ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా ఓ అభిమాని చూపిన అత్యుత్సాహం వివాదానికి దారితీస్తోంది. కడప జిల్లా బద్వేలుకు చెందిన బసవరాము అనే వ్యక్తి సీఎం వైఎస్ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఓ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అంతా బాగానే ఉన్నా... దీనిపై రాసిన వ్యాఖ్యలు మాత్రం వివాదాస్పదంగా మారాయి. ఏసు క్రీస్తు ప్రభువు పాపుల కోసం ఈ లోకంలో జన్మిస్తే.. సీఎం జగన్ ప్రజల కోసం ఈ లోకంలో జన్మించారని పేర్కొన్నారు. ఫ్లెక్సీలో ఏం రాశారంటే.., “క్రీస్తు పాపుల కోసం అవమానాలు భరిస్తే.. జగన్ ప్రజల కోసం అవమానాలు, శ్రమలు అనుభవించారని రాసుకచ్చారు. నాడు క్రీస్తు పాపుల కోసం రక్తాన్ని చిందిస్తే.. నేడు జగన్ ప్రజల కోసం రక్తాన్ని చిందిస్తున్నారన్నారు. పాపుల కోసం ఏసు క్రీస్తు డిసెంబర్ 25న జన్మిస్తే.. ప్రజల కోసం సీఎం జగన్ డిసెంబర్ 21 జన్మించారన్నారు. దైవసమానుడైన సీఎం జగన్ కు జన్మదిన శుభాకాకంక్షలు అంటూ” అని పేర్కొన్నారు. పదలు కొద్దీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైఎస్ జగన్ పై అభిమానలం ఇలా కూడా చూపించొచ్చా అని కొందరంటున్నారు. సీఎంను దేవుడితో పోల్చడాన్ని మరికొందరు తప్పుబడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జన్మదిన వేడుకలు
మరోవైపు సీఎం వైఎస్ జగన్ జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. అన్ని జిల్లాల్లో మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు ప్రారంభించారు. సీఎం జగన్ బర్త్ డే సందర్భంగా సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎస్ నీలం సాహ్నీతో పాటు, ఇతర ఉన్నతాధికారులు కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు క్యాంప్ కార్యాలయంలో సీఎంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రముఖుల ట్వీట్లు
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎం జగన్కు బర్త్డే విషెస్ తెలియజేశారు. ఈ మేరకు ట్విటర్లో స్పందించిన ఆయన.. ‘వైఎస్ జగన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’. అని ట్వీట్ చేశారు. అలాగే ముఖ్యమంత్రికి ప్రముఖులు జన్మదిన శుభాకాకంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ మంత్రి కేటీఆర్, తమిళనాడు సీఎం పళనిస్వామితో పాటు పలువురు ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ తెలిపారు. పలువురు సినీ ప్రముఖులు కూడా జగన్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu naidu, Kadapa, KTR, Narendra modi, Palanisami, Ys jagan, Ysrcp