్తాయని వైసీపీ నాయకత్వం భావిస్తోంది.
Pawan Kalyan: సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ బిరుదు..వైరల్ గా మారిన ఆ కార్టూన్!
YS Jagan: జనంలోకి జగన్.. ఏప్రిల్ నుంచి సరికొత్త కార్యక్రమం..
తాము అమలు చేస్తున్న పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేస్తే సరిపోతుందని.. అలా చేయడం వల్ల వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు తమకే పట్టం కడతారని వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. ఇదే విషయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు సీఎం జగన్ కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. తాజాగా ఈ స్టిక్కర్ల ద్వారా ఇదే విషయాన్ని ప్రజలు, లబ్దిదారులకు గుర్తు చేయాలనే యోచనలో వైసీపీ ప్రభుత్వం ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.