హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

యూ ట్యూబ్ బేబీకి చంద్రబాబు సన్మానం.. పాటకు సీఎం ఫిదా

యూ ట్యూబ్ బేబీకి చంద్రబాబు సన్మానం.. పాటకు సీఎం ఫిదా

babu baby file

babu baby file

సంగీతంలో ఓనమాలు కూడా తెలియదు. కానీ ఆమె ఎలాంటి పాటనైనా అద్భుతంగా పాడేయగలదు. ఆ టాలెంటే ఆమెను యూట్యూబ్ లో ఫేమస్ చేసింది. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రితో సన్మానం అందుకునేలా చేసింది.

సంగీతంలో ఓనమాలు తెలియకపోయినా.. అద్భుతగానంతో యూట్యూబ్‌లో సంగీత ప్రియులను అలరిస్తున్న పసల బేబీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఆటవిడుపుగా పాటలు పాడుతూ ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్న బేబీ టాలెంట్‌ని మెచ్చుకున్నారు. ఎంపీ మురళీమోహన్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి.. పసల బేబీని సీఎం చంద్రబాబుకు పరిచయం చేశారు. లక్షలాది మంది సినీ అభిమానులను తన గాత్రంతో మెప్పిస్తున్న బేబీని... శాలువా కప్పి, పుష్పగుచ్చం అందజేసి అభినందించారు చంద్రబాబు. బేబీని వెలుగులోకి తీసుకురావాలని పార్టీ నేతలకు సూచించారు.

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు గ్రామంలో నివసించే బేబీ.. పొలం పనులు చేసుకుంటూ జీవిస్తోంది. చిన్ననాటి నుంచి కమ్మని స్వరం ఆమె సొంతం. ఎలాంటి పాటనైనా అలవోకగా పాడేస్తుంది. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని, ఆమె పాడిన పాటలన్నీ ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆమె పాటను లైక్ కొట్టనివారు, షేర్ చేయని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఆమె పాడిన ప్రేమికుడు సినిమాలోని ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’ పాటకు లక్షలాది లైక్స్ వచ్చాయి. దీంతో టాలీవుడ్ కూడా ఆమె అవకాశాలిచ్చేందుకు ముందుకొచ్చింది. చిరంజీవి, కోటి, ఏఆర్ రెహ్మాన్, కీరవాణి, మురళీమోహన్ సహా పలువురు ఆమె టాలెంట్‌కు ఫిదా అయ్యారు. చిరంజీవి దంపతులు ఆమెను ఇంటికి పిలిచి అభినందించారు.

తాజాగా, ఎంపీ మురళీమోహన్ ఆమెను సీఎం చంద్రబాబుకు పరిచయం చేశారు. బేబీ మట్టిలో పుట్టిన మాణిక్యమని, వ్యవసాయ కూలీగా పనిచేస్తూ.. పాటలు పాడడం నేర్చుకుందని, ఆమె గాత్రం అద్భుతమని సీఎం కొనియాడారు. ఈ సందర్భంగా సీఎంకు ఒక పాటను పాడి వినిపించారు బేబీ. ఆమె పాటకు ఫిదా అయిన ముఖ్యమంత్రి.. అభినందనలతో ముంచెత్తారు. గాయనిగా మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు.

First published:

Tags: Ap, Chandrababu Naidu, Chiranjeevi, Youtube, Youtube star

ఉత్తమ కథలు