హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: మరో పథకానికి సీఎం జగన్ శ్రీకారం.. వందేళ్లలో ఇదే తొలిసారి..

Andhra Pradesh: మరో పథకానికి సీఎం జగన్ శ్రీకారం.. వందేళ్లలో ఇదే తొలిసారి..

భూరీసర్వే పథకాన్ని  ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్

భూరీసర్వే పథకాన్ని ప్రారంభిస్తున్న సీఎం వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సమగ్ర భూ రీసర్వే పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM YS Jagan) ప్రారంభించారు. వివాదాలకు తావులేకుండా సరర్వే నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో సమగ్ర భూసర్వే నిర్వహించేందుకు వైఎస్సార్‌– జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. కృష్ణాజిల్లా, జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడులో సరిహద్దు రాయిను పాతి భూ రీసర్వేకు శ్రీకారం చుట్టారు. అనంతరం రీ సర్వే కోసం సిద్ధం చేసిన డ్రోన్స్‌ ను ప్రారంభించి, సర్వే కోసం వినియోగించే పరికరాలను పరిశీలించారు. ఈ నెల 22 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రీ సర్వే ప్రారంభం కానుంది. మూడు విడతల్లో 1.26 కోట్ల హెక్టార్లలో సమగ్ర భూ సర్వే జరగనుంది. మొదటి దశలో 5వేల గ్రామాల్లో భూ రీసర్వే ప్రారంభం కానుంది. రెండో దశలో 6,500 గ్రామాలు, మూడో దశలో 5,500 గ్రామాల్లో భూ రీసర్వే చేపట్టనున్నారు.

పటిష్టంగా భూసర్వే..

వందేళ్లలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా భూముల రీసర్వే చేపడుతున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇకపై రాష్ట్రంలో భూమి కొనుగోలు చేస్తే అది బంగారం కొన్నట్లేనని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ భూసర్వే ద్వారా ఎవరైనా నష్టపోయినట్లు తెలితే ప్రభుత్వమే వారికి నష్టపరిహారం చెల్లిస్తుందని సీఎం స్పష్టం చేశారు. 2023నాటికి సర్వే పూర్తి చేసి స్పష్టమైన రికార్డులు నిర్వహిస్తామన్నారు. ఇకపై భూ వివాదాలకు తావులేకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పరిష్కార వేదికలను ఏర్పాటు చేస్తామన్నారు. సర్వేకి సంబంధించిన ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని.. భూ యజమానులు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. మిల్లీమీటర్ కూడా తేడా రాకుండా సర్వే ఆఫ్ ఇండియాతో సర్వే చేయిస్తున్నామన్నారు.

రాక్షసులు వస్తారు

ప్రభుత్వం చేపట్టిన ఈ మహాయజ్ఞాన్ని చెడగొట్టేందుకు దెయ్యాలు, రాక్షసులు తయారవుతున్నారని ప్రతిపక్షాలను ఉద్దేశించి జగన్ విమర్శించారు. తప్పుడు రాతలు, ప్రచారాలతో ఈ మహాయజ్ఞాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తారన్నారు. అసత్య ప్రచారాలను ప్రజలే తిప్పికొట్టాల్సిన అవసరముందన్నారు.

అమలు ఇలా..

సర్వే ఆఫ్‌ ఇండియా, రెవెన్యూ, సర్వే, పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖల సంయుక్త భాగస్వామ్యంతో మూడు దశల్లో దాదాపు రూ.1000 కోట్ల వ్యయంతో సమగ్ర భూముల సర్వే, ‘వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం’ అమలు చేస్తున్నారు. ఇందు కోసం 4500 బృందాలు పని చేయనున్నాయి. తొలి దశ సర్వే ఈనెల నుంచి వచ్చే ఏడాది (2021) జూలై వరకు, రెండో దశ సర్వే 2021 అక్టోబరు నుంచి 2022 ఏప్రిల్‌ వరకు, చివరిదైన మూడో దశ సర్వే జూలై 2022 నుంచి 2023 జనవరి వరకు కొనసాగనుంది.

ఎన్ని గ్రామాలు? ఎంత భూమి?

రాష్ట్రవ్యాప్తంగా 17 వేల గ్రామాల్లోని 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు, 13,371 గ్రామ కంఠాల్లోని 85 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, 110 పట్టణ ప్రాంతాల్లోని 40 లక్షల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు, 10 లక్షల ప్లాట్లలో ఈ సర్వే నిర్వహిస్తారు.


సర్వే విధానం

తొలుత గ్రామ సభల ద్వారా సర్వే విధానం, షెడ్యూలు, ప్రయోజనాలు వివరిస్తారు. ఆ తర్వాత గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శి, సర్వేయర్లతో కూడిన బృందాలు సర్వే నిర్వహిస్తాయి. డ్రోన్, కార్స్, రోవర్‌ వంటి పరికరాల ద్వారా ప్రతి స్థిరాస్తిని కచ్చితమైన భూ అక్షాంశ – రేఖాంశాలతో గుర్తించి కొత్తగా సర్వే, రెవెన్యూ రికార్డులు రూపొందిస్తారు. ప్రతి యజమానికి నోటీసు ద్వారా ఆ సమాచారం అందజేస్తారు. వాటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే, గ్రామ సచివాలయంలోని గ్రామ సర్వే బృందాల ద్వారా అప్పీలు చేసుకుంటే, అవి సత్వరం పరిష్కారం అయ్యేలా ప్రతి మండలంలో మొబైల్‌ మెజిస్ట్రేట్‌ బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. సర్వే పూర్తైన తర్వాత ప్రతి ఆస్తికి శాశ్వత హక్కు పత్రం ఇస్తారు. రెవెన్యూ రికార్డులు, ఇతర వివరాలు గ్రామాల్లో డిజిటల్‌ రూపంలో కూడా అందుబాటులో ఉంటాయి.

First published:

Tags: Ap cm ys jagan mohan reddy

ఉత్తమ కథలు