రోజా, అంబటికి నామినేటెడ్ పదవులు... సీఎం జగన్ ఆలోచన ఇదేనా?

AP CM Jagan : ఏపీ కేబినెట్‌లో చోటు దక్కనివారికి సీఎం జగన్ ఎలా న్యాయం చేయబోతున్నారన్నది ఇప్పుడు తేలాల్సిన అంశం. నామినేటెడ్ పదవులు ఇస్తూ... కేబినెట్ హోదా కల్పిస్తారని సమాచారం.

Krishna Kumar N | news18-telugu
Updated: June 9, 2019, 10:24 AM IST
రోజా, అంబటికి నామినేటెడ్ పదవులు... సీఎం జగన్ ఆలోచన ఇదేనా?
రోజా, అంబటి రాంబాబు
  • Share this:
ఏపీ మంత్రివర్గ కూర్పు చాలా బాగుందనీ, కొన్ని విషయాల్లో ఏపీ సీఎం జగన్ అంచనాలకు అందని విధంగా నిర్ణయాలు తీసుకున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో... పార్టీని ముందుండి నడిపించిన రోజా, అంబటి రాంబాబు లాంటి వారికి మంత్రి పదవులు ఇవ్వకపోవడంపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఇందుకు ఎన్నో అంశాలు కారణమైనప్పటికీ... వారికి సరైన న్యాయం జరగలేదనే వాదన వినిపిస్తోంది. రెండున్నర ఏళ్ల తర్వాత మంత్రి పదవులు ఇస్తానని మాట ఇచ్చినా, అప్పటివరకూ వాళ్లకు ఏ పదవులు కట్టబెడతారన్నది తేలాల్సిన అంశంగా మారింది. ప్రధానంగా పార్టీలో కీలక సామాజిక వర్గం నేతలు చాలా మంది మంత్రిపదవులపై ఆశలు పెట్టుకొని, తీరా తమ సామాజిక వర్గానికి కేబినెట్‌లో ఎక్కువ ప్రాధాన్యం లేకపోయేసరికి షాకయ్యారు. జగన్ ఏం చెప్పినా వింటామంటూనే, లోలోపల మాత్రం కాస్త అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. అలాంటి వారిపై ఇప్పుడు సీఎం జగన్ దృష్టి పెట్టబోతున్నట్లు తెలిసింది. వారికి కేబినెట్ హోదా ఉండే నామినేటెడ్ పదవులు ఇవ్వాలనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో... ప్రతీ జిల్లా నుంచీ మంత్రి పదవులు ఆశించిన ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువగా ఉంది. అందువల్ల వారందర్నీ బుజ్జగించడం, అందరికీ సమన్యాయం కల్పించడమన్నది సీఎం జగన్ ముందున్న అసలు సవాలు. నిజానికి నామినేటెడ్ పదవులు వేల సంఖ్యలో ఉన్నాయి. వాటిలో కూడా అత్యంత ప్రాధాన్యం ఉన్నవి కొన్ని ఉన్నాయి. అంటే ఆర్టీసీ ఛైర్మన్, APIIC ఛైర్‌పర్సన్ వంటివి హాట్ సీట్లు. కార్పొరేషన్ల ఛైర్మన్ పదవులు కూడా ఇలాంటివే. ఈ పదవుల్లో ఉండేవారికి ఎంతో గుర్తింపు, కేబినెట్ హోదా లభిస్తుంది. అలాంటి పదవులు... రోజా, అంబటి రాంబాబు, ఆనం రాంనారాయణరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి వంటి వారికి దక్కే అవకాశాలున్నాయి.

ప్రస్తుతం జగన్ పరిపాలనపై దృష్టి సారిస్తూనే, మరోవైపు పార్టీలో అందరికీ న్యాయం చేసే అంశంపైనా దృష్టిపెట్టాల్సిన పరిస్థితి. కనీసం కార్పొరేషన్, నామినేటెడ్ పదవులైనా ఇస్తే, పార్టీలో ఉండే అసంతృప్తిని ఆదిలోనే అణచివేసే అవకాశం ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తండ్రి హయాం నుంచీ ఇలాంటివి ఎన్నో చూసిన జగన్... ఆ అనుభవాన్ని ఉపయోగించుకొని జాగ్రత్తగా డీల్ చేస్తే, పార్టీలో అంతర్గత సమస్యలు తలెత్తకుండా ఉంటాయనీ, తద్వారా పరిపాలనపై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశాలు లభిస్తాయని సూచిస్తున్నారు.

First published: June 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు